AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MUNUGODU BY-ELECTION: తుది అంకంలో ప్రధాన పార్టీలకు కొత్త పరేషాన్.. ఆ పది శాతం ఓటర్ల నిర్ణయమే కీలకమంటున్న విశ్లేషకులు

మునుగోడులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమైన ప్రధాన పార్టీలకు కొత్త పరేషాన్ పట్టుకుంది. దాదాపు నెల రోజులుగా మునుగోడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. కానీ ఓ పది శాతం ఓటర్లే ఇపుడు అభ్యర్థులను టెన్షన్ పెడుతున్నారు.

MUNUGODU BY-ELECTION: తుది అంకంలో ప్రధాన పార్టీలకు కొత్త పరేషాన్.. ఆ పది శాతం ఓటర్ల నిర్ణయమే కీలకమంటున్న విశ్లేషకులు
Munugode bypoll
Rajesh Sharma
|

Updated on: Oct 31, 2022 | 3:05 PM

Share

మునుగోడు ఉప ఎన్నికల పర్వం తుది ఘట్టానికి చేరుకుంటోంది. నవంబర్ 1న సాయంత్రం ప్రచార పర్వానికి తెరపడనున్నది. గత కొంత కాలంగా కొనసాగుతున్న ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమం చివరి రెండు రోజులు మరింత జోరుగా సాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. డబ్బు తరలింపును అడ్డుకునేందుకు అధికార వర్గాలు యధాశక్తి యత్నిస్తున్నా.. డబ్బు సంచులు ఏదో ఓ మార్గంలో నియోజకవర్గానికి చేరుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు పలు చోట్ల కోట్లాది రూపాయలు వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డాయి. అయితే, ఈ మొత్తాలు ఎవరివి అన్నది మాత్రం ఇదమిత్తంగా తేలలేదు. ఈలోగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేయడం చర్చనీయాంశమైంది. 5.24 కోట్ల రూపాయలను మునుగోడు నియోజకవర్గంలోని 23 వ్యక్తుల అకౌంట్లకు రాజగోపాల్ రెడ్డి తనయుడు సంకీర్త్ రెడ్డికి చెందిన సుశి ఇన్‌ఫ్రా సంస్థ నుంచి బదలాయింపు చేశారన్నది ఆరోపణ. అక్టోబర్ 30న నోటీసు జారీ చేసిన ఈసీ 48 గంటల్లో నగదు బదలాయింపుపై వివరణ ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డిని ఆదేశించింది. ఆ సంస్థ తన కొడుకు సంకీర్త్ రెడ్డి సారథ్యంలో పని చేస్తోందని, దాని నగదు లావాదేవీలకు సంబంధించి తనకేమీ సంబంధమని రాజగోపాల్ వాదిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. మంత్రి జగదీశ్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా సీఈసీ ఆదేశాలివ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది. బీజేపీ ఫిర్యాదు మేరకు ఈసీ ఈమేరకు ఆదేశాలిచ్చింది. అయితే, 48 గంటలు ముగిసిన తర్వాత అంటే ప్రచారం చివరి రోజైన నవంబర్ 1న ఆయన ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయి. ఇక ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్టోబర్ 30న మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలకేంద్రంలో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొని బీజేపీ మీద, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీద నిప్పులు చెరిగారు. బీజేపీ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారానికి వస్తారని అనుకున్నా కారణాలేవైతేనేం ఆయన పర్యటన రద్దైంది. దాంతో మునుగోడు ప్రచార సారథులుగా కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి, టీ.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌లకే కమలం పార్టీ పరిమితమైనట్లయ్యింది.

ఇదిలా వుంటే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సమీకరణాలు, వలసలు, బేరసారాలు, నజరానాలు, ప్యాకేజీలు, కులాల వారీగా హామీలు.. ఇలా తోచిన ప్రతీ మార్గాన్ని ఆశ్రయిస్తున్నాయి మూడు ప్రధాన పార్టీలు. ఎవరికి వారు తమ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే ప్రత్యర్థి ఓటుబ్యాంకును తమవైపు మళ్ళించుకునేందుకు యత్నిస్తున్నాయి. ఈక్రమంలోనే ఓటర్లకు అనేక తాయిలాలిస్తున్నాయి. ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. చోటామోటా నాయకులకు లాక్కునేందుకు యధాశక్తి డబ్బులిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికలపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వ్యంగ్య, విమర్శనాత్మక వీడియో క్లిప్పింగులు హోరెత్తుతున్నాయి. ఇంతా చేస్తున్నా.. పార్టీల్లో చేరుతున్న నాయకులను పూర్తి నమ్మేందుకు ప్రధాన పార్టీలు జంకుతున్నాయి. అదేసమయంలో గుంభనంగా వుంటున్న ఓటర్ల మనోగతం అర్థం కాక.. బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాయి. నియోజకవర్గం ప్రజలు ఈ ఉప ఎన్నికతో తమ పంట పండిందని సంతోషపడుతున్నాయి. అన్ని పార్టీలు ఇస్తున్న హామీలతోను, ఇతరత్రా ప్రలోభ కార్యక్రమాలతోను మునుగోడు ఓటర్లు హ్యాపీగానే వున్నారు. కానీ ఎవరికి ఓటేస్తారు అని ప్రశ్నిస్తే మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. పార్టీలకు పని చేస్తున్న పోల్ మేనేజ్‌మెంటు సంస్థలతోపాటు వివిధ మీడియా సంస్థలు మునుగోడు ఓటరు నాడి తెలుసుకునేందుకు యత్నిస్తున్నాయి. కులాలు, సంఘాలు, సామాజిక అంశాల ఆధారంగా మునుగోడు ఓటరు నాడి అందిపుచ్చుకునేందుకు వీరు యత్నిస్తున్నారు. ఈక్రమంలో సుమారు 10 శాతం ఎవరెలా ప్రశ్నించినా తమ మనోగతాన్ని వెల్లడించడం లేదని తెలుస్తోంది. గుంభనంగా వ్యవహరిస్తున్న ఈ పది శాతం మంది ఓటర్లే ఉప ఎన్నికలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నారన్నది సుస్పష్టం. నిజానికి సాధారణ ఎన్నికల్లో ఇలా గుంభనంగాను, తటస్థటంగాను వుండే వారి శాతం 2-3కు మించదు. కానీ మునుగోడు ఉప ఎన్నిక ఓ ప్రత్యేక సందర్భంలో రావడం.. ఇక్కడ విజయం సాధించడాన్ని మూడు ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల గుంభనంగాను, నర్మగర్భంగాను వ్యవహరించే ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు 10 శాతం మంది ఎవరి సర్వేలోను పెదవి విప్పకపోవడంతో వారి వ్యవహార శైలి ప్రధాన పార్టీలను హడలెత్తిస్తోంది.

మునుగోడులో మొత్తం 2 లక్షల 41 వేల 763 మంది ఓటర్లున్నాయి. కాస్త అటుఇటూగా మహిళా, పురుష ఓటర్లు సమానంగానే వున్నారు. 2014, 2018 ఎన్నికలతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఈసారి ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. అందుకు కారణం ఓటరును ఎలాగైనా పోలింగ్ బూత్‌కు రప్పించేందుకు పార్టీలు పలు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నాయి. దాదాపు 30 వేల మంది మునుగోడు ఓటర్లు హైదరాబాద్ సిటీలోను, దాని చుట్టుపక్కలా వున్నట్లు తెలుస్తుండగా.. వారిని పోలింగ్ రోజు వారికి కేటాయించిన బూత్‌లకు రప్పించేందుకు పార్టీలు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నాయి. దానికితోడు గత నెల రోజులుగా పలు సందర్భాలలో పలు రకాలుగా ప్రయోజనాలందించిన పార్టీలు చేయించుకున్న ప్రమాణాలు కూడా ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎంతో కొంత కారణమవుతాయి. ఈక్రమంలో 80 శాతానికిపైగా ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కాస్త అటు ఇటుగా సుమారు 1 లక్షా 90లకుపై చిలుకు ఓట్లు పోలయ్యే అవకాశం వుంది. ఈక్రమంలో ఎటూ తేల్చని తటస్థ ఓటర్లు గనక అంచనాలకు అనుగుణంగా 10 శాతం వుంటే.. అది కచ్చితంగా మునుగోడు ఫలితాన్ని తేల్చే అంకెనే అవుతుంది. ఈమేరకు అంచనాలు వేసుకుంటున్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు తమతమ వ్యూహాలను చివరి రోజుల్లో మార్చుకునే అవకాశాలున్నాయి. మూడు పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్న ఉపఎన్నికల్లో ఎవరు గెలిచిన వారి మెజారిటీ పదివేలకు లోపే అన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో కూడా ఈ పది శాతం తటస్థ ఓటర్ల నిర్ణయం కీలకంగా కనిపిస్తోంది. తటస్థుల ఓట్లు ఎవరి పుట్టి ముంచుతాయోనని మూడు పార్టీల నాయకులు మధనపడుతున్నారు. ఏ పార్టీ వారు సభలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం నిర్వహించినా ప్రజలు హాజరవుతున్నారు. పొద్దున ఓ పార్టీ ప్రోగ్రామ్‌లో కనిపించిన వ్యక్తులు.. మధ్యాహ్నం లేదా సాయంత్రం మరో పార్టీ కార్యక్రమంలో ప్రత్యక్షమవుతున్నారు. ఇలాంటి వారు చివరి నిమిషంలో ఎవరికి ఓటు వేస్తారన్నది తేల్చుకోలేక అభ్యర్థులకు కంటి మీద కునుకు కరవైంది. దీంతో గుంభనంగా వ్యవహరిస్తున్న తటస్థులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రత్యేక కార్యచరణను అమలు చేస్తున్నట్లు తాజాగా తెలుస్తోంది. ప్రత్యేక పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు మునుగోడు ఓటరు కూడా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. వారి అంఛనాలను అందుకునేందుకు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. తటస్థులను ప్రసన్నం చేసుకోవడం, దూర ప్రాంతాల్లో వున్న వారికి సకల సౌకర్యాలు అందించి వారిని రప్పించి ఓట్లు వేయించుకోవడం అనే ద్విముఖ వ్యూహానికి పార్టీలు తెరలేపాయి. దీనికి తోడు నియోజకవర్గంలో సుమారు లక్షా 25 వేల మంది 40 ఏళ్ళకు లోబడిన ఓటర్లున్నారు. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు పలు అంశాలను బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళుతున్నారు.  వీరి ప్రయత్నాలు ఎవరికి అనుకూలంగా, ఎవరికి ప్రతికూలంగా మారతాయో నవంబర్ 6వ తేదీనగానీ తేలే అవకాశం లేదు.