AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ..? రేవంత్ రెడ్డి ప్లాన్‌కు అధిష్టానం ఓకే చెబుతుందా..

లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని టీపీసీసీ యోచిస్తోంది. పార్టీకి కంచుకోటలా ఉన్న ఖమ్మం నియోజకవర్గం నుంచి రాహుల్‌ బరిలోకి దిగితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. మరోవైపు రాహుల్‌ పోటీకి దిగితే ధీటైన అభ్యర్థిని నిలబెట్టేందుకు కమలనాథులు కసరత్తు ప్రారంభించారు.

Rahul Gandhi: ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ..? రేవంత్ రెడ్డి ప్లాన్‌కు అధిష్టానం ఓకే చెబుతుందా..
Rahul Gandhi - Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Mar 06, 2024 | 9:24 AM

Share

తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ చేసింది. నెహ్రూ కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలంగాణ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని టీపీసీసీ కాంగ్రెస్‌ అధిష్టానానికి సూచిస్తోంది. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా సోనియా గాంధీ పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వచ్చినప్పటికీ ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. దీంతో ఈ ప్రతిపాదనకు తెరపడింది. సోనియా ప్రాతినిధ్యం వహించిన యూపీ రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కనీసం రాహుల్ గాంధీ అయినా తెలంగాణ నుంచి పోటీ చేయాలని టీపీసీసీ కోరుతోంది. కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న ఖమ్మం నుంచి రాహుల్‌ను బరిలోకి దించితే బాగుంటుందని సీఎం రేవంత్ కూడా యోచిస్తున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ అమేథీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ రాహుల్‌ గాంధీని ఓడించారు. అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్‌లోనూ పోటీ చేసిన రాహుల్‌ వాయనాడ్‌లో మాత్రం ఘన విజయం సాధించారు. అయితే ఈసారి వాయనాడ్‌లో ఇండియా కూటమి మిత్రపక్షం సీపీఐ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా సతీమణి అనీ రాజాను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో యూపీ అమేథీ నుంచి రాహుల్ తిరిగి పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా తెలియలేదు. బీజేపీ బలంగా ఉన్న ఉత్తరాదిలోనే రాహుల్ పోటీ చేయాలని ఇండియా కూటమిలోని మిత్ర పక్షాలు సూచిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో అమేథీ ఓటమి మిగిల్చిన చేదు అనుభవాల రీత్యా దక్షిణాదిన ఒక సేఫ్ సీట్ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. రాహుల్ పోటీ చేసేందుకు ఖమ్మం సరైన నియోజకవర్గమని టీపీసీసీ కాంగ్రెస్‌ అధిష్టానం సూచిస్తోంది. అయితే రాహుల్ ఎక్కణ్ణుంచి పోటీ చేస్తారన్న విషయంపై ఇంతవరకు పార్టీ హై కమాండ్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడితే.. ఆయనపై ఎవరిని బరిలోకి దించాలన్న విషయంపై టీ బీజేపీ కసరత్తు చేస్తోంది. రాహుల్ గాంధీని స్మృతీ ఇరానీలా ఢీకొట్టగలిగే నేత కోసం కమలనాథులు యత్నాలు ముమ్మరం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల నుంచే రాహుల్‌ను బరిలోకి దించాలని టీపీసీసీ ఖమ్మంతో పాటు మిగతా నియోజకవర్గాలనూ పరిశీలిస్తోంది. అయితే రాహుల్‌ దక్షిణాది నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉంటారా లేక గత ఎన్నికల్లో మాదిరిగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ పోటీ చేసే నియోజకవర్గంపై ఒకటి-రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..