Hyderabad: వార్నీ రాపిడోను ఇలా కూడా వాడుతున్నారా? అసలు ఏం జరిగిందంటే?
సికింద్రాబాద్ తార్నాకలో మత్తు సిరఫ్‌ల విక్రయం కలకలం రేపింది. డాక్టర్ ప్రిస్ట్రిఫ్షన్ లేకుండా మత్తు కోసం వాడే సిరఫ్‌లను అక్రమంగా విక్రయిస్తున్నట్టు గుర్తించిన ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు.. మెడికల్ షాప్‌లో ఉన్న 50 సిరప్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆ మెడికల్ షాపు యజమానిని అరెస్ట్ చేశారు.

సికింద్రాబాద్ తార్నాకలోని నాగార్జున కాలనీలో మత్తు కోసం వినియోగిస్తున్న సిరప్‌లను ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ మెడికల్ షాపులో అక్రమంగా విక్రయిస్తున్న 50 మత్తు సిరప్ బాటిళ్లను సీజ్ చేశారు. ఎక్సైజ్ అధికారుల వివరాల ప్రకారం.. తార్నాకలోని ఏబీ జెనరిక్ మెడికల్ షాపులో మత్తు సిరప్‌లను అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారం అధికారులకు అందింది. దీంతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సై మంజు ఆధ్వర్యంలో అధికారులు షాపుపై దాడి చేశారు.
తనిఖీల్లో 50 సిరప్ బాటిళ్లు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్ డిపెండెన్సీ ఉన్న వ్యక్తులకు సిరప్‌లను విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. సాధారణంగా సుమారు రూ.200 ధర చేసే సిరప్ బాటిల్‌ను డిమాండ్‌ను బట్టి రూ.500 లేదా అంతకంటే ఎక్కువకు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో మెడికల్ షాపు యజమాని కాజా బషీర్ ఉద్దీన్ ఖాన్‌పై కేసు నమోదు చేశారు.
ప్రిస్క్రిప్షన్ లేకుండా సిరప్‌లను విక్రయించినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. కస్టమర్లకు సిరప్‌లను అందించేందుకు నిందితుడు ర్యాపిడో వంటి డెలివరీ సేవలను కూడా ఉపయోగించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. డిమాండ్‌ను బట్టి ఒక్కో బాటిల్‌కు రూ.500కుపైగా వసూలు చేసి డబ్బు సంపాదించినట్లు ఆయన వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న 50 సిరప్ బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ వ్యవహారంపై అధికారులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
