Pilot vs Patnam: పైలట్‌ వర్సెస్‌ పట్నం.. తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారిన తాండూరు తన్నులాట!

తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు తాండూరు తన్నులాట హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసు అధికారిని బండబూతులు తిట్టిన మాజీ మంత్రి ఆడియో బయటకు రావడం.. పెద్ద దుమారం రేపింది.

Pilot vs Patnam: పైలట్‌ వర్సెస్‌ పట్నం.. తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారిన తాండూరు తన్నులాట!
Pilot Rohit Reddy Vs Patnam Mahender Reddy
Follow us

|

Updated on: Apr 28, 2022 | 7:38 PM

Pilot Rohit Reddy vs Patnam Mahendar Reddy: తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు తాండూరు తన్నులాట హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసు అధికారిని బండబూతులు తిట్టిన మాజీ మంత్రి ఆడియో బయటకు రావడం.. పెద్ద దుమారం రేపింది. అయితే, ఇది ఇవాళ్టి ఇష్యూ కానే కాదు… కొన్ని రోజులుగా మండుతున్న రాజకీయ అగ్నిగోళం అది. ఇప్పుడు కాస్తా… అధికారుల వైపు మళ్లింది. ఈరచ్చక పుల్‌స్టాప్‌ పెట్టేందుకు గులాబీ హైకమాండ్‌ ఏం చేయబోతోందన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

తాండూరు సీఐని.. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి బండబూతులు తిట్టిన వ్యవహారం… తెలంగాణలో కాక పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రిపై కేసు కూడా నమోదైంది. ఐపీసీ 353, 504, 506 కింద కేసు పెట్టారు పోలీసులు. అయితే, ఈ ఎపిసోడ్‌ పూర్తిగా పొలిటికల్‌ టర్న్‌ తీసుకోవడంతో దుమారం ఎక్కువైంది. స్థానికంగా ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తాను సీఐని తిట్టలేదనీ, విషయాన్ని కోర్టులో తేల్చుకుంటాననీ చెబుతున్న మహేందర్‌రెడ్డి.. ఇదంతా పైలట్‌ రోహిత్‌ రెడ్డి కుట్రే అంటున్నారు. తాను నోరు పారేసుకున్న అధికారులకు క్షమాపణ చెప్పారు. కాకపోతే, ఆ క్షమాపణ ప్రకటన రూపంలో విడుదల చేశారు.

తాండూరులో ఈ ఇద్దరు నేతల మధ్య రాజుకున్న మంటలు కార్చిచ్చులా రగులుతూనే ఉన్నాయి. ఎమ్మెల్సీ ‘పట్నం’ మహేందర్‌ రెడ్డి తగ్గేదెలె అంటుంటే.. పట్టుకోసం పైలెట్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం అధికారుల మీదికి మళ్లడంతో.. తాండూరు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌‌గా మారింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య పోరు.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. మహేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన గెలిచిన పైలెట్‌ రోహిత్‌రెడ్డి… టిఆర్ఎస్‌లోకి వచ్చేయడంతో ఈ వివాదాలు మరింత ఎక్కువయ్యయి.

మున్సిపల్ ఎన్నికలు.. టీఆర్ఎస్ గ్రామ కమిటీలు మొదలు… అన్నింటా పట్నం వర్సెస్‌ పైలట్‌గా మారిపోయింది పరిస్థితి. ఎమ్మెల్యేకు సమాచారం లేకండానే తాండూరులో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పర్యటనలు చేస్తుండటం వివాదాలకు దారితీసింది. ఈ పంచాయితీ హైకమాండ్‌ వరకూ వెళ్లడంతో.. ఇద్దరు నేతలకూ స్ట్రాంగ్‌ వార్నింగే ఇచ్చి పంపారు పార్టీ పెద్దలు. అయితే… రెండు,మూడు రోజులు కలిసి ఉన్న నేతలు మళ్లీ మొదటికొచ్చారు.

ఇటీవల రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలోనూ.. ఎమ్మెల్సీ వర్సెస్‌ ఎమ్మెల్యేగా మారింది పరిస్థితి. తన అనుచరులు స్టేజీ మీదకు వస్తుండగా అడ్డుకున్న ఎస్సైపై ఓ రేంజ్‌లో గుస్సా అయ్యారు మహేందర్‌రెడ్డి. ఇప్పుడు తాజా ఇష్యూలో ఏకంగా.. సిఐపై బూతు పురాణం అందుకోవడం అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. అయితే, ఇదంతా ఎమ్మెల్యే కుట్ర అంటూ మహేందర్‌రెడ్డి చేసిన కామెంట్స్‌.. దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారం.. హైకమాండ్‌ దృష్టికీ వెళ్లింది. ఇద్దరు నేతలకూ వార్నింగ్‌ ఇచ్చిన పార్టీ పెద్దలు… ఈసారి అధికారులు కూడా పిర్యాదు చేయడంతో… క్రమశిక్షణ చర్యలుంటాయా? లేక పిలిపించి మాట్లాడుతారా? అనేది తెలియాల్సింది.

ఇన్నాళ్లూ గప్‌చుప్‌గా సాగిన వీళ్లిద్దరి గొడవలు.. ఒక్కసారిగా రోడ్డున పడటంతో అధికారపార్టీలో అలజడి మొదలైంది. రోహిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి… ఎవరికివారు ఈసారి టిక్కెట్‌ తనదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మహేందర్‌ రెడ్డి తనకు పోటీయే కాదని పైలట్‌ చెబుతుంటే… ఈసారి ఎన్నికల్లో తన సత్తా చూపిస్తానని పట్నం అంటున్నారు. దీంతో, తాండూతు తన్నులాట.. పొలిటికల్‌గా మిర్చీ ని మించి ఘాటు పుట్టిస్తోంది.

Read Also…. Vijaya Gadde: తెలుగు మహిళను టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ ని కొన్న వెంటనే ఎందుకిలా చేస్తున్నాడంటే..