ఎంత కష్టమొచ్చిందమ్మా..! తల్లి అంత్యక్రియలకోసం చిన్నారి భిక్షాటన.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు
విధి ఆడిన వింత నాటకం.. ఏ చిన్నారికీ రాని కష్టమిది. కలలో కూడా ఊహించని హృదయవిదారక ఘటన ఇది. తల్లి అంతిమసంస్కారాల కోసం ఈ చిన్నారి పడిన వేదన చూస్తే.. కంట నీరు రాక మానదు.. ఈ విషాదఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది..
విధి ఆడిన వింత నాటకం.. ఏ చిన్నారికీ రాని కష్టమిది. కలలో కూడా ఊహించని హృదయవిదారక ఘటన ఇది. తల్లి అంతిమసంస్కారాల కోసం ఈ చిన్నారి పడిన వేదన చూస్తే.. కంట నీరు రాక మానదు.. ఈ విషాదఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.. నిర్మల్ తానూర్ మండలం బేళ్తరోడ గ్రామానికి చెందిన దుర్గకు పదకొండేళ్ల వయసు.. కొన్ని నెలల క్రితం ఆమె తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. ఇప్పుడు తల్లి గంగామణి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ చిన్నారికి ఉన్న ఒకే ఒక్క ఆధారమైన తల్లి కూడా చనిపోవడంతో పాప ఒంటరిగా మిగిలింది. తల్లి అంత్యక్రియలకు సాయం చేసేందుకు అయిన వాళ్లెవరూ లేరు. దూరపు బంధువులు కూడా పట్టనట్టు వ్యవహరించారు. దీంతో చేసేదేమీ లేక.. తల్లి అంత్యక్రియల కోసం ఆ చిన్నారి భిక్షాటన చేసింది. సాయం చేయండి అంటూ గ్రామస్తులను వేడుకుంది. స్థానికులు ఇచ్చిన పదో, పరకో పోగేసి తల్లికి అంతిమ కార్యక్రమాలు నిర్వహించి చిన్నారి దుర్గ. పదకొండేళ్ల చిన్నారి తన తల్లి అంత్యక్రియల అవసరాల కోసం చందాలు అడగడం అందర్నీ కలచివేసింది.
వీడియో చూడండి..
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..
నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా తానూరు మండలం బెల్ తరోడా గ్రామంలో నివాసం ఉంటున్న గంగామణి (36) భర్తతో గొడవ పడి.. కూలీనాలీ చేసుకుని 11 ఏళ్ల కూతురు దుర్గతో కలిసి ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే.. భర్త అనారోగ్యంతో చనిపోయయాడు.. ఆ తర్వాత కొన్నాళ్లకే.. ఏ కష్టమొచ్చిందో తెలియదు.. కానీ చిన్నారిని ఒంటరిని చేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దీంతో చిన్నారి దుర్గ ఒంటరైంది.. చిల్లిగవ్వ లేదు.. దగ్గరి బంధువులు లేరు.. విగత జీవిలా పడి ఉన్న తల్లి గంగామణి అంత్యక్రియలు నిర్వహించేందుకు నా అన్నవారు ఎవరూ తోడుగా రాకపోవడంతో ఏం చేయాలో ఎ తెలియక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది.. చిన్నారి దుర్గ.
బంధువులు ఉన్నా ఆర్థికంగా అండగా నిలవకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తల్లి చివరి మజిలీ కోసం భిక్షాటన చేపట్టింది ఆ చిన్నారి. తల్లి మృతదేహం సమీపంలో ఓ చిన్న గుడ్డను పరిచి తోచిన సాయం చేయమంటూ స్థానికులను వేడుకుంది.. ఈ సమాచారం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చి తమవంతు ఆర్థిక సాయం అందించారు.. ఆత్మహత్య కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ కోసం వచ్చిన పోలీస్ సిబ్బంది కూడా తోచిన సాయం అందించారు.. కాగా.. ఈ విషయం తెలిసిన మరికొందరు ఆన్ లైన్ ద్వారా చిన్నారికి తోడుగా నిలిచి అంత్యక్రియలకు సాయం అందించారు.. కాగా.. ఈ ఘటన స్థానికులను, చూపరులను కంటతడి పెట్టించింది.
టీవి9 కథనానికి స్పందన
తల్లి అంత్యక్రియలకు బిక్షాటన చేసిన చిన్నారి కథనాన్ని టీవి9 ప్రసారం చేసింది. 11 ఏళ్ల చిన్నారి దుర్గ హృదయ విదారక ఘటనకు అందరూ చలించిపోయారు. ఈ కథనానికి దాతల నుంచి విశేష స్పందన లభించింది. కేసు విచారణకు వచ్చిన ముథోల్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. ముథోల్ సీఐ మల్లేష్, సర్కిల్ పోలీస్ సిబ్బంది చిన్నారి దుర్గకు 8 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. అలాగే ఆంద్రప్రదేశ్ నెల్లూర్ జిల్లాకు చెందిన మానవత వాదులు స్పందించారు. గజానంద్ అనే ఉపాద్యాయుడు రూ. 5 వేల ఆర్థిక సాయం అందించారు. అలాగే స్థానిక సర్పంట్ చిన్నారి దుర్గకు నిత్యవసర సరుకులు అందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..