Ts High Court: తెలంగాణ డిగ్రీ పరీక్షలపై హైకోర్టులో పిటిషన్.. జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు
Ts High Court: తెలంగాణలో డిగ్రీ పరీక్షలపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్య పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి డిగ్రీ పరీక్షలు జరుగుతున్న తరుణంలో..
Ts High Court: తెలంగాణలో డిగ్రీ పరీక్షలపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్య పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి డిగ్రీ పరీక్షలు జరుగుతున్న తరుణంలో భౌతికంగా పరీక్షలు నిర్వహించకుండా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే పిల్ ను లంచ్ మోషన్ అడిగిన అడ్వకేట్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచే మొదలయ్యాయని, ఇందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది
మరోవైపు డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని విద్యార్థులు ముట్టడించారు. ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయడం లేదా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులందరూ దాదాపు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటారని, అందరూ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకోని నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని వారు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
కాగా, నాలుగు రోజుల కిందటనే డిగ్రీతో పాటు పీజీ పరీక్షలను నిర్వహించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగానే గతంలో వాయిదా పడిన డిగ్రీ పరీక్షలను జులై 8 నుండి ప్రారంభం కానుండగా, పీజీకి సంబంధించి జులై 19 నుండి నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. కరోనా తగ్గు ముఖం పట్టడడంతో అన్ని రకాల విద్యా సంస్థలను కూడా నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులు తల్లి దండ్రుల ఆందోళనలతో స్కూళ్లకు మాత్రం ఆన్‌లైన్ క్లాసులకే పరిమితం చేశారు. ఇప్పుడు డిగ్రీ పరీక్షలపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి.