Telangana Cabinet Sub-Committee: రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీల కీలక భేటీ.. రెవెన్యూ మోబిలైజేషన్, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రధాన చర్చ!
తెలంగాణ తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్‌లో వివిధ అంశాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలక భేటీలు నిర్వహించింది.
Telangana Cabinet Sub-Committee Meeting: తెలంగాణ తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్‌లో వివిధ అంశాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలక భేటీలు నిర్వహించింది. మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన ఈ సమావేశంలో భూములు, ఇళ్ల విక్రయాలపై చర్చించారు. సమావేశంలో రెవెన్యూ మోబిలైజేషన్ పై అధికారులు వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. సబ్ కమిటీ వారి ప్రతిపాదనలపై చర్చించి, వివిధ స్టేక్ హోల్డర్స్ తో సంప్రదింపులు జరిపిన తరువాత ప్రాథమిక నివేదికను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకి సమర్పించాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో ఆదాయం పెంచుకునే మార్గంపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం తొలిసారి సమావేశమైంది. రాష్ట్ర ఆర్థిక శాఖామాత్యులు హరీష్‌రావు అధ్యక్షతన రెవెన్యూ మోబిలైజేషన్ పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. సబ్ కమిటీ సభ్యులైన మున్సిపల్ శాఖామాత్యులు కేటీ రామారావు, ఎక్సైజ్ శాఖామాత్యులు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్ధిక శాఖ సలహాదారు డా. జీ.ఆర్ రెడ్డి హాజరయ్యారు.
ఇక, అనంతరం రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును విశ్లేషించి మెరుగుపరచేందుకు ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం ఆర్ధిక శాఖామాత్యులు హరీశ్ రావు అధ్యక్షతన ప్రాథమిక సమావేశం జరిగింది. ప్రభుత్వ వైద్య రంగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సదుపాయాలు , అందిస్తున్న వైద్య సేవలు గురించి కమిటీ కూలంకషంగా చర్చించింది. పేద ప్రజలకు ప్రభుత్వ సాధారణ వైద్య సేవలతో పాటు ప్రత్యేక వైద్య చికిత్సలను మరింత చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి అధికారులతో కమిటీ చర్చించింది.
ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు పశుసంవర్థక శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , విద్యుత్ శాఖామాత్యులు జగదీశ్ రెడ్డి, ఎక్సైజ్ శాఖామాత్యులు శ్రీనివాస్ గౌడ్, రోడ్లు భవనాలు శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, విద్యా శాఖామాత్యులు సబితా ఇంద్రారెడ్డి, గిరిజన సంక్షేమ శాఖామాత్యులు సత్యవతి రాథోడ్ లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Also… Telangana Corona: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఆ జిల్లాల్లోనే అత్యధిక కేసులు