MEIL: కరోనా బాధితులకు అండగా మేఘా సంస్థ.. ఆసుపత్రులకు ఉచిత ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ముందుకొచ్చిన ఎంఈఐఎల్

రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్​ కేసులతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థ మరోసారి తన గొప్ప మనసును చాటుకుంది.

MEIL: కరోనా బాధితులకు అండగా మేఘా సంస్థ..  ఆసుపత్రులకు ఉచిత ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ముందుకొచ్చిన ఎంఈఐఎల్
Megha Engineering And Ingrastructures Limited Group

MEIL Free Oxygen: దేశంలో కరోనా సెకండ్ వేవ్​ విజృంభిస్తోంది. రోజుకు 3 లక్షలకు పైగా పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఆక్సిజన్, రెమిడిసివిర్ మందుల​ కొరత వేధిస్తోంది. సమయానికి ఆక్సిజన్​ అందక అనేక మంది కోవిడ్​ పేషెంట్లు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆక్సిజన్​ సరఫరా కోసం ప్రయత్నాలు ప్రారంభించినా.. ఒకేసారి పెరిగిపోయిన కేసులతో ఆక్సిజన్​ అందరికీ అందించడం కష్టంగా మారింది.

రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్​ కేసులతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దీంతో సహజంగానే ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థ మరోసారి తన గొప్ప మనసును చాటుకుంది. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రులకు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లను భారీ స్థాయిలో ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణయించింది.

ఉత్పత్తి సరైన స్థాయిలో లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అవసరమైన మేరకు జరగడం లేదు. ఈ ప‌రిస్థితుల్లో హైద‌రాబాద్‌లోని ప్రఖ్యాత నిమ్స్‌, అపోలో, స‌రోజినిదేవి వంటి ఆస్పత్రుల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ఆక్సిజ‌న్ అందించ‌మ‌ని అభ్యర్థన‌లు వ‌చ్చాయి.. వ‌చ్చిందే త‌డ‌వుగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లను భారీ స్థాయిలో ఉచితంగా స‌ర‌ఫ‌రా చేసేందుకు ముందుకు వచ్చింది. ఆక్సిజ‌న్ సేక‌ర‌ణ కోసం భ‌ద్రాచ‌లంలోని ఐటిసి, హైద‌రాబాద్‌లోని డీఆర్‌డీవోతో ఆఘ‌మేఘాల మీద ఒప్పందం చేసుకున్నట్లు స‌మాచారం.

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా కోవిడ్ రోగులు ఆక్సిజన్ సమస్యతో సతమతమవుతున్నారు. ఆక్సిజన్ అందక రోజుకు కొన్ని వందల మంది కోవిడ్ మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థల సహకారంతో ఆక్సిజన్ అవసరమయ్యే అన్ని హాస్పిటల్స్ కు ఆక్సిజన్ సరఫరా చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా మేఘా ఇంజనీరింగ్ ప్రభుత్వం సహకారంతో వివిధ హాస్పిటల్స్ కు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయనుంది.

కోవిడ్ రోగుల అవసరాలకు అనుగుణంగా నిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఆక్సిజన్ బెడ్లను పెంచుతోంది. ప్రస్తుతం 180 నుంచి 500 బెడ్లకు పెంచారు. ఇందుకు అనుగుణంగా నిమ్స్ లో రోజుకు 50 బి.టైప్ మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు (ఒక్కొక్క సిలిండర్ 7,000 లీటర్లు చొప్పున) ఏర్పాటు అవసరం అవుతుందని నిమ్స్ డైరెక్టర్ డా. మనోహర్ ఎంఈఐఎల్ సంస్థకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే, సరోజిని దేవి కంటి ఆసుప్రతికి రోజుకు దాదాపు 200 సిలిండర్లను అందించబోతుంది మేఘా సంస్థ. ఇక, అపోలో హాస్పిటల్స్‌కు ప్రతిరోజు 100 సిలిండర్లు, కేర్ హైటెక్ కు 50 సిలిండర్లను సరఫరా చేయనుంది. ఇక భవిష్యత్తులో ఆసుపత్రుల నుంచి వచ్చే ఆక్సిజన్ విజ్ఞప్తిమేరకు సరఫరా చేసేందుకు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు మేఘా ఇంజనీరింగ్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

డీఆర్‌ఆర్‌వో టెక్నాలజీ సహకారంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ 30 నుంచి 40 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఒక్కొక్క ప్లాంటు నుంచి నిమిషానికి 150 నుంచి 1,000 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ మొత్తాన్ని డీఆర్‌ఆర్‌వో కల్నల్ బి.ఎస్. రావత్, డా. రాఘవేంద్ర రావు పర్యవేక్షించనున్నారు. డీఆర్‌ఆర్‌వో సహకారంతో మేఘా ఇంజనీరింగ్ 35 లక్షల లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేయనుంది. ఈ మేరకు ఆయా హాస్పిటల్ నుంచి అభ్యర్థనలు వచ్చాయి. వీటికి అనుగుణంగా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసి సరఫరా చేయనుంది మేఘా సంస్థ. ఇక భద్రాచలం ఐటీసీ నుంచి రోజుకు 30 మెట్రిక్ టన్నుల క్రయోజనిక్ ఆక్సిజన్ ను తీసుకొని ఎంఈఐఎల్ సంస్థ లిక్విడ్ ఆక్సిజన్ గా మార్చనుంది. ఇందుకు అనుగుణంగా భద్రాచలం ఐటీసీ దగ్గర ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ క్రయోజనిక్ ఆక్సిజన్ లభ్యమవుతోంది.

అదేవిధంగా స్థానికంగా ఎంఈఐఎల్ ప‌రిశ్ర‌మ‌లో 10నుంచి 15 క్ర‌యోజనిక్ ఆక్సిజ‌న్ ట్యాంకులు త‌యారు చేస్తుంది. స్పెయిన్ నుంచి రెండు నుంచి మూడు క్రయోజనిక్ ఆక్సిజ‌న్ ట్యాంకులు దిగుమ‌తి చేయ‌డానికి సిద్ధంగా ఉంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. యుద్ధ ప్రాతిపాదికన క్రయోజనిక్ ఆక్సిజ‌న్ ట్యాంకులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మేఘా సంస్థ సిద్ధంగా ఉంది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. సర్కార్ అనుమతి రాగానే పనులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

అదే సమయంలో ఎంఈఐఎల్ కు సంబంధించిన నగర శివారులోని పరిశ్రమల్లో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను యుద్ధ ప్రతిపాదికన తయారు చేసి అందించేందుకు కూడా సంసిద్ధత తెలిపింది. ఇందుకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్‌లతో పాటు డాక్యుమెంట్లను ప్రభుత్వానికి అందించనుంది. ప్రభుత్వ పరిశీలన, అనుమతి అనంతరం వాటి తయారీకి వెంటనే రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది.

Read Also.. Covid Positive: కరోనా పాజిటివ్ అయితే మీరు తప్పక తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు ఇవే… ( వీడియో )