Funerals: ఆపద సమయంలో ఆపన్న హస్తం.. మహాసేవ పేరుతో కోవిడ్ మృతులకు అంత్యక్రియలు… జేజేలు పలుకుతున్న జనం
కరోనాతో పోరాడి మృత్యువు ఒడిలో ఒదిగిన వారి అంతిమ సంస్కారాలకు రక్త సంబంధీకుల సైతం అమడ దూరంగా ఉంటున్నారు. దహన సంస్కారాలకు మేమున్నామంటూ ముందుకు వస్తోంది తాండూరు యువత.
Funerals for Corona Dead Bodies: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతోంది. కరోనా అంటేనే ఆమడ దూరం పరుగులు తీసే పరిస్థితులు నెలకొన్నాయి. కరోనాతో పోరాడి మృత్యువు ఒడిలో ఒదిగిన వారి అంతిమ సంస్కారాలకు రక్త సంబంధీకుల సైతం అమడ దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ప్రజలు భయంగుపెట్లో పెరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కరోనాతో చనిపోయిన వారిని చివరి చూపు చూసేందుకు కూడా ఆత్మీయులు దగ్గరకు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బయట వ్యక్తులతో అంత్యక్రియలు చేయించాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. కరోనా మృతదేహం కావడంతో కిలోమీటర్ల లెక్కన 20కిలోమీటర్ల దూరానికి కూడా వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇక, అంత్యక్రియలకు అయితే ముందుకు వచ్చే వారే కరువు.., ఇలాంటి పరిస్థితుల్లో బంధువులు రాకపోతేనేం మేము ఉన్నాం అంటోంది వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన మహాసేవ సభ్యులు, తాండూర్ యూత్ వెల్ఫేర్ సభ్యులు. కోవిడ్ తో చనిపోయిన వారు అనాధలు కాదు మా బంధువులు అంటున్నారు.
కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారికి అంత్యక్రియలు జరిపేందుకు ముందుకురాని కుటుంబ సభ్యులకు మేమున్నామని అండగా నిలుస్తున్నారు. వీరి సేవకు తాండూరు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఉన్నవారు లేని వారి అని చూడకుండా సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగి చనిపోయిన వారికి వారి వారి సంప్రదాయాలను ప్రకారం ఉచితంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
నిన్న అర్ధరాత్రి కోవిడ్ బారినపడి తాండూరు పట్టణానికి చెందిన ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ రవిశంకర్ వారి అమ్మ అంత్యక్రియలను తాండూరు పట్టణానికి చెందిన మహాసేవ వ్యవస్థాపక అధ్యక్షులు గోపాలకృష్ణ, సభ్యులు చంటి యాదవ్ అంకిత్ అనురాగ్, ఎబినేజర్ టైలర్ రమేష్, రఘు గౌడ్‌లు స్థానిక వీరశైవ స్మశానవాటికలో హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. వీరికి వారి కుటుంబ సభ్యుల తరఫున అభినందనలు అందుకున్నారు.
తాజాగా వికారాబాద్ జిల్లా ధారూర్ మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ నర్సయ్య గౌడ్ కోవిడ్ బారినపడి కన్నుమూశాడు. అయితే, ఈయన అంత్యక్రియలు నిర్వహించేందుకు గాను వారి కుటుంబ సభ్యులు తాండూరులోని మహాసేవ, తాండూరు యూత్ వెల్ఫేర్ సభ్యులను సంప్రదించగా వారు అక్కడికి వెళ్లి మృతునికి హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో తాండూరుకు చెందిన మహాసేవ, యూత్ వెల్ఫేర్ సభ్యుల సేవలు ఎల్లలు దాటి బాధితులకు అండగా నిలిచింది. వీరి మానవ సేవపట్ల పలువురు వారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Read Also…. Corona Crisis: మానసిక బలం.. కరోనా కాలంలో ప్రజలకు ముఖ్య అవసరం అంటున్న ఆరోగ్య నిపుణులు