Telangana Congress: తెలంగాణ నేతల ఆశలపై నీళ్ళుజల్లిన ప్రియాంక.. జులై 7 తర్వాతగానీ రాలేనన్న అగ్రనేత.. కిం కర్తవ్యం?
కాంగ్రెస్ నాయకుల ఉత్సాహంపై అగ్రనేత ప్రియాంక వధేరా గాంధీ నీళ్ళు జల్లారా? తాజాగా న్యూఢిల్లీలో ప్రియాంకతో భేటీ అయిన తర్వాత భువనగిరి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి చెప్పిన...
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఉత్సాహంపై అగ్రనేత ప్రియాంక వధేరా గాంధీ నీళ్ళు జల్లారా? తాజాగా న్యూఢిల్లీలో ప్రియాంకతో భేటీ అయిన తర్వాత భువనగిరి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి చెప్పిన మాటలు అదే అంశాన్ని చాటుతున్నాయి. కర్నాటక ఫలితాలను తెలంగాణలో రిపీట్ చేస్తామని భావిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రకరకాల కార్యక్రమాలతో జనంలోకి వెళ్ళాలని తలపెట్టారు. ఇదివరకే సభలు, సమావేశాలను ఓవైపు కొనసాగిస్తూనే ఇంకోవైపు ఇతర పార్టీల్లోని అసంతృప్తులను చేర్చుకునే దిశగా టీపీసీసీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగిసిన వెంటనే హైదరాబాద్ నగరంలో ప్రియాంక సభను నిర్వహించే యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ వంటి హామీలను గుప్పించారు. ఇక తెలంగాణకు తరచూ అగ్రనేతల రాకపోకలుంటాయని మీడియాకు ఉప్పందించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. దాంతో మీడియాలో రాహుల్, ప్రియాంక ఒకరు కాకపోతే మరొకరు వారం విడిచి వారం తెలంగాణకు వస్తారని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతోపాటు ప్రజాభిమానాన్ని చురగొంటారని కథనాలు రాసుకొచ్చాయి. అయితే, ఇదంతా జరిగి నెలన్నర కావొస్తోంది. ఇప్పటికి అగ్రనేతలెవరూ రాలేదు. కాకపోతే కర్నాటక విజయం తర్వాత కొన్ని సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది ఏఐసీసీ. ఏఐసీసీ కార్యదర్శుల హోదాలో తెలంగాణ వ్యవహారాల ఇంచార్జులుగా వున్న వారిని మార్చి కొత్త వారిని నియమించింది. ఇక ఈక్రమంలో గత 90 రోజులుగా పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ శాసన సభాపక్షం నేత మల్లు భట్టవిక్రమార్కకు వెన్నుదన్నుగా ప్రియాంక రంగంలోకి దిగుతారని ప్రచారం జరిగింది. పాదయాత్ర ముగింపుగా ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పుకున్నారు. కానీ తాజాగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత ఇదేదీ నిజం కాదన్నట్లు తేలిపోయింది. జూన్ నెలలో ప్రియాంక తెలంగాణకు రావడం లేదని తేలిపోయింది. అటు రాహుల్ గాంధీ ఏమో అమెరికా పర్యటనలో వున్నారు. ఆయనా వచ్చే ఛాన్స్ లేదు. ఇటు ప్రియాంక జులై 7 తర్వాత తెలంగాణకు వస్తానని చెప్పారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. దాంతో భట్టి పాదయాత్ర ముగింపు సభకు అగ్రనేతలెవరూ వచ్చే అవకాశాలు లేనట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్సాహంపై ప్రియాంక నీళ్ళు జల్లినట్లేనని గాంధీభవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఇక్కడ ఓ ఆసక్తికరమైన అంశం కనిపిస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను కలిసినపుడు మీ సోదరుడు పార్టీలోకి వస్తున్నారా అని ప్రియాంక అడిగినట్లు తెలుస్తోంది. దీనికి సమాధానంగా అందరూ పార్టీలోకి వస్తారంటూ నర్మగర్భ సమాధానం చెప్పారు వెంకటరెడ్డి. ఈ లెక్కన కొంతకాలంగా బీజేపీలో అంతగా యాక్టివ్‌గా లేని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుకుంటారా