Medaram Jatara: మేడారం మహాజాతరకు సర్వం సిద్ధం – అంతు చిక్కని రహస్యానికి రమణీయ దృశ్యకావ్యం..
తెలంగాణ కుంభమేళా, మేడారం మహాజాతరకు సర్వం సిద్ధం. ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం. అంతుచిక్కని రహస్యానికి రమణీయ దృశ్యకావ్యం. అడవి తల్లుల దీవెనకు ప్రతిరూపం. వనదేవతల అడుగుజాడలకు ఉప్పొంగే జన ప్రవాహం.
Medaram Jatara 2022: తెలంగాణ(Telangana) కుంభమేళా, మేడారం మహాజాతరకు సర్వం సిద్ధం. ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం. అంతుచిక్కని రహస్యానికి రమణీయ దృశ్యకావ్యం. అడవి తల్లుల దీవెనకు ప్రతిరూపం. వనదేవతల అడుగుజాడలకు ఉప్పొంగే జన ప్రవాహం. మనసులోని కోర్కెలను మళ్లీమళ్లీ రప్పించే శక్తి స్వరూపం. అనుకోకుండా వచ్చే చుట్టాలకు గిరిజన నేస్తం(Tribal Festival). అదే జన ప్రభంజనాన్ని నాలుగురోజులపాటు తన ఒడిలో ఇముడ్చుకునే మేడారం..సమ్మక్కసారలమ్మల ఆవాసం..
కోటి గొంతులు ఒక్కటై పిక్కటిల్లే సమరనాదం.. నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర బుధవారం నుంచి మొదలవుతుంది. జాతర ప్రారంభానికి ముందే మేడారానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రతి రోజూ లక్షల్లో భక్తులు అమ్మవార్ల ఆశీస్సులు అందుకుని వెళుతున్నారు. ఇప్పటి వరకు అరకోటికి మందికి పైగా భక్తులు మేడారాన్ని సందర్శించారు. ఇంతకు ముందు ఇలా ముందస్తు దర్శనాలు పాతిక లక్షలకు మించి ఉండేవి కాదు. నిజానికి ఎక్కడ జాతర జరిగినా లక్షల్లో జనం ఉంటారు.. కానీ ఇక్కడ కోటి మందికి పైగా కనిపిస్తారు..ఏ జాతరలోనైనా విభిన్నమైన మొక్కులుంటే.. ఇక్కడ మాత్రం బెల్లంను బంగారంగా కొలుస్తూ నిలువెత్తు మొక్కును తీర్చుకుంటారు. ఎక్కడైనా దేవతలు కొలువుదీరి విగ్రహాల రూపంలో ఉండి ఏడాది పొడవునా పూజలందుకుంటే.. ఇక్కడ కుంకుమ భరిణెలు. కంకవనాన్ని దేవతలుగా నాలుగురోజుల పాటు ప్రతిష్టించడం ప్రత్యేకం.. ఆ నాలుగురోజులలో కోటి మంది భక్తులు అమ్మవార్లను కొలుస్తారు..
ఎన్నో విశేషాలు…మరెన్నో వింతలకు నెలవు మేడారం జాతర.. దక్షిణాసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా .. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన జాతరలో పూజా విధానమంతా ఆదివాసీ గిరిజన సంప్రదాయంలో జరుగుతుంది. కోయలు ఆరాధించే దేవతలంతా ప్రాకృతిక దేవతలే కాదు.. రూప రహితమైన దేవతా రూపాల్లో కొలువుదీరి ఉంటారు. హిమాచల్ ప్రదేశ్ మనాలిలో హిడింబా జాతర, ఆదిలాబాద్ నాగోబా జాతరలో ప్రతిష్టించే దేవతా విగ్రహాలేవీ ఇక్కడ కనిపించవు. జాతర సమయంలోనే నాలుగు రోజుల పాటు దేవతలు గద్దెలపై విగ్రహరహితంగా ప్రకృతితో మమేకమై కనిపిస్తారు. మేడారం సమ్మక్కసారలమ్మల గుడారం. ఈ జాతరకు వచ్చే భక్తకోటికి వనదేవతల దర్శనభాగ్యం అత్యంత ఆనందదాయకం. భారతదేశంలో కుంభమేళా తర్వాత జరిగే అతిపెద్ద జాతర ఇదే. దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు అన్ని రాష్ట్రాల వారికి ఆరాధ్య దేవతలు సమ్మక్క సారలమ్మలు. ఈ ఇద్దరు స్త్రీల పేరిట జరిగే ఏకైక గొప్ప జాతరగా మేడారం ప్రసిద్ధికెక్కింది. మేడారంలో వెలసిన అద్భుత మహిమ గల దేవతలుగా భక్తులు భావించే సమ్మక్క, సారలమ్మలు విగ్రహాల రూపంలో ఉండరు. గుడి గోపురాలు ఉండవు. పూజా పురస్కారాలు ఉండవు. స్థిరమైన దేవతల ప్రతిమలు లేవీ ఉండవు. ఇవి వెదురు దుంగలతో సాక్షాత్కరించే వన ప్రతిమలు. సాంప్రదాయ కోయ గిరిజన పూజలతో జాతర జరుగుతుంది. పసుపు, కుంకుమ, బెల్లం, కొబ్బరికాయలు, అడవిపూలతో కోయ తెగ వడ్డెలు దేవతలనే ప్రకృతి దేవతలుగా పూజిస్తారు.
ఆదివాసీ కోయ సంస్కృతికి నిదర్శనం ఆదివాసీ కోయ సంస్కృతిలో గుడి మెలిగే పద్ధతి నుంచి సాంప్రదాయ వాయిద్యాల నడుమ గద్దెలపై వనదేవతలను ప్రతిష్టించిన అనంతరం భక్తులు దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటారు. మేడారంలో వెలసిన వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, జంపన్న, గోవిందరాజు, నాగులమ్మలు కోయ గిరిజనుల ఇలవేల్పులు. వీరు కాకతీయ రాజుల పాలనను ధిక్కరించి పోరాడిన తీరు, వనదేవతలుగా అవతరించడం వెనుక ఆధారాలు స్పష్టంగా లేకపోయినా మేడారంలో ప్రధాన గద్దెలు, చిలుకల గుట్ట, జంపన్న వాగు, శివసత్తులు, రామప్ప దేవాలయ గోపురంపై కోయ వనితల శిల్పాలు సజీవంగా దర్శనమిస్తాయి. స్థానిక కోయ గిరిజనులు చెప్పే మౌఖిక సాహిత్యం, సంస్కృతీ సాంప్రదాయాలు, కట్టుబాట్లు జాతరలో కొనసాగుతున్నాయి.