Malla Reddy: ‘ఔ..భయ్ రేపోమాపో సీఎం రేవంత్‌ను కలుస్తా’.. మల్లన్న మాటల వెనుక అర్థం ఏంటి..?
మినిష్టర్ మల్లన్నగా మొన్నటిదాకా రేవంత్ రెడ్డిపై పొట్టుపొట్టు తిట్లు. మరిప్పుడు మల్లన్న మనసులోనూ మార్పు వచ్చిందా?. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తానన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు కూడా. భేటీ తప్పు కాదు. కానీ ములాఖత్ వెనుక మరేదైనా మతలబు ఉందా? నియోజవర్గ అభివృద్ధి కోసమేనా! తుమ్మకుండానే మరో తుఫాన్‌ను తెరపైకి తెచ్చారు మల్లన్న.
తెలంగాణ రాజకీయాల్లో మల్లన్న రూటే సపరేటు. .మాటైన ..పాటైనా ఆటైనా ఏదైనా సరే ఆయనతో కథ అట్లుంటది. హైకమాండ్ పట్ల వినయ విధేయ రాముడు. అసెంబ్లీలో ఎన్నికల్లో తను గెలవడమే కాకుండా పట్టుబట్టి మరి అల్లుడు రాజశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇక వాట్ నెక్ట్స్. ఈసారి మల్లన్న లోక్‌సభపై గురి పెట్టన పెట్టారు. తన కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా అభ్యర్థిగా బరిలోకి దింపాలని సోచాయించుడే కాదు అల్రెడీ తన మన్ కీ బాత్‌ను హైకమాండ్ చెవిలో వేశారట కూడా. ఆ ముచ్చటతో పాటు ఇటీవల కాంగ్రెస్ సర్కార్‌పై తన మార్క్ పంచ్‌లేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి.
గతంలో రేవంత్‌కు, ఆయనకు మధ్య మాటలయుద్ధం మాములుగా ఉండేది కాదు. మరిప్పుడు మల్లన్నలో మార్పు వచ్చిందా? తిట్టు తీసి గట్టున పెట్టారో ఏమో కానీ త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డితో ములాఖాత్ అవుతానన్నారు. అల్రెడీ ఇప్పటికే కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి కలవరం గులాబీదళంలో చర్చగా మారింది. వినయ విధేయుడిగా మైక్ దొరికినప్పుడుల్లా హైకమాండ్ పల్ల విశ్వసాన్ని చాటుకునే మల్లన్న కూడా ఆ ఎమ్మెల్యేల బాటలో ఆరో కృష్ణుడిగా సీఎం రేవంత్ రెడ్డి కలుస్తాననడం సంచలనంగా మారింది. ఔ..భయ్ రేపోమాపో సీఎం రేవంత్‌ను కలుస్తా. అండ్ల తప్పేమున్నది. పైగా టీడీపీలో ఇద్దరం దోస్తులమని ముక్తాయింపునిచ్చారాయన. ఎమ్మెల్యే కేసీఆర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి మల్లారెడ్డి.
మల్కాజ్‌గిరి తనను పోటీ చేయామని హైకమాండ్ అడిగిందని..కానీ ఎంపీగా పోటీ చేయడం తనకిష్టంలేదన్నారు మల్లారెడ్డి. తన కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని తాను కోరారని క్లారిటీ ఇచ్చారు. ఇంత వరకు ఓకే. తిట్లు గట్టునపెట్టి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాననడం వెనుక లోగుట్టు ఏంటి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. మామ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి.. బీఆర్ఎస్ అధినేత ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు… ఇద్దరూ గెలిచారు కూడా. ఇక భద్రారెడ్డి సన్నాఫ్ మల్లారెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చే చాన్స్ వుందా? బీఆర్‌ఎస్ నై అంటే సై అనాలనేది మల్లన్న వ్యూహమా. సీఎం రేవంత్‌ను త్వరలో కలుస్తానని చెప్పడం అందుకు టీజరా? మల్లన్న అల్రెడీ బ్లాక్‌బ్లస్టర్ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారా? అనే ఊహాగానాలు, ప్రచారాలు జోరందుకున్నాయి. తిట్లు గట్టున పెట్టి దోస్త్ మేరా దోస్త్ అనే రేంజ్‌లో సీఎం రేవంత్‌ను కలుస్తానన్నారంటే దాల్ మే కుచ్ కాలా హై..మల్లన్న మదిలో ఏదో గట్టి రహస్యమే ఉందనే చర్చ జరుగుతోంది. లోగుట్టు మల్లన్నకే ఎరుక!