AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medaram Maha Jathara Live: జనసంద్రంగా మేడారం.. శివసత్తుల పూనకాలు, సమ్మక్క సారక్క నామస్మరణతో జంపన్న వాగు

Sammakka Sarakka Jathara 2024 Live Updates: లక్షలాదిమంది భక్తులు ఎప్పుడెప్పుడా అనిఎదురు చూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. తెలంగాణ కుంభమేళా.. మేడారం మహా జాతర ప్రారంభమైంది. కన్నేపల్లి నుంచి సారలమ్మ, గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం నుంచి గోవిందరాజు ప్రతిరూపాలను తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజు ప్రతిరూపాల ప్రతిష్టాపనతో తొలిఘట్టం ముగుస్తుంది. ఈ కార్యక్రమమంతా పూర్తిగా ఆదివాసీ ఆచారాల ప్రకారమే జరుగుతుంది.

Medaram Maha Jathara Live: జనసంద్రంగా మేడారం.. శివసత్తుల పూనకాలు, సమ్మక్క సారక్క నామస్మరణతో జంపన్న వాగు
Medaram Maha Jathara
Balaraju Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 21, 2024 | 10:12 PM

Share

Sammakka Sarakka Jathara 2024 Live Updates: లక్షలాదిమంది భక్తులు ఎప్పుడెప్పుడా అనిఎదురు చూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. తెలంగాణ కుంభమేళా.. మేడారం మహా జాతర ప్రారంభమైంది. కన్నేపల్లి నుంచి సారలమ్మ, గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం నుంచి గోవిందరాజు ప్రతిరూపాలను తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజు ప్రతిరూపాల ప్రతిష్టాపనతో తొలిఘట్టం ముగుస్తుంది. ఈ కార్యక్రమమంతా పూర్తిగా ఆదివాసీ ఆచారాల ప్రకారమే జరుగుతుంది. 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు ప్రతిరూపాలతో ఆదివాసీ పూజారులు ఒకరోజు ముందే బయలుదేరారు. పూర్తిగా కాలినడకన కాళ్లకు చెప్పుల్లేకుండా సాగే ఈ యాత్రలో ఏడు వాగులు, దట్టమైన అడవి మీదుగా ప్రయాణం ఉంటుంది. సరిగ్గా ఇవాళ (ఫిబ్రవరి 21 బుధవారం) సాయంత్రం సారలమ్మ గద్దె పైకి చేరుకుంటారు. అటు 40 కిలోమీటర్ల దూరంలోని కొండాయి నుంచి గోవిందరాజు ప్రతిరూపాలతో పూజారులు అదే సమయానికి గద్దెల దగ్గరకు చేరుకుంటారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఈ ప్రాంతమంతా సమ్మక్క సారక్క నామస్మరణతో మారుమోగిపోతుంది. ఇక జాతరలో అసలు ఘట్టం గురువారం సాయంత్రం ఆవిష్కృతమవుతుంది. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్కని తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. ఈ మహా జాతర ఫిబ్రవరి 24వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Feb 2024 08:34 PM (IST)

    కోటికి పైగా భక్తులు వస్తారని అంచనా

    మేడారం మహాజాతరకు నాలుగు రోజుల్లో కోటిపైన భక్తులు దర్శించు కోనున్నట్లు అధికారుల అంచనా. అమ్మల రాక చీకటిని చీల్చుకుంటూ వెలుగులు విరజిమ్ముతుంది. రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ జాతరలో ప్రతి ఘట్టం.. గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుంది.

  • 21 Feb 2024 08:33 PM (IST)

    మహాజాతరకు ముందే లక్షల మంది భక్తులు

    మేడారం మహాజాతరకు ముందే లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. దూరప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలు లెక్కచేయక తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

  • 21 Feb 2024 08:33 PM (IST)

    మేడారం జాతరకు కేంద్ర నిధులు

    మేడారం జాతర నిర్వహణకు కేంద్రం 3.14 కోట్ల నిధుల కేటాయించింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి రూ.2.30 కోట్లు, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నుంచి రూ. 0.84 కోట్ల నిధులు విడుదల చేసింది.

  • 21 Feb 2024 08:32 PM (IST)

    రేపు గద్దెలపైకి రానున్న సమ్మక్క

    ఇక వరాల తల్లి సమ్మక్క గురువారం మేడారం గద్దెలపైకి రానున్నది. ఇద్దరు వన దేవతలు గద్దెలపై ఉండే శుక్రవారం మేడారం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం వన దేవతలు గద్దెలపై నుంచి వనంలోకి వెళ్లడంతో జాతర ముగుస్తుంది.

  • 21 Feb 2024 08:31 PM (IST)

    ఇలవేల్పులైన తల్లులకు బంగారం మొక్కులు

    డప్పు వాద్యాలు, సంప్రదాయ నృత్యాల మధ్య సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకున్నారు. ఇలవేల్పులైన తల్లులకు భక్తులు జంపన్న వాగులో పవిత్ర స్నానాలాచరించి నిలువెత్తు బంగారం, పసుపు, కుంకుమ సమర్పిస్తున్నారు. శివసత్తులు, ఓడిబియ్యం, చీరే సారెలతో తల్లుల ముందు ప్రణమిల్లుతున్నారు.

