Telangana: వెల్లివిరిసిన మత సామరస్యం.. గణేశ్ లడ్డూని వేలం పాటలో దక్కించుకున్న ముస్లిం మహిళ
తెలంగాణలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఇటీవల నిమజ్జనాల వేళ.. ఏకదంతుడికి ఎంతో భక్తితో సమర్పించిన లడ్డూలకు ఆయా మండపాల్లో వేలం పాటలు నిర్వహించారు. వాటిని దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. అయితే తెలంగాణలో ఓ ముస్లిం మహిళ వినాయకుడి లడ్డూ కోసం వేలం పాటలో పాల్గొన్నారు.

తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఒక గణేష్ మండపంలో వినాయక నిమజ్జనం సందర్భంగా గణేష్ లడ్డూ వేలం జరిగింది. ఈ వేలంలో పాల్గొన్న ముస్లిం మహిళ అంరీన్.. రూ. 1,88,888కి లడ్డూను దక్కించుకోడం విశేషం. తెలంగాణలో ముస్లిం మహిళలు.. గణేష్ లడ్డూ వేలంలో దక్కించుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భాట్‌పల్లి ప్రాంతంలో శ్రీ విఘ్నేశ్వర గణేష్ మండలి ఏర్పాటు చేసిన మండపంలో.. అఫ్జల్, ముస్కాన్ జంట రూ. 13,126కి లడ్డూ గెలుచుకున్నారు.
Sweet symbol of harmony ! In #Telangana’s Nirmal district, Muslim woman Amreen won the Ganesh laddu auction for Rs 1,88,888 during the immersion festival. #GaneshChaturthi2025 #GaneshNimajjanam2025 pic.twitter.com/qG5rWuvL3o
— Ashish (@KP_Aashish) September 7, 2025
కాగా ఈ ఏడాది కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లోని గణపతి లడ్డూకు వేలం పాటలో భారీ ధర పలికింది. 10 కిలోల బరువున్న లడ్డూ కోసం 80కి పైగా విల్లా యజమానులు పోటీ పడ్డారు. చివరకు 2.32 కోట్లకు అమ్ముడై, సరికొత్త రికార్డును సృష్టించింది. హైదరాబాద్ బాలాపూర్ లంబోదరుడి లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. ఉత్సాహంగా సాగిన వేలంలో స్థానికుడైన లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈసారి బాలాపూర్ లడ్డూ 5 లక్షలు ఎక్కువ ధర పలికింది.
రాయదుర్గం మైహోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో లడ్డూకి 51లక్షల ఏడువేల ధర పలికింది. అపార్ట్‌మెంట్‌లో నివసించే రియల్‌ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేష్ లడ్డూని దక్కించుకున్నారు. హైదరాబాద్ కొత్తపేటలో వినూత్నంగా జరిగిన లడ్డూ వేలంలో 99రూపాయలకే 333 కిలోల లడ్డూని దక్కించుకున్నాడో స్టూడెంట్. శ్రీ ఏకదంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 760 టోకెన్లను విక్రయించి లడ్డూ కోసం నిర్వహించిన లక్కీడ్రాలో బీబీఏ విద్యార్థి సాక్షిత్ గౌడ్ లడ్డూని సొంతం చేసుకున్నాడు.




