Telangana: ఆ మూడు గ్రామాల్లో కనిపించని దసరా సందడి.. భయంతో పంట పొలాలు, బంధువుల ఇళ్లకు పరుగులు!
చిత్తనూరు, జిన్నారం, ఎక్లాస్ పూర్ గ్రామాల్లో దసరా పండుగ ఏమాత్రం కనిపించలేదు. గ్రామస్థులు ఊరిని ఖాళీ చేసి అడవులు, బంధువులు ఇళ్లకు వెళ్ళిపోయారు. ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి. రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. వృద్దులు తప్ప ఇంకెవరు కనిపించడం లేదు. పండుగ పూట బుక్కెడు ముద్దకు దూరమయ్యామని వృద్దులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసుల చర్యలతో ఇతర ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగం, విద్యనభ్యసించే వారు సైతం ఎవరు..

నారాయణ పేట, అక్టోబర్ 25: పండుగ అంటేనే పల్లెలు. పచ్చని చేనులో పాల పిట్టను చూసి, ఊరంతా జమ్మి పంచుకొని జరుపుకునే అతిపెద్ద పండుగ దసరా. తెలంగాణ గ్రామాల్లో దసరా గురించి చెప్పన్కర్లేదు. గ్రామాలు విడిచి ఎక్కడో ఎక్కడో స్థిరపడ్డవారు, విద్యా, ఉద్యోగ, ఉపాధి, వలస వెళ్లిన వారిని ఏకం చేసే ఏకైక పండుగ. ఇదంతా ఒక వైపు కానీ, నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని మూడు గ్రామాలకు మాత్రం ఈ పండుగ ఓ పీడకలగా మిగిలింది.
అవును.. ఆ పల్లెలు పండుగకు దూరమయ్యాయి. కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళారో తెలియక ముద్ద కోసం వృద్ధుల కన్నీరు పెడుతున్నారు. అర్థరాత్రులు పోలీసు బూటు చప్పుళ్ళు గ్రామ ప్రజలను అడవి, పంటపొలాల బాటకు పరుగులు పెట్టించాయి. ఇదేదో ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన అంశం కాదు. మావోయిస్టులా అంటే అంతకన్నా కాదు. పచ్చని పల్లెలో ఇథనాల్ కంపెనీ పెట్టిన చిచ్చుకు నిలువుటద్దమే ఈ ఘటన.
ఇథనాల్ కంపెనీ చిచ్చు నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని చిత్తనూరు, జిన్నారం, ఎక్లాస్ పూర్ గ్రామస్థులను అల్లకల్లోలం చేస్తోంది. ఈ నెల 22వ తేదీన ఎక్లాస్ పూర్ గేట్ వద్ద చిత్తనూరు ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా రైతులు, స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. గ్రామాల ప్రజలు, పోలీసుల మధ్య ఘర్షణ నెలకొనడంతో పోలీసు వాహనాలు ధ్వంసం జరగగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
పోలిసుల గుప్పిట్లో మూడు గ్రామాలు…
ఆ రోజు నుండి నేటి వరకు గ్రామాల్లో నివురు గప్పిన నిప్పులా పరిస్థితి కనిపిస్తోంది. ఆందోళన అనంతరం అయా గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అర్థరాత్రుల్లు గ్రామాల్లో పోలీసు బూట్లు చప్పుడు ప్రజలను ఆగం చేస్తున్నాయి. ఘటన జరిగిన వీడియోలను పరిశీలిస్తూ ఆందోళనలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 20మందిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.
ఊర్లు ఖాళీ, రోడ్లు నిర్మానుష్యం…
ఇక చిత్తనూరు, జిన్నారం, ఎక్లాస్ పూర్ గ్రామాల్లో దసరా పండుగ ఏమాత్రం కనిపించలేదు. గ్రామస్థులు ఊరిని ఖాళీ చేసి అడవులు, బంధువులు ఇళ్లకు వెళ్ళిపోయారు. ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి. రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. వృద్దులు తప్ప ఇంకెవరు కనిపించడం లేదు. పండుగ పూట బుక్కెడు ముద్దకు దూరమయ్యామని వృద్దులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసుల చర్యలతో ఇతర ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగం, విద్యనభ్యసించే వారు సైతం ఎవరు గ్రామం మొఖం చూడలేదు. ఏది ఏమైనా ఇథనాల్ కంపెనీని తరలించే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.