AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మునుగోడులో నువ్వా..నేనా.. ఎవరి ఎత్తులు వారివే.. అన్ని పార్టీలకు అసమ్మతి సెగ..

తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఇప్పుడు హట్ టాపిక్ అయింది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసనసభ్యాత్వానికి రాజీనామా చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల దృష్టి మునుగోడుపై పడింది. ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండటంతో

Telangana: మునుగోడులో నువ్వా..నేనా.. ఎవరి ఎత్తులు వారివే.. అన్ని పార్టీలకు అసమ్మతి సెగ..
Munugode Bypoll
Amarnadh Daneti
|

Updated on: Aug 13, 2022 | 9:44 AM

Share

Telangana: తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఇప్పుడు హట్ టాపిక్ అయింది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసనసభ్యాత్వానికి రాజీనామా చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల దృష్టి మునుగోడుపై పడింది. ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండటంతో అన్ని ప్రధాన పార్టీలు యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగుతున్నాయి. తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నప్పటికి.. ఇక్కడ పోటీ టీఆర్ ఎస్, బీజేపీ మధ్యనే ఉందన్న ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఈజిల్లాలో ఉన్న పట్టుతో పాటు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే అసమ్మతి నేతగా ఉంటూ.. సొంత పార్టీ అభ్యర్థికి సహకరించే అవకాశం లేకపోవడం హస్తం పార్టీకి ఇక్కడ మైనస్ అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అనేది బహిరంగ రహస్యం కావడంతో.. ఇక ప్రధాన పార్టీలైన టీఆర్ ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థుల ఖరారుపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈరెండు పార్టీలు ముఖ్యమైన నాయకులతో సమావేశం నిర్వహించి అసమ్మతి నాయకులను బుజ్జగించే పనిలో పడ్డాయి.

టీఆర్ ఎస్ నుంచి కాసు కుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఒక్కసారిగా టీఆర్ ఎస్ లో అసమ్మతి సెగ భగ్గుమంది. కాసుకుంట్లకు టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదంటూ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో మునుగోడులో టిఆర్ ఎస్ పార్టీకి సంబంధించిన బాధ్యతలను ప్రస్తుతం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చూసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ డైరెక్ట్ గా జగదీశ్వర్ రెడ్డితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. మునుగోడులో కారు పార్టీని గెలిపించేందుకు దిశానిర్ధేశం చేస్తున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామే అంటున్న బీజేపీ ఈఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈఎన్నికల్లో గెలిచి.. టీఆర్ ఎస్ కు తామే ప్రత్యామ్నయం.. ప్రజలు మా వైపే ఉన్నారన్న పాజిటివ్ సంకేతాలను ఇవ్వాలనే ప్లాన్ తో ఉప ఎన్నికకు రెడీ అవుతోంది. ఎన్నికల సంఘం అధికారికంగా ఉప ఎన్నికల తేదీలను ప్రకటించకపోయినా ప్రధాన పార్టీలు మాత్రం ఇప్పటినుంచే పొలిటికల్ ప్రచారాన్ని ప్రారంభించాయి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే చుండూరులో కాంగ్రెస్ సభ నిర్వహించి.. పోటీలో తామే ముందున్నామనే సంకేతాలిచ్చే ప్రయత్నం చేసింది. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఈరోజు కూడా పాదయాత్ర చేస్తున్నారు. అలాగే గతంలో తమకు బలం ఉన్నందున ఉప ఎన్నిక వస్తే పోటీ చేయాలనే ఆలోచనలో వామపక్ష పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు కావడంతో ఇప్పటినుంచే నియోజవర్గంలో పర్యటిస్తూ ప్రతి ఇంటిని చుట్టేసే పనిలో నిమగ్నమయ్యారు రాజగోపాలరెడ్డి. ఈనెల 21వ తేదీన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర హోమంత్రి అమిత్ షాతో భారీ బహిరంగ సభ పుట్టాలని బీజేపీ ప్లాన్ చేయడంతో దీనికి కౌంటర్ ర్యాలీకి టీఆర్ ఎస్ సిద్ధమైంది.

ఇవి కూడా చదవండి

అమిత్ షా సభ కంటే ముందే.. ఈనెల 20 లేదా 19వ తేదీన కేసీఆర్ తో మునుగోడు నియోజకవర్గంలో భారీ సభ నిర్వహించాలని కారు పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈసభ వేదికగా మునుగోడు నియోజకవర్గానికి మరిన్ని వరాలను ప్రకటించే అవకాశం లేకపోలేదు. సభ ఎక్కడ జరపాలన్న దానిపై శని, ఆదివారాల్లో ఓ క్లారిటీ రానుంది. మరోవైపు నియోజకవర్గంలో ప్రజలను ఆకర్షించేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడంతో నిధులివ్వడంలో తన నియోజకవర్గంపై వివక్ష చూపించారని.. మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశానంటూ సెంటిమెంట్ ను వాడేస్తున్నారు. తన రాజీనామాతో ఇప్పటికే పది లక్షల మందికి ఫించన్లు ఇస్తామని ప్రకటించారని.. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు తన రాజీనామా దోహదం చేస్తుందంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ప్రతి రోజు నియోజకవర్గంలోని మండలాల వారీగా పర్యటిస్తూ ప్రజలను కలుసుకుంటున్నారు. ఇలా మునుగోడులో విజయం కోసం ప్రధాన పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారున్నారు. అయితే నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎటున్నారనేది మాత్రం ఉప ఎన్నిక జరిగితే వచ్చే ఫలితం పైనే ఆధారపడనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..