AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad By Election: హుజూరాబాద్‌లో రాజకీయ హోరాహోరీ.. ఈసీ ఎన్నికల నగారాపై ఉత్కంఠ.!

ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్‌ ఉప ఎన్నికపైనే ఉంది.. ఉప ఎన్నిక షెడ్యూల్‌ ఇంకా రాలేదు కానీ అప్పుడే ప్రధాన రాజకీయపార్టీలు ఎన్నిక కోసం

Huzurabad By Election: హుజూరాబాద్‌లో రాజకీయ హోరాహోరీ.. ఈసీ ఎన్నికల నగారాపై ఉత్కంఠ.!
Huzurabad By-Poll
Venkata Narayana
|

Updated on: Aug 05, 2021 | 5:02 PM

Share

Huzurabad By Election notification: ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్‌ ఉప ఎన్నికపైనే ఉంది.. ఉప ఎన్నిక షెడ్యూల్‌ ఇంకా రాలేదు కానీ అప్పుడే ప్రధాన రాజకీయపార్టీలు ఎన్నిక కోసం సమాయత్తమవుతున్నాయి. ఉప ఎన్నిక షెడ్యూల్ ఏ క్షణమైనా వెలువడవచ్చన్న సంకేతాలు పార్టీలకు అందాయి కాబట్టే ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. గత వారం రోజులుగా అన్ని పార్టీలు ఎన్నిక కసరత్తులో మునిగిపోయాయి. అభ్యర్థుల అన్వేషణలో తీరిక లేకుండా ఉన్నాయి. నిజానికి దళితబంధు పథకం ఈ నెల 16న హుజూరాబాద్‌ వేదికగా ప్రారంభం కావాలి. కానీ బుధవారం వాసాలమర్రి దళితవాడను సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అందుకు కారణం హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల సంకేతాలు అందడమే అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఆగస్టు 16న ప్రారంభం కావాల్సిన ‘దళితబంధు’ పథకాన్ని కాసింత ముందుకు ఎందుకు జరిపినట్టు? గురువారమే దళితబంధు చెక్కుల పంపిణీ జరపాలని ఎందుకు నిర్ణయించినట్టు? అంటే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముంచుకొస్తుండటమే! ఏ క్షణమైనా షెడ్యూల్‌ విడుదల కావచ్చనే సంకేతాలు రావడంతో టీఆర్‌ఎస్‌ అధినాయత్వం వ్యూహరచనలో నిమగ్నమయ్యింది. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో పాడి కౌశిక్‌రెడ్డి చేరడం గులాబీ పార్టీకి ప్లసయ్యింది. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి గులాబీగూటికి చేరడం, సీఎం కేసీఆర్‌ స్వయంగా పెద్దిరెడ్డికి కండువా వేసి స్వాగతం పలకడం చూస్తుంటే ఉప ఎన్నికకు మూహూర్తం దగ్గరపడిందనే అనిపిస్తోంది. అలాగే కౌశిక్‌రెడ్డిని ఇంత అర్జెంట్‌గా గవర్నర్‌ కోటాలో శాసనమండలికి నామినేట్‌ చేయడం వెనుక ఉద్దేశం కూడా అదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికను అధికార టీఆర్‌ఎస్‌ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదనే గట్టి పట్టుదలతో ఉంది. అందుకే ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావు బరిలో దిగారు. హుజూరాబాద్‌లో పార్టీ సమన్వయంపై మంత్రి హరీశ్‌ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఇక మంత్రి గంగుల కమలాకర్‌, ఇతర ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉన్నారు. క్యాడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తున్నారు. అభివృద్ధి ఫలాలు అందుతున్నాయో లేదో పరిశీలిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను తెలుసుకుంటున్నారు. మొత్తంగా హుజూరాబాద్‌లో ఎన్నికల సందడి మొదలయ్యింది. దీనికి కారణం ఉప ఎన్నిక షెడ్యూల్‌పై సంకేతాలు రావడమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహాలను పసిగట్టడం అంత సులభం కాదు.. కేసీఆర్‌ ఎలాంటి ప్లానేస్తారో ఊహించడం కష్టం. ప్రత్యర్థి పార్టీలు ప్రతీసారి బోల్తాపడుతున్నది ఈ అంశంలోనే! ఎవరూ ఊహించని విధంగా విపక్షాలకు షాకివ్వడం కేసీఆర్‌ శైలి. ప్రత్యర్థులు అసలు ఊహించని హామీలను ఇస్తూ వారి దిమ్మతిరిగేట్టు చేస్తుంటారు. ఇప్పుడు అలాగే దళిత బంధు పథకం ప్రకటించి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. ఒక్కో కుటుంబానికి పది లక్షలు ఇస్తామని చెప్పడంతో విపక్షాలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పథకాన్ని విమర్శించే సాహసం చేయలేరు. అలాగని తాము అంతకు మించిన వాగ్దానం చేయలేరు. కాకపోతే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్‌ వరాలు ప్రకటిస్తున్నారని మాత్రమే అన్నాయి. పైగా దళితబంధు పథకాన్నిరాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్‌ చేశాయి. దళితబంధు పథకం దళితులపై అభిమానంతో కాదని, కేవలం ఓట్ల కోసమేనని ఆరోపిస్తున్న విపక్షాలకు ఇప్పుడు పెద్ద షాక్‌నే ఇచ్చారు కేసీఆర్‌.

దళితబంధు పథకం హుజూరాబాద్‌ ఎన్నిక కోసం కాదని కేసీఆర్‌ తేల్చేశారు. ఆగస్టు 16 నుంచి హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ఇంతకు ముందు చెప్పిన కేసీఆర్‌ ఆకస్మికంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాను దత్తతకు తీసుకున్న వాసాలమర్రి నుంచే దళితబంధు పథకం ప్రారంభమవుతుందని ప్రకటించి అందరికీ షాకిచ్చారు. వాసాలమర్రిలో పర్యటించిన కేసీఆర్‌ ఎన్నో వరాలను ప్రకటించారు. గురువారం నుంచే దళితబంధు పథకం అమలులోకి రానుంది. గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున కేటాయించనుంది ప్రభుత్వం. ఇందుకోసం అవసరమైన 7.6 కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించి విపక్షాలకు విమర్శించే సమయం కూడా లేకుండా చేశారు.. దటీజ్‌ కేసీఆర్‌.

అలాగే దళిత కుటుంబాలకు భూములు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన దళితజాతిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. నిజానికి దళిత బంధు పథకం రెండేళ్ల కిందటే ప్రారంభిద్దామనుకున్నామని, కరోనా లాక్‌డౌన్‌ల కారణంగా ఆలస్యమయ్యిందని వివరణ ఇచ్చుకున్నారు కేసీఆర్‌. వాసాలమర్రిలో వంద ఎక‌రాల‌కు పైగా ప్రభుత్వ భూమి ఉందని, ఆ భూముల‌ను ద‌ళిత కుటుంబాల‌కు పంపిణీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రతి ద‌ళిత బిడ్డ రైతు కావాలని.. వాసాల‌మ‌ర్రిలో కొత్త చ‌రిత్ర సృష్టించాలని అన్నారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే కేసీఆర్‌ వరాలు గుప్పిస్తున్నారని ఇంతవరకు చెబుతూ వచ్చిన విపక్షాలు సీఎం ఇచ్చిన షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు వాసాలమర్రి నుంచే దళితబంధు ప్రారంభం కావడంతో కౌంటర్‌పార్ట్‌ ఎలా ఇవ్వాలా అన్నదానిపై విపక్షాలు వ్యూహరచన చేసుకుంటున్నాయి. వాసాలమర్రిలో దళితుల అకౌంట్‌లో పది లక్షల రూపాయలు పడగానే హుజూరాబాద్‌లోని దళితులకు ఆటోమాటిక్‌గా కేసీఆర్‌ పట్ల విశ్వాసం పెరుగుతుంది.. కేసీఆర్‌ మాట ఇచ్చారంటే తప్పరన్న భావన ఏర్పడుతుంది.. ఈ విధంగా ఇటు వాసాలమర్రి, అటు హుజురాబాద్‌లోని దళితుల మనసులను కేసీఆర్‌ గెల్చుకోగలుగుతారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కూడా ఈ ఎన్నిక కీలకమే! రాజకీయాలలో మనుగడ సాగించాలంటే ఇందులో గెలుపు తప్పనిసరి! తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికపై ఈటల సీరియస్‌గా దృష్టి పెట్టారు. వ్యక్తిగతంగా నియోజకవర్గంలో తనకున్న ఇమేజ్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాదీవెన యాత్ర పేరిట మొన్నటి వరకు నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు.. నిర్విరామంగా పాదయాత్ర చేయడంతో ఈటల అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలే ఆయనకు శస్త్రచికిత్స కూడా జరిగింది. డిశ్చార్జ్‌ అయిన వెంటనే ఆయన హుజూరాబాద్‌కు పయనమయ్యారు. ఇంకా పూర్తిగా కోలుకోకమునుపే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఉప ఎన్నిక షెడ్యూల్‌ సమాచారమే కారణం కావచ్చు.

