KTR – Vimalakka: గొంతెత్తి గర్జించిన గళంలో ఆత్మీయ పలకరింపులు.. చర్చనీయాంశంగా మారిన కేటీఆర్-విమలక్క భేటీ
తన గొంతుతో పాటల రూపంలో గళమెత్తిన ఆ అక్క మంత్రి కేటీఆర్‌తో మిలాఖత్ అయ్యారు. ఇద్దరు కలిసి ముచ్చటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
KTR – Vimalakka meeting: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గానీ, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు..కానీ ఎలాంటి రాజకీయ పార్టీల్లో లేకున్నా కేసీఆర్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై అనేక వేదికల ద్వారా తన గొంతుతో పాటల రూపంలో గళమెత్తిన ఆ అక్క మంత్రి కేటీఆర్‌తో మిలాఖత్ అయ్యారు. ఇద్దరు కలిసి ముచ్చటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణలు జరుగుతున్నాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
తెలంగాణ ఉద్యమంలో తమ పాటలతో మద్దతు తెలిపిన అరుణోదయ సాంస్కృతిక సమైక్య వ్యవస్థాపకురాలు విమలక్క ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అనేక విషయాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పాటల రూపంలో ప్రశ్నించారు. టీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా ఎవరు ఏ కార్యక్రమం పెట్టినా, తనను ఆహ్వానించినా తన పాటలతో ప్రభుత్వ పెద్దలపై విరుచుకుపడిన విమలక్క చాలా సంవత్సరాల తరువాత గులాబీ పార్టీకి దగ్గరైనట్లు కనిపిస్తోంది. ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తో ఆప్యాయంగా మాట్లాడటం ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఒక వివాహ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌కు విమలక్కతో పాటు కూర రాజన్నలు ఎదురుపడ్డారు. దీంతో వీరు మధ్య ఒకరినొకరు అత్మీయంగా పలకరించుకున్నారు. ఏం అక్క ఎలా ఉన్నారు.. రాజన్న బాగున్నవా అనే కేటీఆర్ పలకరింపుతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. విమలక్క దంపతులు కూడా తమ బంధుమిత్రులను కేటీఆర్‌కు పరిచయం చేశారు. అంతేకాదు ఇద్దరు కలిసిన కొద్దిసేపు ఇద్దరు మాట్లాడుకోవడం ఇంట్రెస్టింగ్ అయింది. పెద్దగా చర్చలు ఏం లేకున్నా సరదాగా జరిగిన సంభాషణ పట్ల ఉద్యమ వర్గాల్లో, రాజకీయా వర్గాల్లో ఆసక్తి రేగింది. మరి ఈ ఆకస్మిక కలయిక.. తమ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు అనే భావన లేకుండా ఆప్యాయంగా కేటీఆర్ పలకరింపు తరువాత విమలక్క గళం ఏవిదంగా ఉంటుందో చూడాలి…
—- శ్రీధర్ ప్రసాద్, టీవీ 9 ప్రతినిథి, హైదరాబాద్.
Read Also… Medaram Jatara: మేడారం మహాజాతరకు సర్వం సిద్ధం – అంతు చిక్కని రహస్యానికి రమణీయ దృశ్యకావ్యం..