Harish Rao: అదే కేసీఆర్ ఘనత.. ఆ బీజేపీ రాష్ట్రంలో రైతుబంధు, బీమా ఎందుకులేవు.. మంత్రి హరీశ్ రావు

Harish Rao comments on MP CM: రైతుకు ఓ నాడు అప్పు పుట్టేది కాదు.. పెట్టుబడి కోసం తిరిగే పరిస్థితి కనిపించేదని.. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ బాధ లేదంటూ

Harish Rao: అదే కేసీఆర్ ఘనత.. ఆ బీజేపీ రాష్ట్రంలో రైతుబంధు, బీమా ఎందుకులేవు.. మంత్రి హరీశ్ రావు
Harish Rao
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 10, 2022 | 6:34 PM

Harish Rao comments on MP CM: రైతుకు ఓ నాడు అప్పు పుట్టేది కాదు.. పెట్టుబడి కోసం తిరిగే పరిస్థితి కనిపించేదని.. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ బాధ లేదంటూ మంత్రి హరిశ్ రావు పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు 50 వేల కోట్లు సాయం చేశారంటూ తెలిపారు. దేశంలో ఇలా సాయం చేసిన తొలి సీఎం కేసీఆర్ మాత్రమేనంటూ హరీశ్ రావు తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు రైతులపై పన్నులు వేశాయి. కానీ రైతుకే పన్ను కట్టింది మాత్రం సీఎం కేసీఆర్ అని అన్నారు. భూమి శిస్తు, నీటి తీరువా, కరెంటు బిల్లు, బ్యాంకు రుణాలకు వడ్డీలు వసూలు చేసే ప్రభుత్వాలు ఉండేవని.. కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆ బాధలన్నీ పోయాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డిజీల్ ధరలు పెంచి వ్యవసాయం భారం చేసిందన్నారు. వ్యవసాయ ఖర్చులు పెంచి రైతులపై భారం వేసిందన్నారు. కానీ రైతుల ఖర్చులకు డబ్బులు ఇచ్చి భారం తగ్గించింది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రైతు బంధు వారోత్సవాల్లో హరీశ్ రావు మాట్లాడారు.

రైతులు ఆదుకోమని వస్తే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. ఆ రాష్ట్రంలోని రైతులను పిట్టల్లా కాల్చి చంపారని.. ఆయన రైతు హంతకుడిగా పేరు పొందుతే.. కేసీఆర్ రైతు బాంధువుడిగా నిలిచారన్నారు. అదే కేసీఆర్ ఘనత అని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతు బంధు ఉందా.. అంటూ ప్రశ్నించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల మీద దేశంలో అతి ఎక్కువ ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

వ్యవసాయ అనుబంధ రంగాలపై ఏడేళ్లలో రెండు లక్షల 50 వేల కోట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి ట్యాప్ ల ద్వారా నీళ్లు ఇచ్చారా, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారా అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ప్రశ్నించారు. పండిన పంట కొనమంటే చేతులు ఎత్తేసిన చరిత్ర బీజేపీది అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

చాలా ప్రధానమంత్రులు ఉన్నారు. నెహ్రూ, ఇందిర, వాజ్ పేయి ఉన్నా రైతుల నుంచి పంటలు కొన్నారు. కాని బీజేపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందన్నారు. రాష్ట్ర పరిధిలో మేం చేయాల్సిందంతా చేశాం. కాని మీ పరిధిలో ఉన్న పంట కొనుగోలు పై మీరు మాత్రం చేతులెత్తేశారని విమర్శించారు. బీజేపీకి చెందిన రోజుకో ముఖ్యమంత్రి ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారు. దమ్ముంటే మా రాష్ట్రంతో అభివృద్ధితో పోటీ పడండి, రైతు సంక్షేమంలో పోటి పడండి అంటూ హరీశ్ రావు సూచించారు.

రైతులకు రైతుబంధు సాయం చేయండి, ఉచిత విద్యుత్ ఇవ్వండి. మీరు మా రాష్ట్రానికి అసలు ఎం చేశారంటూ నిలదీశారు. తెలంగాణ నుంచి ఏడు మండలాలు లాక్కున్నారు, గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదంటూ మండిపడ్డారు. 317 జీవో రద్దు చేయమంటున్నారు. దేని కోసం చేయాలని హరీశ్ రావు ప్రశ్నించారు.

కేంద్రంలో 15 లక్షల 69 వేల ఖాళీలు ఉన్నాయి. వాటిని నింపడం లేదు. నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైల్వేలో 3 లక్షలు, డిఫెన్స్ లో 2 లక్షలు, కేంద్రంలో 9 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయరు కానీ.. 317 జీవోను అమలు చేసి ప్రతీ జిల్లాలో ఉద్యోగాలను నింపాలని సీఎం ఆలోచిస్తుంటే అడ్డుపడుతున్నారన్నారు. కోర్టుల్లో స్టే తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జీవో అమలు కావద్దు. ఉద్యోగాలు నింపవద్దు అంటున్నారని విమర్శించారు.

తెలంగాణ, ఆంధ్ర విడిపోయే సమయంలో కేసీఆర్ అప్పటి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారని గుర్తుచేశారు. తెలంగాణ వాళ్లకు స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వాలంటే.. ఆనాడు రాజ్ నాథ్ సింగ్ అలా ఇవ్వడం సాధ్యం కాదన్నారన్నారని తెలిపారు. భారత రాష్ట్రపతి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చారో… అదే జీవోను మేం అమలు చేస్తున్నామని స్పష్టంచేశారు. రాజకీయ లబ్ధికోసం బీజేపీ మాట్లాడుతోంది అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

మీకు ప్రజలపైన, నిరుద్యోగులపై ప్రేమ లేదని విమర్శించారు. ఏడేళ్లలో లక్షా 39 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఇది ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఏ బీజేపీ రాష్ట్రం కూడా ఉద్యోగులకు ఇంత జీతాలు ఇవ్వలేదని తెలిపారు. కరోనా కష్టకాలంలో పీఆర్సీ 30 శాతం ఇచ్చిన ప్రభుత్వం తమదని.. ఎక్కడైనా సమస్యలు ఉంటే ఉద్యోగ సంఘాలతో, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. బీజేపీ మాటలు కేవలం గోబెల్స్ ప్రచారం మాత్రమేనన్నారు.

రైతులపై ప్రేమ ఉంటే పది వేల రైతుబంధు దేశం అంతా ఎందుకు ఇవ్వరంటూ నిలదీశారు. మేం ఉద్యోగులకు ఇచ్చినట్లు 30 శాతం ఫిట్మెంట్ మీరు దేశమంతా ఇవ్వండి అంటూ పేర్కొన్నారు. జై జవాన్, జైకిసాన్ అన్న నినాదాన్ని బీజేపీ ప్రభుత్వం జై జవాన్, నై కిసాన్ గా మార్చిందంటూ విమర్శించారు. రైతులంటే బీజేపికి చిన్నచూపని.. రైతుల బావి దగ్గర మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయమంటోందని హరీశ్ రావు విమర్శించారు.

ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ ఆలీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పళ్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Also Read:

YS Jagan: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వైద్యశాఖలో 30 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన..

RGV – Perni Nani: ఆర్జీవీతో పేర్ని నాని భేటీ.. సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఉత్కంఠ..