Palle Pragathi: సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ పల్లెలు సర్వతోముఖాభివృద్ది.. నల్గొండ జిల్లా పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి
సుదీర్ఘ రాజకీయ జీవితంలో సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడిని చూడలేదని రాష్ట్ర పంచాయతీరాజ్,శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Ministers Participated Palle Pragathi Programe: సుదీర్ఘ రాజకీయ జీవితంలో సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడిని చూడలేదని, బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు పరితపిస్తున్న గొప్ప నేతని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ అభివృద్ధియే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన చేశారు. నార్కెట్‌పల్లి మండలం జువ్విగూడెం గ్రామంలో పల్లె ప్రగతి గ్రామ సభను మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై గ్రామస్తులతో చర్చించారు. హరితహారంలో భాగంగా ఇంటికి ఆరు మొక్కల చొప్పున అందజేశారు
స్వరాష్ట్రం వచ్చిన తర్వాత 220 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నామన్నారు. ఈ విడతలో మరో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇక, రాష్ట్రంలో రూ.110 కోట్ల ఖర్చుతో పల్లె ప్రకృతి వనాల నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశామన్నారు. 12,769 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు సమకూర్చామన్నారు. గ్రామ పంచాయితీలకు ఉన్న పెండింగ్ బిల్స్ అన్నింటిని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.
నల్గొండ జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపిన మహా నాయకుడు సీఎం కేసీఆర్ అన్న మంత్రి ఎర్రబెల్లి.. కరోనా కష్ట కాలంలో కూడా అభివృద్ధి, సంక్షేమం ఆగకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దేశంలో ఎక్కడా కూడ లేని, ఎవరికి తట్టని పథకాలను రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. ఆపద కాలంలోనూ రైతు బంధు పెట్టుబడి సాయంతో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అద్భుతంగా అభివృద్ధి జరిగిందన్న మంత్రి.. దివ్య క్షేత్రంగా, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆలయంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు.