చనిపోయిన కొడుకును మర్చిపోలేక.. ఇంటి దగ్గరే విగ్రహాన్ని కట్టించిన తల్లిదండ్రులు..
అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడిని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబలించింది. ఉన్నత విద్యను చదివి తమకు ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు అనంత లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ కుమారుడు మృతి చెందిన విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక అతడి జ్ఞాపకాలతో జీవిస్తున్నారు.

అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడిని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబలించింది. ఉన్నత విద్యను చదివి తమకు ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు అనంత లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ కుమారుడు మృతి చెందిన విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక అతడి జ్ఞాపకాలతో జీవిస్తున్నారు. గత సంవత్సర కాలంగా తీవ్ర మనోవేదనతో ఉన్న తల్లిదండ్రులు కుమారుడి కన్నీటి జ్ఞాపకాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సుమారు మూడు లక్షల రూపాయల వ్యయంతో తమ కుమారుడి విగ్రహాన్ని ఇంటి పక్కనే ఉన్న స్థలంలో ఏర్పాటు చేసుకున్నారు.
వైరా మండలంలోని ముసలిమడుగు గ్రామానికి చెందిన తడికమళ్ళ నాగార్జున, రంజాన్ దంపతుల కుమారుడు వంశీ(23) గతేడాది ఫిబ్రవరి 13వ తేదీన కొణిజర్ల వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. తడికిమళ్ళ నాగార్జున, రంజాన్ దంపతులకు కుమారుడు వంశీ, కుమార్తె పూజ ఉన్నారు. 2022వ సంవత్సరంలో వైరా మండలం లింగన్నపాలెం గ్రామానికి చెందిన కారుమంచి రామకృష్ణతో పూజ వివాహం జరిపించారు. వంశీ గత ఏడాది డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్న తరుణంలో అతడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. తమకున్న ఒక్కగానొక్క కుమారుడు దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ కుమారుడి మృతిని జీర్ణించుకోలేక గడిచిన సంవత్సర కాలంగా బాధపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే సమయంలో వారికి ఓ ఆలోచన వచ్చింది.
తమ కుమారుడు తమ కళ్ళ ముందు లేకపోవడంతో అతని ప్రతిరూపంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ముసలిమడుగు గ్రామంలోని తమ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో వంశీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసేందుకు పిల్లర్లు వేసి స్లాబ్ పోసి శాశ్వత నిర్మాణాన్ని చేపట్టారు. విగ్రహానికి 70 వేల రూపాయలు ఖర్చు కాగా.. శాశ్వత నిర్మాణంకు మరో 2.30 లక్షలు ఖర్చు చేశారు. ఆ విగ్రహంలోనే ప్రతిరోజు తమ కుమారుడిని చూసుకోవాలని ఆ తల్లిదండ్రులు తలంచారు. వంశీ సంవత్సరికం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి.. భౌతికంగా తమ కుమారుడు లేకపోయినా.. విగ్రహం రూపంలో తమ కళ్ళ ముందు ఉన్నాడని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు




