వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటల టెలీ కాన్ఫరెన్స్..! పేషెంట్ల బంధువులకు సమాచారం అందించాలని సూచన..
Minister Etela Teleconference : వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల వైద్య అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్స్ తో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
Minister Etela Teleconference : వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల వైద్య అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్స్ తో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నాం కనుకే ఈ రోజు మెరుగ్గా ఉన్నామని తెలిపారు. చిన్న చిన్న సమస్యలు కూడా లేకుండా చూడాలని అధికారులను కోరారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేషంట్ల బంధువులకు సమాచారం అందించడానికి నూతన వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి ఆస్పత్రిలో పరిశుభ్రత ఉండాలని, పేషంట్లను ప్రతి రెండు గంటలకు ఒకసారి మానిటర్ చేయాలని, ఆక్సిజన్ కనీసం 24 గంటల ముందస్తుగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. 3010 ఐసియూ బెడ్స్ 10 రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. అందరూ సంయమనంతో పని చేయాలని జిల్లా వైద్య అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్స్ కు సూచించారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఏఎన్‌ఎం, ఆశా వర్కర్స్ పరిశీలించాలన్నారు.
5 రోజులకు మించి లక్షణాలు కొనసాగినా, షాశురేషన్ లెవల్ లు 95 కంటే తగ్గినా డాక్టర్ల పర్యవేక్షణలో పెద్దాస్పత్రులకు తరలించాలన్నారు.సెకండ్ డోస్ వేసుకొనే వారికి ఇబ్బందులు రాకుండా చూడాలని, ముందుగా వారికి వాక్సిన్ అందించాలని సూచించారు.18 సంవత్సరాల పైబడిన వారందరికీ వాక్సిన్ ఇవ్వడానికి త్వరలో నియమ నిబందనలు అందిస్తామన్నారు.ఈ సందర్భంగా టెస్టింగ్స్ కి వచ్చేవారికి, వాక్సిన్ వేసుకోవడానికి వచ్చే వారికి సీనియర్ సిటిజన్స్ కి ప్రత్యేక లైన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా డీఎంఈ మాట్లాడుతూ.. ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్, బెడ్స్ కోసం ఎక్కువ డిమాండ్ వస్తోందన్నారు. ఎంత మంది పేషెంట్లు వచ్చినా చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమిడీస్వీర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, పేషంట్లకు ఇచ్చిన ప్రతి ఇంజక్షన్ ఖాళీ సీసాను తిరిగి స్టోర్ లో సబ్‌మిట్ చేస్తున్నామని మంత్రికి వివరించారు.డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ..ఆక్సిజన్ నిల్వల సమాచారం అందించేందుకు ప్రతి ఆసుపత్రిలో ఒక నోడల్ ఆఫీసర్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రతి ఆసుపత్రిలో జనరేటర్లు పూర్తి స్థాయిలో పని చేసేలా సిద్దం చేసి ఉన్నాయన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్ చేస్తూ ఎక్కువ వ్యాప్తి చెందకుండా ఆపగలుగుతున్నామని తెలిపారు. సెక్రెటరీ రిజ్వీ మాట్లాడుతూ.. ఇప్పుడు ఆసుపత్రుల పాత్ర చాలా కీలకమని, ప్రాణాలు పోకుండా చూడాలన్నారు. ఆసుపత్రులలో చేర్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవద్దని సూచించారు. హాస్పిటల్ కి వచ్చిన పేషంట్లను ఎక్కువ సేపు వేచి చూడకుండా వెంటనే వీలు ఉన్న చోట చేర్చుకోవాలన్నారు. లక్షణాలకు అనుగుణంగా వారిని ఆసుపత్రులకు పంపించాలని డాక్టర్లను కోరారు.