Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagoba Jatara 2025: ఇక వెళ్లొస్తాం నాగశేషుడా.. ముగిసిన ఆదివాసీల కుంభమేళా

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని గోండు గిరిజనతెగకు చెందిన మెస్రం వంశస్తులు జరిపే అతి పెద్ద గిరిజన మేళ నాగోబా జాతర. ఈ జాతర ఆదివాసీల ఐక్యతను చాటుతుంది. వారి విలక్షణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపడుతుంది. అప్పటి వరకూ చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉండే ఆదివాసీ, గోండ్, కోలామ్, పరదాస్, మెస్రం వంశీయులంతా ఈ జాతరలో ఒక్కచోటికి చేరుతారు.

Nagoba Jatara 2025: ఇక వెళ్లొస్తాం నాగశేషుడా.. ముగిసిన ఆదివాసీల కుంభమేళా
Nagoba Jatara 2025
Follow us
Naresh Gollana

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 01, 2025 | 4:19 PM

ఆదివాసీల కుంభమేళా కెస్లాపూర్ నాగోబా జాతర శనివారంనాడు అధికారికంగా ముగిసింది. ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా పూజలందుకున్న నాగోబా దేవతకు మండగాజిలి పూజలతో జాతరను ముగించారు మెస్రం వంశీయులు. నాగశేషుడికి మనసారా మొక్కి వెళ్లొస్తాం నాగోబా అంటూ కెస్లాపూర్ నుంచి బుడుందేవ్ పూజలకు శ్యాంపూర్ బాట పట్టారు మెస్రం వంశీయులు. మెస్రం వంశీయులు పూజలు ముగిసినా భక్తుల దర్శనార్ధం మరో రెండు రోజుల పాటు జాతర సాగనుంది.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని గోండు గిరిజనతెగకు చెందిన మెస్రం వంశస్తులు జరిపే అతి పెద్ద గిరిజన మేళ నాగోబా జాతర. ఈ జాతర ఆదివాసీల ఐక్యతను చాటుతుంది. వారి విలక్షణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపడుతుంది. అప్పటి వరకూ చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉండే ఆదివాసీ, గోండ్, కోలామ్, పరదాస్, మెస్రం వంశీయులంతా ఈ జాతరలో ఒక్కచోటికి చేరుతారు. వీరంతా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కెస్లాపూర్ చేరుకోవడంతో జాతర సందడి మొదలవుతోంది. ఈ ఏడాది జనవరి 28 న పుష్య అమావాస్య అర్థరాత్రి 11 గంటలకు గంగాజలాభిషేకంతో మహాపూజ ప్రారంభం కాగా.. భేతల్ దేవుడికి మండగాజలి పూజలతో జాతర ముగిసింది. మొదటి రోజు అర్థరాత్రి‌ మహాపూజ అనంతరం కొత్త కోడళ్ల పరిచయ వేడుక భేటింగ్ సాగగా.. 41 రోజుల ఉపవాస దీక్షలను విరమించిన మెస్రం వంశీయులు రెండవ రోజు జాతరలో భాగంగా బాన్ దేవుడికి , పెర్సపేన్ దేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు.

మూడవ రోజు ప్రభుత్వం ఏర్పాటు‌ చేసిన సాంస్క్రతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా.. నాలుగవ రోజు గిరిజ‌న సమస్యలకు పరిష్కార మార్గం చూపే గిరిజన దర్బార్ సాగింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ ఏడాది అదికారులు, ప్రజాప్రతినిధులు వేరు వేరుగా దర్బార్ లో పాల్గొన్నారు. చివరిరోజు కావడంతో నాగోబా దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. నాగోబా దర్శనం తర్వాత ఎడ్లబండ్లలో వచ్చిన గిరిజనులు, జాతర ముగియడంతో తమ స్వగ్రామాలకు బయల్దేరారు.

నాగ దేవుడు కి భక్తిశ్రద్ధలతో ప్రతియేడు పుష్య అమావాస్యలో మహాపూజలు అందించడం ఆనవాయితీ.. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా ఆచార వ్యవహారాలను తూచ తప్పకుండా పాటిస్తున్న ఏకైక జాతర నాగోబా. నాగోబా మహాపూజకు ముందు, తర్వాత జరిగే తంతులలో మెస్రం వంశంలోని మహిళల పాత్రే కీలకం. ఇంటి ఆడపడుచులను అందలం ఎక్కిస్తూనే, ఆ ఇంటికి వచ్చిన కోడళ్లకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు మెస్రం వంశీయులు. తోబుట్టువులు, ఇంటి కోడళ్లకు సమాన హోదా ఇస్తారు మెస్రం వంశీయులు.