అన్న సందేహం మొదలైంది. ఈ అంశాన్ని పక్కన పెడితే తెలంగాణలోను కర్నాటక ఫార్ములాను అమలు పరిచే ఉద్దేశంతో కాంగ్రెస్ అధినాయకత్వం వున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యవహారాలను మరీ ముఖ్యంగా ఎలెక్షన్ మేనేజ్‌మెంటును కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్‌కు కట్టబెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మనీ సర్దుబాటు దగ్గర నుంచి ఆపరేషన్ ఆకర్ష నిర్వహణ దాకా డికే సిద్దహస్తుడని పేరుంది. ఈ ఉప్పందడంతోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలువురు బెంగళూరుకు క్యూ కట్టినట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదివరకే నాలుగు సార్లు బెంగళూరు వెళ్ళి వచ్చారు. పొన్నం ప్రభాకర్ లాంటి వారు సైతం అదే పనిలో వున్నారు. ఇక ఆశ్చర్యమేమిటంటే తెలంగాణలో రాజకీయ అదృష్టాన్ని వెతుక్కుంటూ ఏపీలోని కడప నుంచి వచ్చిన షర్మిల సైతం రెండు సార్లు బెంగళూరు వెళ్ళి డికేని కలిసి వచ్చారు. దాంతో ఆమె తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారని కథనాలు వచ్చాయి. దానిని ఆమె తిరస్కరించినా ఆ ఊహాగానాలకు తెరపడకపోవడం విశేషం. తన తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆప్తుడవడం వల్లనే తాను డికేని కలిసినట్లు షర్మిల చెప్పుకుంటున్నారు. అయితే, తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితోపాటు షర్మిలకు బెంగళూరులో భారీ ఎత్తున ఆస్తులున్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హమేనని చెప్పుకోవాలి.
కర్నాటకలో యూజ్ చేసి, మంచి ఫలితాలు రాబట్టిన మరో ఫార్ములాను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాడుకునే అవకాశం వున్నట్లు వెంకటరెడ్డి మాటల్లో వెల్లడైంది. ఎన్నికలకు చాలా ముందుగానే దాదాపు 50 నుంచి 60 శాతం అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడం ద్వారా వారు వారి నియోజకవర్గంలో చాలా ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు 2 లేదా 3 నెలల ముందే 60 శాతం సీట్ల ప్రకటన ఉంటుందని వెంకటరెడ్డి.. ప్రియాంకతో భేటీ తర్వాత చెప్పారు. ఇక అగ్రనేతల పర్యటనల విషయంలోను ప్లానింగ్ జరుగుతున్నట్లు బోధపడుతోంది. 3 నెలల్లో తెలంగాణలోని 33 జిల్లాల్లో పర్యటించేలా రాష్ట్రానికి సమయం కేటాయించాలని ప్రియాంకను తాను కోరినట్లు వెంకటరెడ్డి చెబుతున్నారు. జులై 7 తర్వాత తెలంగాణకు వస్తానని ప్రియాంక.. వెంకటరెడ్డి ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఓకే చెప్పినట్లు భావించాలి. ఇక చేరికల విషయంలో టీపీసీసీ ప్లానింగ్ పక్కాగా కనిపిస్తోంది. అయితే, బోలెడు ఆశలు పెట్టుకున్న ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా ఎటూ తేల్చకపోవడంపై టీపీసీసీ నేతలు లోలోపల టెన్షన్ పడుతున్నా.. పైకి మాత్రం గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పొంగులేటితోపాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని, కేవలం సభ నిర్వహన తేదీపైనే ఇంకా క్లారిటీ రావడం లేదని చెబుతున్నారు. అయితే, జూన్ 14వ తేదీనే తాను ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత వారం చెప్పారు. కానీ ఆ తేదీ దాటిపోయినా ఆయన నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా ఆయన ఏం ఆలోచన చేస్తున్నారన్నదానిపై కాంగ్రెస్ నేతలతోపాటు బీజేపీ నేతలు కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.