Hanumakonda: పొలాల్లో వందలాది నాటు కోళ్లు.. యాడ నుంచి వచ్చాయో తెలీదు..
ఆ ఊరంతా ఈరోజు నాటుకోడి పులుసు.. నాటుకోడి పలావ్.. నాటుకోడి ఫ్రై..నాటుకోడి పకోడీ.. నాటుకోడి కర్రీ.. అబ్బో ఆ ఊళ్లో ఏ ఇంట్లో చూసినా కోడికూర వాసనే.. ఏంటబ్బా.. ఆ ఊరంతా ఏదైనా కోడి కూర జాతర జరుగుతుందా..! వింటుంటే విచిత్రంగా ఉంది కదూ.. ఆ గ్రామస్తులకు తగిలిన లక్కీ లాటరీ ఏంటో తెలుసుకుందాం పదండి...

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామ సమీపంలో హఠాత్తుగా 1000కి పైగా నాటు కోళ్లు ప్రత్యక్షమయ్యాయి.. ఎల్కతుర్తి – సిద్దిపేట ప్రధాన రహదారి పక్కనే వందలాది నాటుకోళ్లు కనిపించాయి.. ఎవరు తీసుకొచ్చారో తెలియదు.. రోడ్డు పక్కనే ఆ కోళ్లను వదిలేసి వెళ్ళిపోయారు.. రోడ్డు పక్కన పత్తి చేలు, వరి పొలాల వెంట పరుగులు పెడుతున్న వందలాది కోళ్లను చూసి ఊరంతా షాక్ అయ్యారు .
ఆ కోళ్లు ఎవరివని ఆరా తీశారు. ఆ మార్గంలో వెళ్తున్న చాలామందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు . కానీ ఎవరు స్పందించలేదు.. పరిసర గ్రామాల్లో కూడా ఈ కోళ్లు ఎక్కడి నుండి వచ్చాయో తెలుసుకొనే ప్రయత్నం చేశారు.. కానీ ఎవరు స్పందించకపోవడంతో ఆ ఊరి ప్రజలు తమకు లక్కీ లాటరీ తగిలిందని గంతులేశారు. ఎవరి చేతికి దొరికినన్ని కోళ్లు వాళ్ళు వెంట తీసుకువెళ్లి ఊరంతా కోడికూర పండుగ చేసుకున్నారు.. కొందరు పెద్ద పెద్ద సంచులు తీసుకొచ్చి.. కోళ్లను వాటిల్లో తీసుకెళ్లారు. మరికొందరు రెండుచేతుల నిండా దొరికిన కాడికి కాళ్లు రెక్కలు విరిసి కట్టుకొని తీసుకువెళ్లారు..
ఒకరి వెంట ఒకరి ఊరంతా ఈ నాటు కోళ్ల సమాచారం తెలియడంతో అంతా పొలాల వైపు పరుగులు తీశారు. కోళ్ల వెంటపడి మరీ పట్టుకుని వాటిని ఇళ్లకు తీసుకెళ్లారు. సుమారు 1000 కోళ్లు ఊరు ప్రజలకు చిక్కడంతో ఊరంతా కోడికూర వాసనే.. ఈ ఊరి ప్రజలంతా లొట్టలేసుకుంటూ నాటుకోడి కూరతో కడుపు నిండా తిని ఎంజాయ్ చేశారు.. కానీ ఆ కోళ్లను ఎవరు వదిలి వెళ్లారు..! ఎందుకు వదిలి వెళ్లారు..! వాటికి ఏమైనా వ్యాధి సోకిందా..! ఎందుకు అలా వెయ్యికి పైగా కోళ్లను ఊరు శివారులో వదిలి వెళ్లారో మాత్రం ఇప్పటివరకు ఎవరికీ అంతు చిక్కడం లేదు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు కొన్ని కోళ్లను పశువైద్యాధికారి దీపిక వద్దకు తీసుకెళ్లారు. ఆమె వాటిని పరీక్షల నిమిత్తం వరంగల్ ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చే వరకు వాటిని తినవద్దని ఆమె సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
