AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: షాదీ మీది వేదిక మాది.. ముస్లిం సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యకు చెక్

ముస్లిం సమాజంలో- కట్నాలు ఇవ్వలేక అమ్మాయిలకు నిఖా కావట్లేదు. అటు- మితిమీరిన పెళ్లి ఖర్చులతో అబ్బాయిలు అప్పుల పాలవుతున్నారు. ముస్లిం సమాజాన్ని ఈ రెండు సమస్యలు సతమతం చేస్తున్నాయి. ఈ డబుల్‌ ట్రబుల్‌కి... షరియత్‌ ప్రకారం పరిష్కారం చూపిస్తామంటోంది ముస్లిం పర్సనల్‌ లా బోర్డు. ఇంతకీ ఏంటా పరిష్కారం.

Hyderabad: షాదీ మీది వేదిక మాది.. ముస్లిం సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యకు చెక్
Muslim Wedding (Representative image)
Noor Mohammed Shaik
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 14, 2024 | 5:03 PM

Share

అమ్మాయికి నిఖా కావాలంటే భారీగా కట్నకానుకలు సమర్పించుకోవాలి. పిల్లను అత్తారింటికి పంపించాలంటే చేతి చమురు.. ఓ రేంజ్‌లో వదిలించుకోవాలి. అంతిచ్చుకోలేక, అత్తారింటికి పంపే దారి లేక..ముస్లిం అమ్మాయిల్లో చాలామందికి పెళ్లి కాక ఏజ్‌ బార్‌ అయిపోతోంది. మరోవైపు అబ్బాయిలను మరో రకమైన సమస్య వెంటాడుతోంది. ఒకవేళ ఎలాగోలా పెళ్లి సెట్‌ అయినా….నిఖా మాత్రం హంగుఆర్భాటాలతో చేయాల్సిందే. కుర్రాడు పూర్‌ అయినా, లోయర్‌ మిడిల్‌ క్లాస్‌ అయినా…నిఖా మాత్రం ఓ రేంజ్‌లో రిచీరిచ్‌గా చెయ్యాల్సిందే…వలీమా దావత్‌లో కనీవినీ ఎరుగని, ఎవరు తినీవినీ ఎరుగని ఐటెమ్స్‌ పెట్టాలి. లేకపోతే ఫ్రెండ్స్‌ ముందు పరువు పోతుందనే భయం. దీంతో జేబులో డబ్బు లేకపోయినా…అప్పులు తెచ్చి మరీ గ్రాండ్‌గా వలీమా చేసుకోవాలి. ఈ దెబ్బకు పెళ్లికొడుకు అప్పుల పాలవుతాడు. పెళ్లయిన సంతోషాన్ని మించి…అప్పుల భయం చుట్టుముడుతుంది. పీక్కు తినే అప్పులోళ్ల బారి నుంచి తప్పించుకోలేక కొత్త పెళ్లికొడుకు, పెళ్లికూతురు అల్లాడిపోతున్నారు.

రంగంలోకి ముస్లిం పర్సనల్ లా బోర్డ్‌

ఈ సమస్యకు పరిష్కారం చూపించేందుకు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్‌ రంగంలోకి దిగింది. కట్నకానుకల భారం తగ్గించి, అమ్మాయిలకు తొందరగా పెళ్లి కుదిరేట్లు చెయ్యడంతో పాటు… పెళ్లి పేరుతో అబ్బాయిలు అప్పుల పాలు కాకుండా…షరియత్‌ సంప్రదాయం ప్రకారం నిఖా, వలీమా చేసుకోవాలంటూ.. ఏకంగా పెళ్లి చూపుల వేదికనే ఏర్పాటుచేసింది. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఈ ఆమ్నా-సామ్నా వేదికకు, పది వేల కుటుంబాలు హాజరయ్యాయి. ఈ వేదిక పుణ్యమా అని… వేల జంటలు త్వరలో ఒకటి కానున్నాయి. అది కూడా కట్నకానుకల బాధ లేకుండా.

రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు..దేశవ్యాప్తంగా షరియత్‌ ప్రకారం, పెళ్లిచూపుల వేదికలు ఏర్పాటుచేస్తామని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు తెలిపారు.  ఈ కార్యక్రమాన్ని హైదరాబాదీ ముస్లింలు స్వాగతిస్తున్నారు. మొత్తానికి ముస్లిం సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యకు, ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఓ పరిష్కారం చూపించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..