తొలి రోజు నాగోబా మహాపూజ ముగిసిన తర్వాత అర్ధరాత్రి జరిగే ముఖ్యమైన ఘట్టం భేటింగ్. ఈ కత్రువులో ఇంటి ఆడపడుచును ఏవిధంగా ఆరాధిస్తారో ఆ ఇంటి గడపకు వచ్చిన కొత్త కోడళ్లకు కూడా అంతే విలువ ఇస్తారు అనడానికి ఈ ప్రక్రియ నిదర్శనంగా నిలుస్తుంది. నాగోబా సన్నిధికి వచ్చే కొత్త కోడళ్లు మొదట సతీ దేవతకు పూజలు చేస్తారు. తరువాత మెస్రం పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆపై నాగోబా దేవుడిని దర్శించుకుంటారు. దీన్ని మెస్రం వంశీయులు ‘భేటింగ్’గా సంబోధిస్తారు. అర్ధరాత్రి మొదలయ్యే ఈ తంతు తెల్లవారుజాము వరకు జరుగుతుంది. ఈ భేటింగ్ తర్వాతనే ఆ కొత్త కోడళ్లు నాగోబా దర్శనానికి ఎప్పుడైనా వచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులను, అల్లుళ్లను భాగస్వాములను చేస్తారు. వ్యవస్థలో మహిళలు, పురుషులకు సమ్రపాధాన్యత అనేది ఈ పుట్టలు చేసే క్రతువు ద్వారా తెలుస్తుందంటారు మెస్రం పెద్దలు.

Nagoba Jatara

Nagoba Jatara

ఈ ఒక్కటే కాదు తరతరాలుగా సాగుతున్న సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు నిలువుటద్దం నాగోబా జాతర. పెద్దలను‌ గౌరవించడం చిన్నలకు సమ ప్రాదాన్యతను ఇవ్వడం ఈ జాతరలో కనిపిస్తుంది. జనవరి 28 నుండి నాగోబా దర్శనానికి వచ్చిన భక్తులతో కేస్లాపూర్‌ దారులు కిక్కిరిసి పోగా.. చివరి రోజైన శనివారం భక్తజన సంద్రమైంది కెస్లాపూర్. దేశవ్యాప్తంగా ఉన్న మెస్రం వంశీయులు, గిరిజనులతో పాటు లక్షలాది మంది నాగోబాను దర్శించుకున్నారు. బండెనక బండికట్టి వందలాది బండ్లు నాగోబా సన్నిధికి చేరుకోగా.. సంస్కృతీ సంప్రదాయాలతో పూజలు చేశారు ఆదివాసీలు. దైవభక్తితో అడవిబిడ్డలు పులికించిపోగా.. మరో రెండు రోజులు జాతర అనధికారింగా కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు దాదాపు 5 లక్షలకుపైగా భక్తులు నాగోబాను దర్శించుకున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. చివరి రోజు సంప్రదాయ వాయిద్యాలతో గోవాడ ముందర బేతల్ పూజలు చేసిన మెస్రం ఆడపడుచులు వంశ పెద్దల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. బేతల్ పూజల తర్వాత మెస్రం వంశీయులు నాగోబా దర్శనం చేసుకుని సంప్రదాయ పూజలు ముగించారు. పూజలు ముగియడంతో జాతర ముగిసినట్టు అదికారికంగా ప్రకటించారు అదికారులు.. అయినప్పటికీ అనధికారికంగా మరో రెండు రోజులు పాటు జాతర కొనసాగనుందని పేర్కొన్నారు అదికారులు. జాతర ముగియడంతో మళ్లొస్తాం నాగోబా అంటూ కెస్లాపూర్ నుండి బుడుందేవ్ జాతరకు శ్యాం పూర్ వైపు బయలు దేరారు ఆదివాసీలు.

-నరేష్ గొల్లన, ఉమ్మడి ఆదిలాబాద్