PM Modi: సింగరేణి గనులను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు.. స్పష్టం చేసిన ప్రధాని మోదీ..
రామగుండ ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర కీలక ప్రకటన చేశారు. సింగరేణి గణులను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
రామగుండ ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర కీలక ప్రకటన చేశారు. సింగరేణి గణులను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారని, బొగ్గు గనులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రధాని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే గనులను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ప్రధాని. హైదరాబాద్ నుంచి వచ్చే పుకార్లను నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని. సింగరేణిలో తెలంగాణ వాటా 51 శాతం, కేంద్రం వాటా కేవలం 49 శాతం మాత్రమే. సింగరేణిని ప్రైవేటీకరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందన్నారు. కేంద్రం తరఫున ఎలాంటి ప్రైవేటీకరణ ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. గతంలో బొగ్గు గణుల్లో వేల కోట్ల స్కామ్‌లు జరిగాయని ఆరోపించిన ప్రధాని మోదీ.. ప్రస్తుతం బొగ్గు గనుల వేలం పూర్తి పారదర్శకంగా జరుగుతోందన్నారు. ఇవాళ్టి సభతో హైదరాబాద్‌లో కొందరికి నిద్ర కూడా పట్టదని సెటైర్లు వేశారు ప్రధాని.
అంతకంటే ముందు సభలో తెలుగులో స్పీచ్ ప్రారంభించారు ప్రధాని మోదీ. సభకు వచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఒక్క రోజే రూ. 10 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, రైల్వేలు, రోడ్ల ప్రాజెక్టు విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. గత రెండున్నరేళ్లుగా ప్రపంచం తీవ్ర సంక్షోభంలో ఉందని, కరోనాతో పాటు యుద్ధాల కారణంగా సంక్షోభాలు వచ్చాయన్నారు. ఈ కష్ట కాలంలోనూ దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని చెప్పుకొచ్చారు. గత 8 ఏళ్లుగా అందించిన సుపరిపాలనే దీనికి కారణం అన్నారు. అన్ని రంగాల్లోనూ చాలా సంస్కరణలు తీసుకొచ్చామన్న ప్రధాని మోదీ.. 24/7 అభివృద్ధి కోసమే తపిస్తున్నామని చెప్పారు. రామగుండంలోని ఎరువుల పరిశ్రమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ప్రసంగం యధావిధిగా..
‘గతంలో ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడేవాళ్లం. టెక్నాలజీ అభివృద్ధి కాకపోవడంతో గతంలో రామగుండం ఎరువుల పరిశ్రమ మూతపడింది. యూరియా కోసం రైతులు అర్థరాత్రి వరకు లైన్లలో ఉండేవారు. చివరికి లాఠీ దెబ్బలు కూడా తినేవారు. యూరియా బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టాం. దేశంలో ఫర్టిలైజర్ సక్టార్‌ను ఎంతో అభివృద్ధి చేశాం. గోరఖ్‌పూర్, రామగుండంతో పాటు 5 ఎరువుల ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి జరుగుతోంది. ఫర్టిలైజర్ సెక్టార్‌లో భారత్ ఆత్మనిర్భర్‌గా ఆవిర్భవించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగితే.. భారత్‌లో మాత్రం రేట్లను నియంత్రించాం. రైతుల కోసం రూ. 10 లక్షల కోట్లు ఖర్చు చేశాం. వచ్చే 2 ఏళ్లలోనూ మరో రెండున్నర లక్షల కోట్లు కేటాయిస్తాం. గతంలో నకిలీ ఎరువులతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. కానీ, ఇప్పుడు అన్ని బ్రాండ్‌లను తొలగించాం. కేవలం భారత్ బ్రాండ్ అనే యూరియా మాత్రమే అందుబాటులో ఉంది.’ అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం-ఖమ్మం జిల్లాలను కలిపే రైల్వే లైన్లను ప్రారంభించామని ప్రధాని మోదీ తెలిపారు. పరిశ్రమలు, విద్యుత్ సంస్థలకు ఈ రైల్ లైన్‌తో చాలా ఉపయోగం ఉందన్నారు. ఈ పనులతో కోల్‌బెల్ట్, పవర్ బెల్ట్, చెరుకు రైతులకు లాభం చేకూరుతుందన్నారు.
రూ. 9,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు..
ఇదిలాఉంటే.. తెలంగాణ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ రూ. 9,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 2 ప్రారంభోత్సవాలు, 3 శంకుస్థాపనలు చేశారు. రూ. 6,338 కోట్లతో RFCL పునరుద్ధరణ చేపట్టారు. ఎరువుల ఫ్యాక్టరీ, భద్రాచలం- సత్తుపల్లి రైల్వేలైన్ జాతికి అంకితం చేసిన ప్రధాని.. రూ.2,268 కోట్లతో 3 నేషనల్ హైవేస్‌కు శంకుస్థాపన చేశారు. వర్చువల్ విధానంలో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటిలో బోధన్-బాసర-భైంసా మార్గం రూ. 644 కోట్లతో విస్తరణ పనులు, సిరొంచ -మహదేవ్‌పూర్ రోడ్డుకి రూ.163 కోట్లు, ఎల్కతుర్తి-సిద్దిపేట-మెదక్ రోడ్డుకి రూ.1,461 కోట్ల పనులు ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..