హుజూరాబాద్‌ గెలుపుతో పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్‌పార్టీ ఉంది. ఇప్ప‌టికే హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాలు, ముఖ్య‌మైన ప‌ట్ట‌ణాల‌కు ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మించింది హస్తం పార్టీ. అలాగే నియోజ‌క‌వ‌ర్గ బాధ్యత‌ల‌ను ఎల‌క్ష‌న్ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహకు అప్పగించింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లకు కో ఆర్డినేషన్‌ బాధ్యతలను ఇచ్చింది. బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. హుజూరాబాద్‌లో దళిత సామాజికవర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. అందుకే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో దింపాలని కాంగ్రెస్‌ అనుకుంటోంది. కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, పరకాల మాజీ ఎమ్మెల్యే దొమ్మాటి సాంబయ్య పేర్లను పరిశీలిస్తోంది.

ఉప ఎన్నిక కోసం ప్రధాన పార్టీలన్ని ఉరుకులు పరుగులు పెడుతున్నాయి కానీ.. ఎన్నికల సంఘం ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటుందా అన్నది కూడా అనుమానమే. ఎందుకంటే కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం ఒకింత కష్టమే. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక తర్వాత కరోనా కేసులు విపరీతంగా పెరిగిన విషయాన్ని కొంతమంది గుర్తు చేస్తున్నారు. వరంగల్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. థర్డ్‌వేవ్‌లో కేసుల సంఖ్య మరింత పెరగవచ్చు.. అలాంటప్పుడు ఎన్నికను అక్టోబర్‌లో నిర్వహించడమే ఉత్తమమని కొందరు అంటున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా జరగాల్సిన వివిధ ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేస్తూ వస్తోంది. దాదాపు 50 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఒకవేళ థర్డ్‌వేవ్‌ అనుకున్నదానికంటే ప్రమాదకరంగా ఉంటే మాత్రం హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ఆరు నెలల కంటే ఎక్కువ సమయమే పట్టవచ్చు.

మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన ఈటల రాజేందర్‌ జూన్‌ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత గులాబీగూటిని వదిలిపెట్టి కమలం పార్టీలో చేరారు. ఇప్పటికే అక్కడ ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి ఆరు నెలల్లోపు ఎన్నిక జరగాలి. అంటే హుజూరాబాద్‌లో డిసెంబర్‌ 12 వరకు ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాలి. ఇందుకోసం ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో షెడ్యూల్ విడుదల కావాలి.. ఆగస్టులోనే షెడ్యూల్‌ వస్తుందని, ఏ క్షణమైనా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవచ్చని ప్రధానపార్టీలు భావిస్తున్నాయి.

Read also: Tipu statue dispute: సీమలో టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటు రగడ.. ఎమ్మెల్యే రాచమల్లు ఘాటు వ్యాఖ్యలు