Khammam: ఏడాదిగా గొంతునొప్పి, సరిగ్గా ఆహారం తినలేకపోతున్న బాలుడు – ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించగా
మహబూబాబాద్ జిల్లా పాత పోచారం గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు షన్ముఖ్ గొంతులో ఇరుక్కున్న ప్లాస్టిక్ బుల్లెట్ వల్ల ఏడాది పాటు నరకయాతన అనుభవించాడు. ఖమ్మంలోని ప్రవీణ్ ఈఎన్టీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఎంజీవీ ప్రవీణ్ అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేసి ఆ బుల్లెట్‌ను తొలగించి బాలుడి ప్రాణాలను రక్షించారు.

మహబూబాబాద్ జిల్లా పాత పోచారం గ్రామానికి చెందిన మూడేళ్ల పి.షన్ముఖ్ అనే బాలుడు ఏడాది క్రితం జరిగిన ఒక ప్రమాదం కారణంగా నానా అవస్థలు పడుతూ ఉన్నాడు. ఇంటి వద్ద బొమ్మ తుపాకీతో ఆడుకుంటున్న సమయంలో.. ప్రమాదవశాత్తు ప్లాస్టిక్ బుల్లెట్ అతని గొంతులోకి వెళ్లి ఇరుక్కుపోయింది. దీంతో బాలుడు తీవ్రమైన గొంతునొప్పితో పాటు ఆహారాన్ని సరిగ్గా తినలేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డాడు. తల్లిదండ్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినప్పటికీ.. సమస్యను సరైన రీతిలో గుర్తించలేకపోయారు.
ఈనెల 18న ఖమ్మంలోని ప్రవీణ్ ఈఎన్టీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడి డాక్టర్ ఎంజీవీ ప్రవీణ్ బాలుడిని పరీక్షించగా.. ఎండోస్కోపీ ద్వారా గొంతులో కాకుండా ముక్కు అంగిటి భాగం నుంచి కపాలం మెదడు వైపుకు ఏదో చిన్న వస్తువుందని గుర్తించారు. సీటీ స్కాన్ చేయించగా.. అది ప్లాస్టిక్ బుల్లెట్ అని నిర్ధారణైంది.
బుల్లెట్ సంవత్సరం పాటు అక్కడే ఉండటం వల్ల దాని చుట్టు చర్మం పెరిగి పూడిపోయింది. డాక్టర్ ప్రవీణ్, అత్యంత క్లిష్టతరమైన ఆపరేషన్ ద్వారా రెండు గంటల పాటు శ్రమించి ఆ ప్లాస్టిక్ బుల్లెట్‌ను తొలగించారు. అది సుమారు 2 సెంటీమీటర్లు ఉండగా, మరికొన్ని నెలలు అక్కడే ఉంటే మెదడుకు రక్త సరఫరా చేసే నాళాలను డ్యామేజ్ చేసే ప్రమాదం ఉందని తెలిపారు.
ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా బాలుడిని ప్రాణాపాయం నుంచి కాపాడగలిగినట్లు చెప్పారు. రెండు రోజుల పరీక్షల అనంతరం బాలుడు పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్లాడు. తన కుమారుడిని కాపాడిన డాక్టర్ ప్రవీణ్‌కు బాలుడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పిల్లలు ఆడుకునే సమయంలో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని డాక్టర్ ప్రవీణ్ సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
