Telangana: తెలంగాణలో వచ్చే నెలలో మరో ఎన్నికలు.. బరిలో ఎంఐఎం కూడా.. ఓవైసీ షాకింగ్ డెసిషన్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితా ప్రకటించింది. వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. రాష్ట్రంలోని పార్టీలన్నీ ఇప్పటినుంచే గెలుపు కోసం సర్శశక్తులు ఒడ్డుతున్నాయి.

తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం మున్సిపాలిటీల వారీగా ఓటర్ల సమగ్ర సవరణ జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. వచ్చే నెలలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్నీ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్దమవుతున్నాయి. ఇప్పటినుంచే వ్యూహల్లో మునిగిపోయాయి. ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ రాబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై కీలక ప్రకటన చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు అసదుద్దీన్ ఓవైసీ తాజాగా స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పూర్తి స్థాయిలో పోటీ చేస్తుందని ప్రకటించిన ఒవైసీ.. పార్టీ టికెట్ల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ నెల 20వ తేదీ నుంచి దరఖాస్తులు
ఈ నెల 20వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఓవైసీ తెలిపారు. ఆసక్తికర అభ్యర్థులు దరఖాస్తులను పార్టీ కార్యాలయానికి పంపాలని పిలుపునిచ్చారు. పార్టీ నిబంధనలు, విధానాలను గౌరవించే వారికే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. స్థానిక సమస్యలపై అవగాహన, ప్రజలతో మమేకమై పనిచేసే సామర్థ్యం ఉన్న అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుందన్నారు. మున్సిపల్ ఎన్నికలు స్థానిక పాలనకు కీలకమని పేర్కొన్న ఒవైసీ.. పట్టణాల్లో మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి సమస్యల పరిష్కారానికి బలమైన ప్రతినిధులు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం అభ్యర్థులు ప్రజల సమస్యలను నేరుగా అర్థం చేసుకుని పరిష్కార దిశగా పని చేయాలని సూచించారు. తెలంగాణలో ఎంఐఎం పార్టీకి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని, గత ఎన్నికల్లో సాధించిన విజయాలే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
పాతబస్తీ ఘర్షణలపై ఓవైసీ రియాక్షన్
ఇదిలా ఉండగా.. పాతబస్తీలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణలపై ఒవైసీ స్పందించారు. అక్కడ పరిస్థితిని అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఘటనల సమయంలో పోలీసులు సమర్థంగా వ్యవహరించలేదని విమర్శించారు. ఇటువంటి ఘటనలు ప్రజల్లో భయాందోళనలకు దారి తీస్తాయని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సాధించిన విజయాన్ని ఒవైసీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం ఏకంగా 125 స్థానాలు గెలుచుకోవడం పార్టీ బలాన్ని చాటుతుందన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు. అదే స్ఫూర్తితో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎంఐఎం బలంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, స్థానిక సంస్థల్లో ఎంఐఎం పాత్రను మరింత విస్తరించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
