Governor Tamilisai: సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ పంపలేదు.. ఆ ప్రచారాన్ని ఖండించిన రాజ్‌భవన్..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ భవనం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకాకపోవడంపై పలు ఊహగానాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి గౌరవ గవర్నర్‌కు ఆహ్వానం అందిందని, ఆహ్వానం అందించిప్పటికీ హాజరు కాలేదంటూ ప్రచారం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొత్త సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. 28 ఎకరాల్లోని విశాల స్థలంలోని 7,79,982 చదరపు అడుగులు విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ భవనాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్.. తన ఛాంబర్ లో ఆసీనులై.. ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆ తర్వాత మంత్రులు, అధికారులు ఒకేసారి తమ తమ ఛాంబర్ లలో ఆసీనులయ్యారు. అంతేకాకుండా సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ భవనం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకాకపోవడంపై పలు ఊహగానాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి గౌరవ గవర్నర్‌కు ఆహ్వానం అందిందని, ఆహ్వానం అందించిప్పటికీ హాజరు కాలేదంటూ ప్రచారం జరిగింది. దీనిపై తెలంగాణ గవర్నర్ కార్యాలయం రాజ్‌భవన్ స్పందించింది. ఇలాంటి ప్రచారం తగదంటూ రాజ్ భవన్ మంగళవారం ప్రకటనను విడుదల చేసింది. సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ రాలేదు. ఆహ్వానం పంపామని చెప్పడం తప్పు.. ఆహ్వానం రానందుకు గవర్నర్ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్ళలేదు అంటూ రాజ్ భవన్ పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి గౌరవ గవర్నర్‌కు ఆహ్వానం అందిందని, ఆహ్వానం అందించినప్పటికీ గవర్నర్ హాజరు కాలేదన్న నిరాధారమైన, తప్పుడు ఆరోపణలను రాజ్‌భవన్ తీవ్రంగా ఖండించింది. కొత్త సచివాలయ భవన ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై ను ఆహ్వానిస్తూ ఎలాంటి ఇన్విటేషన్ పంపలేదని, కొత్త సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ఆమె రాకపోవడానికి ఇదే ఖచ్చితమైన కారణం అంటూ రాజ్ భవన్ స్పష్టం చేసింది.
మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం ఈ ప్రకటన విడుదల చేసింది. ఈర్య్షతోనే గవర్నర్ రాలేదంటూ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. అభివృద్ధి నిరోధకులు రానంత మాత్రాన పోయేదేమీ లేదంటూ వ్యాఖ్యానించారు. దీంతో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య మరో పంచాయితీ మొదలైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..