అయోమయంగా మారిన ఆలయాల నిర్వహణ.. పలుచోట్ల అర్చకులకూ జీతాలు ఇవ్వలేని పరిస్థితి.. భగవంతా..!
కరోనా ప్రభావంతో ఆలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. హుండీ ఆదాయం పూర్తిగా అడుగంటిపోయింది.. అర్చకుల పరిస్థితి అయోమయంలా మారింది..
కరోనా ప్రభావంతో ఆలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. హుండీ ఆదాయం పూర్తిగా అడుగంటిపోయింది.. అర్చకుల పరిస్థితి అయోమయంలా మారింది.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆలయాల నిర్వహణ – అర్చకుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. కరోనా ప్రభావంతో వ్యాపారాలు కుదేలయ్యాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఏ ఇంటి తలుపు తట్టినా అప్పుల తిప్పలు, ఆర్థిక ఇబ్బందులే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దైవానికి కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా సంక్షోభంలో ఆలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.. ఆలయాలలో హుండీ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ప్రముఖ దేవాలయాలు కళ తప్పాయి. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వేయి స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, రామప్ప, కాళేశ్వరం, కురవి వీరభద్రస్వామి దేవాలయం, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం, కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయం, సిద్దేశ్వరాలయం భక్తులు లేక వెలవెలబోతున్నాయి. పెద్ద దేవాలయాలు తప్పితే.. మిగిలిన అన్ని గుళ్లలో అర్చకులకు కూడా జీతాలు చెల్లించేందుకు అధికారులు చేతులు తడుముకుంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో ఇదే పరిస్థితి ఉంది.
మరోవైపు దేవాలయాల ముందు షాపులు నిర్వహించేవారి పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ప్రస్తుతం వారికి రూపాయి ఆదాయం కూడా లేకపోయింది. వేసవి కాలం కావడంతో కూలి పనులు కూడా దొరకడం లేదు. దీంతో వారి ఇళ్లల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు పోతుందో.. ఈ కష్టాలు ఎప్పుడు తగ్గుతాయో…!
Also Read : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు నేటి నుంచే ఉచిత రేషన్ బియ్యం పంపిణీ.. ఒక్కొక్కరి 15 కేజీలు