AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Paper Leak: రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు..

TSPSC Paper Leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో...

TSPSC Paper Leak: రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు..
Minister KTR
Shiva Prajapati
|

Updated on: Mar 23, 2023 | 7:45 PM

Share

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర చేస్తున్నారని, ఈ కారణంగానే ఆ ఇద్దరికి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు స్వయంప్రతిపత్తి ఉంటుందన్న కనీస అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ ఏర్పాటయిందని గుర్తు చేశారు మంత్రి. అయితే ఈ వాస్తవాలు అన్నిటినీ పక్కనపెట్టి, ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న అంశంగా చిత్రీకరించే దుర్మార్గపూరిత కుట్రలకు బండి సంజయ్, రేవంత్ లు తెరలేపారని ధ్వజమెత్తారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వాల పరిపాలన వ్యవహారాల పట్ల కనీస ఇంగిత జ్ఞానం లేకుండా తెలివితక్కువతనంతో అవాకులు చెవాకులు పేలుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్లు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ వ్యవహారంలో కుట్రపూరితంగా, రాజకీయ దురుద్దేశంతోనే పదేపదే తన పేరును లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బట్ట కాల్చి మీదేసే చిల్లర ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లో సహించనని హెచ్చరించారు మంత్రి కేటీఆర్.

ఇప్పటికే రేవంత్, సంజయ్ తమ తెలివి తక్కువ ప్రకటనలు, మతిలేని మాటలతో ప్రజల్లో చులకన అయ్యారని కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో కోవిడ్ సందర్భంగా పదివేల కోట్ల వ్యాక్సీన్ కుంభకోణం జరిగిందని, వేల కోట్ల విలువచేసే నిజాం నగల కోసమే పాత సచివాలయం కూల్చివేస్తున్నారనే తిక్క వ్యాఖ్యలు చేసి రేవంత్ రెడ్డి నవ్వులపాలయ్యారని అన్నారు. తెలివి తక్కువతనంలో రేవంత్‌తో పోటీపడి శవాలు-శివాలు, బండి పోతే బండి ఫ్రీ అంటూ బండి సంజయ్ చేసిన అర్థరహిత వ్యాఖ్యలు కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వీరి వ్యాఖ్యలు, వ్యవహారశైలిని గమనించిన తరువాత, వీరిద్దరు మానసిక సంతులనం కోల్పోయారని ప్రజలు భావిస్తున్నారన్నారు. వీరిద్దరి నాయకత్వంలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు.

ఇవి కూడా చదవండి

భారీ కుట్రకు తెరలేపారు..

టీఎస్‌పీఎస్సీ అంశంలో కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ర్పచారాల వెనుక మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రక్రియనే నిలిపివేయాలనే ఒక భయంకరమైన కుతంత్రం దాగి ఉందని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఇదే నాయకులు ప్రభుత్వం ఉద్యోగ నోటీఫికేషన్లు ఇవ్వడమే ఒక కుట్రగా అభివర్ణించారని, చదువులు పక్కన పెట్టి తమ రాజకీయాల కోసం యువత కలిసి రావాలని గతంలో చేసిన వ్యాఖ్యలు, వాళ్ల కుటిల మనస్థత్వానికి అద్దం పడుతున్నాయన్నారు. సంబంధం లేని మరణాలను కూడా ఈ వ్యవహారంతో అంటగట్టి.. యువత ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా చేసిన వికృత ప్రయత్నాలు విఫలమైనా కూడా వీరికి బుద్ధిరాలేదన్నారు. ఇప్పటికైనా శవాలపైనే చిల్లర ఏరుకునే రాజకీయ రాబందుల మాదిరిగా కాంగ్రెస్, బీజేపీ మారాయని మండిపడ్డారు.

తలా తోక లేకుండా మాట్లాడుతున్న ఈ రెండు పార్టీల నేతల పిచ్చిమాటల ఉచ్చులో పడకుండా యువత తమ పోటీ పరీక్షల సన్నద్ధతపైనే దృష్టి సారించాలని యువతకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టీఎస్పీఎస్సీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలను ప్రారంభించిందని, భవిష్యత్తులో నిర్వహించబోయే పరీక్షలను మరింత కట్టుదిట్టంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు సన్నద్ధమవుతుందని కేటీఆర్ తెలిపారు. కేవలం రాజకీయాల కోసం జరుగుతున్న దుర్మార్గపూరిత కుట్రలను, ప్రచారాన్ని నమ్మువద్దని విజ్ఞప్తిచేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..