Telangana Cabinet: ఉన్నదీ ఒక్కటే.. ఆ ఒక్కటి ఎవరికి?.. కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి..?

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయ‌నే చర్చ పార్టీ ఎమ్మెల్యేలను ఊరిస్తోంది.

Telangana Cabinet: ఉన్నదీ ఒక్కటే.. ఆ ఒక్కటి ఎవరికి?.. కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి..?
Cm Kcr
Follow us
TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Mar 16, 2022 | 3:54 PM

Telangana Cabinet Reshuffle: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు(CM KCR) మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయ‌నే చర్చ తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) పార్టీ ఎమ్మెల్యేలను ఊరిస్తోంది. అయితే.. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక.. విడతల వారీగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని తొలినాళ్ల స్వయంగా సీఎం కేసీఆర్‌ చెప్పారు. దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రక‌టించారు. ఆ త‌ర్వాత‌ నాగార్జునసాగర్,హుజూరాబాద్, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే.. వాటి ఫలితాల ఆధారంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటార‌ని అప్పట్లో గులాబీ వర్గాల్లో ప్రచారం వినిపించింది. దీంతో ఇప్పటికైనా సీఎం కేసీఆర్ త‌మ‌పైన ద‌య‌చూప‌కపోతారా..? కేబినెట్‌లో స్థానం క‌ల్పించక‌పోతారా..? అని వేచి చూస్తున్నారు రాష్ట్రంలోని కొంద‌రు ఎమ్మెల్యేలు.

కాగా, తెలంగాణ మంత్రి వర్గంలో కేవలం ఒకే ఒక మంత్రి పదవి బెర్త్‌ ఖాళీగా ఉంది. ఒక్క మంత్రి పదవి కోసం క్యూలో పది మందికిపైగా పోటీపడుతున్నారు. కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి ఉన్నాయి? ఎవరిని అక్కున చేర్చుకుంటారనేది ఇప్పడు టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఏనాటి నుంచి మంత్రి పదవిపై సూటిపెట్టిన కౌన్సిల్‌ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కల ఈసారి కూడా నెరవేరలేదు. ఆయనకు మరోసారి శాసన మండలి చైర్మన్‌ కట్టబెట్టడంతో మంత్రి పదవి రేసు నుంచి గుత్తా తప్పుకున్నట్లైంది.

అయితే, శాసనమండలి చైర్మన్‌ వస్తుందని ఆశించిన సీనియర్‌ నేత కడియం శ్రీహరి ఇప్పుడు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో దళితులపై ఫోకస్‌ చేస్తోన్న కేసీఆర్‌ ఆ కోటాలో కడియంకు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అర్ధాంతరంగా రాజ్యసభకు రాజీనామా చేయించి బండా ప్రకాశ్‌ను ఎమ్మెల్సీని చేసిన కేసీఆర్‌ ఈటల రాజేందర్‌ స్థానంలో ముదిరాజ్‌ సామాజిక వర్గాన్ని బుజ్జగించడానికి మంత్రి పదవి ఇస్తారనే అనుకున్నారు. అయితే, మండలి డిప్యూటీ చైర్మన్‌ కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రేసులో బండా పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక, ఈటలకు పోటీగా కౌశిక్‌రెడ్డికి అవకాశం కల్పిస్తారని భావిస్తున్నప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి బెర్తులు పుల్‌ కావడంతో కౌశిక్‌ డౌటే.

మరోవైపు కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు కేబినెట్‌లో చోటు అంటూ టీఆర్‌ఎస్‌లో ప్రచారం జోరుగా జరుగుతోంది. అందుకే కవిత రాజ్యసభను తృణీకరించినట్లు తెలుస్తోంది. అయితే, ఒకే ఒక మైనస్‌ కేసీఆర్‌ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే సీఎంతో సహా ముగ్గురు మంత్రి వర్గంలో కొనసాగుతున్నారు. ఇతి ప్రతిబంధం అవుతుందా? ఇవేమి పట్టించుకోకుండా కవితకు కేసీఆర్‌ అవకాశం కల్పిస్తారా చూడాలి. కాగా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా కొనసాగుతన్న దాస్యం వినయ్‌ బాస్కర్‌ తొలి నుంచి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు నమ్మినబంటుగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో బీసీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని వినయ్‌ బాస్కర్‌ కోరుతున్నారు.

అటు, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ఇంద్రకరణ్‌రెడ్డి ఒక్కరే మంత్రిగా కొనసాగుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన జోగు రామన్న కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో కేవలం మంత్రి పదవి కోసమే గులాబీ కండువ కప్పుకున్న దానం నాగేందర్‌ సుదీర్ఘకాలంగా మంత్రి పదవి కోసం కలలు కంటున్నారు. సెంట్రల్‌ హైదరాబాద్‌ ఎమ్మెల్యేగా తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదిలావుంటే, కేసీఆర్ కూడా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. కానీ.. మార్పులు చేర్పులు చేస్తే రాజ‌కీయ ప‌రిణామాలు మారుతాయ‌నే అనుమానంతో స‌మ‌యానుకూలంగా వ్య‌వ‌హరిస్తూ వ‌చ్చారు. స‌మ‌యాన్ని చూసి ఉన్న‌ప‌ళంగా ఒక్క‌సారిగా మార్పులు చేయొచ్చు అనే చ‌ర్చ కూడా పార్టీ వ‌ర్గాల్లో జ‌రిగింది. అయితే.. రాష్ట్రంలో టీఆర్ఎస్ పై ప్రజ‌ల‌కు ఏర్పడిన వ్యతిరేక‌త‌ను చూసి భ‌విష్యత్తులో టీఆర్ఎస్ నుండి పోటీ చేస్తే గెలుస్తామా అనే అనుమానాలు కూడా కొంద‌రు టీఆర్ఎస్ నేతల్లో గ‌ట్టిగా పాతుకుపోయింది. మరోవైపు, రాజకీయ వ్యూహ ధురంధరుడిగా పేరొందిన కేసీఆర్.. ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవి ఇప్పుడిప్పుడే భర్తీ చేసే అవకాశం లేదని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. సో ఆ ఒక్కటి ఖాళీనే అంటున్నారు.

Read Also….

Children Vaccine: నిర్లక్ష్యం వద్దు.. పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు ..