Telangana: తల్లిని కోల్పోయిన గొర్రె పిల్లకు అమ్మగా మారి పాలిస్తున్న గోమాత..
తల్లిని కోల్పోయిన గొర్రెపిల్లకు తన లేగదూడతో కలిసి పాలిస్తున్న గోవు అందరిని ఆశ్చర్య పరుస్తుంది.. ఆ గొర్రెపిల్లకు తల్లి ప్రేమను పంచిన ఆవును చూసి ఊరంతా వింతగా భావిస్తున్నారు.. ఈ విచిత్ర సంఘటన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో జరిగింది.

ఆపదలో ఉన్నవారికి మానవత్వంతో ఒకరికొకరు సహాయం చేసుకోవడం, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడటం మానవ సహజం. అది ప్రస్తుతకాలంలో కరువైపోతుందనేందుకు ఉదాహరణగా అనేక ఘటనలు నెట్టింట మనం చూశాం. కొందరు కన్నబిడ్డలు వృద్ధులైన తల్లిదండ్రులను అనాధలుగా వదిలేస్తున్నారు. మరికొందరు కన్నబిడ్డలను కళ్లు తెరవకముందే కడతేర్చుతున్నారు. మనుషులంతా ఇలా మానవత్వం మరిచి ప్రవర్తిస్తుంటే.. పశుపక్ష్యాదులు అంతకుమించిన గుణంతో వ్యవహరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి.
తల్లిని కోల్పోయి అనాధగా మారి, ఆకలితో అలమటిస్తున్న గొర్రపిల్లకు తనబిడ్డతో సమానంగా పాలిచ్చి సాకుతోంది ఓ గోమాత. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో జరిగింది. స్థానికంగా ఉండే సమ్మయ్య అనే రైతు ఇంట్లో ఓ గొర్రె రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఏ కారణం చేతనో ఆ గొర్రె చనిపోయింది. గొర్రెపిల్లలు తల్లిపాలకు దూరమై ఆకలితో అలమటిస్తుంటే.. రైతు పెంచుకుంటున్న ఆవు ఆ గొర్రెపిల్లకు అమ్మగా మారింది. గొర్రెపిల్లకు ఆకలి వేయడంతో గోవు పొదుగు కనిపించగానే అమాయకంగా పరుగెత్తుకెళ్లి పాలు తాగడం ప్రారంభించింది. దాని ఆకలిని గుర్తించిన ఆవు గొర్రెపిల్లను ఏమీ అనకుండా కడుపారా పాలిచ్చింది. ఈ ఘటన చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. విషయం చుట్టుపక్కలవారందిరికీ తెలియడంతో రైతు ఇంటికి క్యూ కట్టారు. ఆవు గొర్రెపిల్లకు పాలివ్వడం చూసి.. ఇది కదా అమ్మతత్వం అంటే…ఇది మానవత్వం కాదు.. గోవు తత్వం అంటూ చర్చించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
