AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 రోజులు బాంబుల మోతతో దద్దరిల్లిన కర్రెగుట్ట ప్రశాంతం.. కారణం అదేనా?

మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. కర్రెగుట్టల్లో మూడు వారాల పాటు తుపాకుల మోత మోగాయి. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా భద్రతా బలగాలు వెనక్కి వెళ్లిపోయాయి. 20 రోజులపాటు బాంబుల మోత, కాల్పుల శబ్ధాలతో దద్దరిల్లిన కర్రెగుట్టల ప్రాంతం ఇప్పుడు ప్రశాంతంగా మారిపోయింది.

20 రోజులు బాంబుల మోతతో దద్దరిల్లిన కర్రెగుట్ట ప్రశాంతం.. కారణం అదేనా?
Operation Kagar
G Peddeesh Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: May 11, 2025 | 7:00 PM

Share

మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. కర్రెగుట్టల్లో మూడు వారాల పాటు తుపాకుల మోత మోగాయి. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా భద్రతా బలగాలు వెనక్కి వెళ్లిపోయాయి. 20 రోజులపాటు బాంబుల మోత, కాల్పుల శబ్ధాలతో దద్దరిల్లిన కర్రెగుట్టల ప్రాంతం ఇప్పుడు ప్రశాంతంగా మారిపోయింది. చుట్టుపక్కల గ్రామాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఇంతకీ ఆపరేషన్ కగార్ ఆగిపోయిందా.. లేక ఆపాల్సి వచ్చిందా?

వీలైతే తుపాకీని వీడి జనజీవన స్రవంతిలో కలవండి. లేదంటే తుపాకీకి బలవ్వండి అంటూ.. ఆపరేషన్ కగార్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా మావోయిస్టులను ఏరివేసింది. నక్సల్స్‌కు కంచుకోటగా ఉన్న దండకారణ్యాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మావోయిస్టుల అడ్డా అయిన కర్రెగుట్టలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి.

కర్రెగుట్టల్లో 20 రోజుల పాటు కాల్పుల మోతలే వినిపించాయి. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా తుపాకుల శబ్దం ఆగిపోయింది. కర్రెగుట్టల నుంచి బలగాలు వెనక్కి మళ్లాయి. హెలికాప్టర్లు, బాంబుల మోత ఆగింది. CRPFతో పాటు కోబ్రాకు చెందిన 5 వేల మంది క్యాంపులకు వెళ్లిపోయారు. బలగాలు వెనుతిరిగి వెళ్ళిపోవడంతో కర్రెగుట్టల్లో ఉద్రిక్తత సద్దుమణిగింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాల్లో 20 రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది. వెంకటాపురం, వాజేడు మండలాల ప్రజల్లో టెన్షన్ తగ్గింది.

ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ వైపు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్‌టీఎఫ్, డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ కూంబింగ్‌లో పాల్గొన్నాయి. తెలంగాణ వైపు మాత్రం కగార్ ఆపరేషన్‌ను నిలిపివేశాయి భద్రతా బలగాలు. ఈ ఆపరేషన్‌ను పూర్తిగా నిలిపివేశారా? లేక తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారా అనే దానిపై క్లారిటీ లేదు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా కేంద్ర బలగాలను సరిహద్దులకు తరలించడంతో కగార్ ఆపరేషన్ ఆగిందా.. లేక టార్గెట్ పూర్తైందా అనేదానిపైనా అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా.. మే 6వ తేదీన కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. 22 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కానీ మృతుల వివరాలను అధికారులు వెల్లడించలేదు. మృతుల్లో కీలక నేతలు ఎవరైనా ఉన్నారా.. అనే వివరాలను ఇప్పటికీ బయటకు చెప్పలేదు. కర్రెగుట్టల ఆపరేషన్‌లో పోలీసులు ఎందుకు గోప్యత పాటిస్తున్నారు. ఈ ఆపరేషన్ ప్రస్తుత స్టేటస్ ఏంటనే దానిపై క్లారిటీ లేదు.

ఆపరేషన్ కగార్‌ను తెలంగాణలో అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్ పూర్తిగా వ్యతిరేకించాయి. మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే నిలిపివేయాలని ఆ రెండు పార్టీలు కోరాయి. కానీ.. మావోయిస్టుల విషయంలో జాలి చూపించే ప్రసక్తే లేదని బీజేపీ వాదించింది. మరి సడెన్‌గా బలగాలు ఎందుకు వెనక్కి తగ్గాయో తెలియడం లేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..