AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎమ్ కలిసే ఉన్నాయ్’- రాహుల్ గాంధీ

బీజేపీపై కూడా ఫైరయ్యారు రాహుల్. ఆదానీకి మోదీ అన్ని దోచిపెడుతున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ప్రవేట్ బొగ్గు కంపెనీలకు, ప్రభుత్వ బొగ్గు కంపెనీలకు వేరు వేరు ధరలు పెట్టినట్లు తెలిపారు. దేశంలో అన్ని సంస్థలను నరేంద్ర మోదీ ప్రవేటీకరణ చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఆయన మాట్లాడిన ఫుల్ స్పీచ్ హైలెట్స్ తెలుసుకుందాం పదండి....

Telangana: 'బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎమ్ కలిసే ఉన్నాయ్'- రాహుల్ గాంధీ
Rahul Gandhi
Ram Naramaneni
|

Updated on: Oct 19, 2023 | 6:32 PM

Share

 రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేపట్టిన విజయ భేరి బస్సు యాత్ర.. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో కొనసాగనుంది. పెద్దపల్లి నియోజకవర్గం కేంద్రంలో జరగనున్న భారీ బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సభకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. తెలంగాణలో పోటీ.. బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే అని పదే, పదే చెబుతున్న రాహుల్‌.. బీఆర్​ఎస్​, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి సభలో మాట్లాడిన రాహుల్.. తాను తెలంగాణకు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. తనకు తెలంగాణతో ఉన్న సంబంధం రాజకీయ సంబంధం కాదన్నారు. తెలంగాణ ప్రజలతో తనకు ఓ కుటుంబం మాదిరి అనుబంధం ఉందన్నారు. ఈ బంధం తనకంటే ముందు నెహ్రూ గారితో, ఇందిరమ్మతో, రాజీవ్ గాంధీతో కూడా ఉండేదని పేర్కొన్నారు. ఇచ్చిన హామి ప్రకారం.. తెలంగాణ ఇచ్చి ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని పేర్కొన్నారు. రాజకీయంగా నష్టం వాటిల్లినా.. సోనియా గాంధీ తెలంగాణ పేదలు, రైతులు, కూలీల కోసం రాష్ట్రం ఇచ్చినట్లు తెలిపారు. కానీ రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా ప్రజల కలలు నెరవేరలేదన్నారు రాహుల్.

ఈ రోజు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికల యుద్ధమన్నారు రాహుల్. సీఎం, ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వంలోని ముఖ్య శాఖలను కంట్రోల్‌లో పెట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిలా కాకుండా.. ఓ రాజులా వ్యవహరిస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం పెంచి లక్ష కోట్లు అవినీతి చేశారని రాహుల్ ఆరోపించారు. ప్రజల భూములు లాక్కున్నారు తప్పితే.. ఆ ప్రాజెక్ట్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదన్నారు రాహుల్. కేవలం ముఖ్యమంత్రి మిత్రులైన కాంట్రాక్టర్స్‌కే లాభం అన్నారు. ధరణి పోర్టల్‌తో.. ప్రజల భూములు సీఎం లాక్కున్నారని పేర్కొన్నారు. పెద్ద, పెద్ద రైతులకే రైతు బంధు వల్ల ఉపయోగం చేకూరిందని పేర్కొన్నారు. రూ.లక్ష రుణమాఫీ ఎంతమందికి చేశారో ప్రజలు ఆలోచించాలని రాహుల్ గాంధీ సూచించారు. సింగరేణితో పాటు ఇతర మైన్స్‌ను తాము ప్రైవేటీకరణ కాకుండా చేస్తామన్నారు రాహుల్.

అటు బీజేపీపై కూడా ఫైరయ్యారు రాహుల్. ఆదానీకి మోదీ అన్నీ దోచిపెడుతున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ప్రవేట్ బొగ్గు కంపెనీలకు, ప్రభుత్వ బొగ్గు కంపెనీలకు వేరు వేరు ధరలు పెట్టినట్లు తెలిపారు. దేశంలో అన్ని సంస్థలను నరేంద్ర మోదీ ప్రవేటీకరణ చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. కార్మికులు, రైతులకు తాము అన్ని విధాలా రక్షణ కల్పిస్తామన్నారు రాహుల్. 15 లక్షలు బ్యాంక్ అకౌంట్లలో వేస్తానని చెప్పి.. మోదీ ప్రజలను మోసం చేశారని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అబద్దాలు చెప్పదని.. చెప్పిన మాట నిలబెట్టుకుంటుందని చెప్పారు. కర్నాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇచ్చిన హామిలు నెరవేర్చుతున్నామన్నారు రాహుల్.

బీఆర్ఎస్, బీజేపీ, ఎమ్‌ఐఎమ్ ఒకటే అని.. బీజేపీకి ఓటు వేసినా, ఎమ్‌ఐఎమ్‌కు వేసినా బీఆర్‌ఎస్‌కు వేసినట్లే అన్నారు రాహుల్. బీజేపీపై పోరాడినందుకు తనపై 26 కేసులు పెట్టారని.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారని.. తన ఇంటిని తీసేసుకున్నారని రాహుల్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంత అవినీతి జరిగినా..  కేసీఆర్‌పై ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు ఎందుకు లేవని రాహుల్ ప్రశ్నించారు. లోక్ సభలో  బీజేపీకి మద్దతుగా.. జీఎస్టీ, రైతు బిల్లుల విషయంలో బీఆర్‌ఎస్ ఓటు వేసిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్ రాబోతుందని.. కార్యకర్తలే తమ పులులు అన్నారు రాహుల్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.