నాలుగు సార్లు ఓడిపోయాడు.. ఆయనకు శాలువా కప్పండి! ఫిరోజ్ ఖాన్‌పై MIM ఎమ్మెల్యే సెటైర్లు
నాంపల్లి నియోజకవర్గంలోని 81 మందిర్ కమిటీలకు బోనాల పండుగ నిర్వహణకు చెక్కులను ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, ఎమ్మెల్సీ దయానంద్, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సంయుక్తంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం రాజకీయ పార్టీల మధ్య సామరస్యాన్ని ప్రదర్శించింది, ముఖ్యంగా మాజీద్ హుస్సేన్, ఫిరోజ్ ఖాన్ మధ్య సాధారణంగా ఉన్న విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయడం గమనార్హం.

ఏటా ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగ అంటే హైదరాబాద్ నగర ప్రజలకు సంబరమే. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో నగర ప్రజలు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి.. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. అంగరంగ వైభవంగా నిర్వహించే బోనాల పండుగ వేడుకల్లో అమ్మవారికి నైవేద్యాలు, జాతరలు, రథం బండ్ల ఊరేగింపులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆషాఢ మాసం అంతా ఎటు చూసినా పండుగ వాతావరణమే. ఈ నేపథ్యంలో హైదరాబాద్-నాంపల్లి నియోజకవర్గంలోని 81 మందిర్ కమిటీలకు బోనాలు పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో పలు ఆసక్తికర సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
నాంపల్లి నియోజకవర్గంలో బోనాలు పండుగ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్సీ దయానంద్, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ నాయకత్వంలో 81 మందిర్ కమిటీలకు చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్, AIMIM పార్టీల సహకారంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం అట్టడుగు స్థాయిలో సాంస్కృతిక సామరస్యం, పండుగ వాతావరణాన్ని పెంపొందించే దిశగా సాగుతోందని నేతలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరం సంప్రదాయాన్ని, ప్రజల సంక్షేమాన్ని పరిరక్షించే విధంగా ఈ బోనాల పండుగ వేడుకలు నిర్వహించే క్రమంలో నగర ప్రజలకు ఎలాంటి అవసరాల్లోనైనా పార్టీల పరంగా కాకుండా పాలనాపరంగా అండగా నిలిచేలా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు.
ఇదంతా ఇలా ఉండగా.. బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇద్దరి నేతలను ఒకటి చేసినట్లుగా కనిపించింది. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ నాంపల్లి నియోజకవర్గంలో ఎక్కడ, ఎప్పుడు ఎదురుపడినా గొడవలు చోటు చేసుకునేవి. ఇద్దరు నేతలకు ఒకరిపై మరొకరికి విమర్శలు చేసుకునే పరిణామాలే కనిపించేవి. అలాంటిది తాజా సంఘటనలో ఇద్దరూ నేతలు ఒకే వేదికని పంచుకోవడం, పక్కపక్కనే ఉన్నా ఎలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా పరస్పరం ఒకరినొకరు సామరస్యంగా ఉండడం కొత్తగా అనిపించింది.
నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ చెక్కులు పంపిణీ చేస్తున్న క్రమంలో తనతో పాటుగా ఫిరోజ్ ఖాన్ చేతుల మీదుగా కావాలనే ఇప్పించడం విశేషం. కమిటీ సభ్యుల ముందు ఫిరోజ్ ఖాన్‌ను గురించి చెబుతూ, చమత్కారంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ కమిటీ సభ్యులకు చెక్కులను అందజేశారు. మరో సందర్భంలో మందిర్ కమిటీ సభ్యులు నేతలను సన్మానించే సమయంలో ‘నాలుగు సార్లు నా చేతిలో ఓడిపోయాడు. ముందు ఆయనకు శాలువా కప్పండి’ అని ఫిరోజ్ ఖాన్‌ను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే మాజిద్ పలకడం సైతం చర్చనీయాంశంగా మారింది. బోనాల పండుగను నగర ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బోనాల పండుగ నేపథ్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. బోనాల పండుగ నగరానికే పరిమితం కాదని, ఇది రాష్ట్ర పండుగ అని అభివర్ణించారు. హిందూ సోదరులంతా బోనాల పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి