AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adilabad: అతని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిన పోలీస్ డాగ్.. తనిఖీ చేయగా జేబులో..

ఆదిలాబాద్‌లో నార్కోటిక్ డిటెక్షన్ డాగ్ ‘రోమా’ మరోసారి తన మార్క్ చాటింది. వినాయక్ చౌక్ వద్ద తనిఖీల్లో దాచిన గంజాయిని గుర్తించి నిందితుడి అరెస్టు విషయంలో కీ రోల్ పోషించింది. మాదకద్రవ్యాల నియంత్రణలో నార్కోటిక్ డాగ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని పోలీసులు తెలిపారు.

Adilabad: అతని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిన పోలీస్ డాగ్.. తనిఖీ చేయగా జేబులో..
Narcotics Detection Dog
Ram Naramaneni
|

Updated on: Jan 03, 2026 | 4:13 PM

Share

డ్రగ్స్ సరఫరా, వినియోగాన్ని నియంత్రించడమే టార్గెట్‌గా పెట్టుకున్న పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడంతో పాటు స్పెషల్ ఆపరేషన్స్ చేస్తున్నారు. మరోవైపు జాగిలాలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి డ్రగ్స్ డిటెక్ట్ చేసేందుకు వినియోగిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో చేసిన  తనిఖీల్లో నార్కోటిక్స్ డిటెక్షన్ డాగ్ ‘రోమా’ మరోసారి తన సామర్థ్యాన్ని చాటింది.  1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ చౌక్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో 6 గ్రాముల గంజాయిని గుర్తించింది. సున్నితమైన, ముఖ్య ప్రాంతాల్లో డ్రగ్స్ నివారణ కోసం చేపట్టిన సాధారణ తనిఖీల్లో భాగంగా నార్కోటిక్ డాగ్‌తో చెకింగ్ చేయగా.. రెండు ప్యాకెట్లలో దాచిన గంజాయిని ‘రోమా’ గుర్తించింది. ఈ ఘటనలో ధంగర్ మోహల్లాకు చెందిన సాహిల్ అహ్మద్ (38)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్యాంట్ జేబులో గంజాయిని సీల్ చేసి దాచుకున్నప్పటికీ, దూరం నుంచే గంజాయి ఉనికిని ‘రోమా’ గుర్తించి ఆశ్చర్యపరిచింది. నిందితుడిపై ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ తనిఖీలు నార్కోటిక్ డాగ్ హ్యాండ్లర్ హెడ్ కానిస్టేబుల్ పి. రమేశ్ ఆధ్వర్యంలో జరగ్గా, కానిస్టేబుల్ జి. శ్రీధర్, హోంగార్డు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ ఆదిలాబాద్ ఎస్పీ ఆదేశాలతో నిర్వహించామని పోలీసులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 38 నార్కోటిక్స్ డిటెక్షన్ డాగ్స్ ఉన్నాయని, ఇది దేశంలోనే అత్యధిక సంఖ్య అని పోలీసులు పేర్కొన్నారు. స్కూల్స్, కాలేజీల పరిసరాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రాంతాల్లో నిత్యం వీటితో తనిఖీలు చేపడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామని తెలిపారు. గతంలో వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహించిన నార్కోటిక్ డాగ్.. దాదాపు 100 మీటర్ల దూరంలోని ఇంటి పైకప్పుపై పూల కుండీలో పెంచుతున్న గంజాయి మొక్కను గుర్తించిన ఘటనను కూడా పోలీసులు గుర్తు చేశారు. మరో సందర్భంలో అదే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం నంబర్–1 చివర దాచిన సంచిలో 4 కిలోల గంజాయిని పట్టివేయడంలో కీలక పాత్ర పోషించిందన్నారు.