Telangana: కారు దిగి పారిపోతున్నవారిని పట్టుకున్న పోలీసులు.. ఆరా తీస్తే తెలిసింది అసలు బండారం!
కామరెడ్డి జిల్లా బిచ్కుందలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ఓ వ్యాపారి నుంచి 50లక్షల విలువైన ఫేక్ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారుతోంది.
ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు నకిలీ కరెన్సీ చలామణికి కొత్త దారులు వెతుకుతున్నారు. అదనపు ఆదాయం కోసం కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బిచ్కుంద ప్రాంతాల్లో కొందరు దొంగనోట్లను వాడుకలోకి తెచ్చారు. కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో నకిలీనోట్ల దందా ఎవరికీ తెలియకుండా యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులకు ఉన్న అంతర్గత సమాచారంతో ఈ నకిలీ నోట్ల దందా వెలుగులోకి రావడంతో ఆ దొంగల వేటలో పడ్డారు.
బిచ్కుందలోని ఓ వ్యాపారి దొంగనోట్లు చలామణి చేస్తున్నాడనే సమాచారంతో పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. అతడు ఎవరెవరిని కలుస్తున్నాడు?.. దొంగనోట్లు ఎలా సమకూర్చుతున్నాడు అనే వివరాలు సేకరించారు. సమగ్ర సమాచారం అందిన తర్వాత కార్యాచరణ మొదలుపెట్టి ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అంతర్రాష్ట్ర దొంగ నోట్ల ముఠాను పట్టుకుని వారి వద్ద నుంచి 56 లక్షల 90వేల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలను జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. మొత్తం ఎనిమిది మంది ముఠా సభ్యుల్లో ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. బాన్సువాడ మండల కేంద్రంలో దొరికిన ఆధారాలతో దొంగ నోట్ల ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇటీవల బాన్స్‌వాడలో దొంగ నోట్లను గుర్తించామని దాని ఆధారంగా లోతుగా కేసు దర్యాప్తు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. నోట్ల తయారీకి వాడుతున్న ప్రింటర్లు, కంప్యూటర్లు, స్టాంపులు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆమె చెప్పారు.
బాన్సువాడ పోలీసులు శుక్రవారం(డిసెంబర్ 13) కొయ్యగుట్ట వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి కొందరు పారిపోతుండగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద రూ.30 లక్షల విలువ చేసే రూ.500 నోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి దందాకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో తెలంగాణకు చెందిన రాజగోపాల్, కర్ణాటకకు చెందిన హుసేన్ పీరా నకిలీ నోట్లు తయారీ, చలామణిలో పెట్టుబడి పెట్టారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, రమేశ్ గౌడ్, మహారాష్ట్రకు చెందిన అజయ్, ఈశ్వర్ నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో రూ.60 లక్షల రూ.500 నకిలీ నోట్లు ప్రింటింగ్ చేశారు. ఇందులో రూ.3లక్షలు బిచ్కుందకు చెందిన కిరణ్ కుమార్, బాన్సువాడకు చెందిన రమేశ్ గౌడ్ కు అప్పగించారు. వారు వాటిని చుట్టుపక్కల గ్రామాల్లో చలామణి చేశారు. మరో రూ.30 లక్షలను ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి రాజగోపాల్ బాన్సువాడకు వచ్చాడు. అయితే అతడిని బాన్సువాడ బస్టాండులో దింపడానికి కిరణ్ కుమార్, రమేశ్ గౌడ్ లు కారులో బయలు దేరాగా.. కొయ్యగుట్ట వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుల సమాచారం మేరకు హైదరాబాద్ లో తనిఖీలు చేపట్టి మిగతా రూ.26.90 లక్షల విలువైన రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు రాజగోపాల్, హుసేన్ పీరా, కిరణ్ కుమార్, రాందాస్ గౌడ్, రాధాకృష్ణ, అజయ్ ఈశ్వర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. కమలేష్, సుఖ్ రాంలు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.56 లక్షల విలువ చేసే రూ.500 నకిలీ నోట్లు, కంప్యూటర్ పరికరాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నకిలీ కరెన్సీ కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించారు. మొత్తంగా.. కామారెడ్డి జిల్లాలో నకిలీ నోట్లు గుట్టురట్టు కావడం తీవ్ర కలకలం రేపుతోంది.
వీడియో చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..