  • 21 Feb 2024 05:02 PM (IST)

    జంపన్నవాగు రూట్​‌లో ట్రాఫిక్​ జామ్​​

    మేడారానికి తరలివస్తున్న భక్తులతో ఆ ప్రాంత పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. జంపన్నవాగులో స్నానాలు చేయడం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో జంపన్న వాగు నుంచి గద్దెలకు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గద్దెలకు వెళ్లే భక్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • 21 Feb 2024 03:04 PM (IST)

    మేడారం జాతర.. భక్తులకు టీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి

    మేడారం జాతరకు భక్తుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి.. సురక్షితంగా వనదేవతలను భక్తులు దర్శించుకోవాలని సూచించారు.

    సజ్జనార్ ట్వీట్..

  • 21 Feb 2024 03:04 PM (IST)

    భక్తులతో కిక్కిరిసిపోయిన జంపన్న వాగు

    మేడారం జంపన్న వాగు లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి పాపవినాశనం పొందుతున్నారు భక్తులు. శివసత్తుల పూనకాలు, సమ్మక్క సారక్క నామస్మరణతో జంపన్న వాగు పరిసరాలన్నీ మారుమోగుతున్నాయి.

  • 21 Feb 2024 01:26 PM (IST)

    మేడారం భక్తులకు అలెర్ట్.. లక్నవరం రూట్ క్లోజ్

    మేడారం బుస్సాపూర్ గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో భారీ రద్దీ నెలకొంది. వాహనాలు భారీ స్థాయిలో చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ నియంత్రణ లో భాగంగా లక్నవరం రూట్ క్లోజ్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు టూరిజం డిపార్ట్ మెంట్ల సమక్షంలో బ్యానర్లను ఏర్పాటు చేశారు.

  • 21 Feb 2024 01:21 PM (IST)

    జంపన్న వాగులో భక్తుల స్నానాలు..

    మేడారం ప్రాంతం భక్తులతో నిండిపోయి జనసంద్రంగా మారిపోయింది. అమ్మవార్లను దర్శించుకోవడానికి ముందు భక్తులు జంపన్న వాగులో స్నానమాచరిస్తున్నారు. మరోవైపు భక్తులు జాతర పరిసర ప్రాంతాల్లో భక్తులు సెల్ఫీతో సందడి చేస్తున్నారు.

  • 21 Feb 2024 01:20 PM (IST)

    నిలువెత్తు బంగారంతో భక్తుల మొక్కుల చెల్లింపు

    మేడారంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద నిలువెత్తు బంగారాన్ని భక్తులు సమర్పించి తమ మొక్కులను చెల్లిస్తున్నారు. మరోవైపు వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భారీగా క్యూ లైన్ లో భక్తులు ఎదురుచూస్తున్నారు.

  • 21 Feb 2024 01:12 PM (IST)

    వ్యక్తిగత శుభ్రత పాటించాలని.. మాస్క్‌లు ధరించాలని సూచన..

    వేసవి కాలంలో అడుగు పెట్టామని భక్తులు హైడ్రేటెడ్ గా ఉండటం ముఖ్యమని తరచుగా నీరు, జ్యుస్ లు తాగాలని సూచిస్తున్నారు. సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని  సూచించారు. భక్తులు మాస్కులు ధరించాలని, తినే ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు.

    ఎవరైనా జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా.. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నా తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలని వైద్య శాఖ అధికారులు సూచించారు.

  • 21 Feb 2024 01:04 PM (IST)

    భక్తుల కోసం ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ..

    ఆదివాసీ జాతరను సందర్శించే భక్తుల కోసం తెలంగాణ ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. మేడారం పరిసర ప్రాంతాల్లో 150 మంది వైద్యులతో 72 వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలతో పాటు అవాంఛనీయ సంఘటనలు, ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.

  • 21 Feb 2024 12:55 PM (IST)

    క్యూ లైన్‌లో భక్తుడికి గుండె నొప్పి.. కాపాడిన రెస్క్యూ సిబ్బంది

    వనజాతర మహోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రోజు సారలమ్మ గద్దెను ఎక్కనుండగా.. రేపు సమ్మక్క గద్దెను అధిరోహించి భక్తులను అనుగ్రహించనుంది.  వనదేవతలను దర్శించుకోవడానికి వస్తున్న ఓ భక్తుడు హఠాత్తుగా  గుండెపోటుకు గురైయ్యాడు. వెంటనే స్పందించిన రెస్క్యూ సిబ్బంది ప్రాధమిక చికిత్స అందించి అతని ప్రాణాలను కాపాడింది.

    భక్తుడు పెద్దపల్లి జిల్లా రాజు అనే వ్యక్తిగా గుర్తించారు. అమ్మవార్ల దర్శనం కోసం క్యూ లైన్‌లో గుండెనొప్పితో శ్వాస తీసుకునేందుకు రాజు ఇబ్బంది పడ్డాడు. ఇది గమనించిన రెస్క్యూ సిబ్బంది తక్షణమే స్పంధించి  కృతిమ శ్వాస అందించి మెరుగైన చికిత్స కోసం స్థానిక హాస్పిటల్‌కి తరలించారు.

  • 21 Feb 2024 12:47 PM (IST)

    రేపు చిలకలగుట్ట నుంచి మేడారంకు సమ్మక్క

    మేడారం జాతరలో మొదటి రోజు సాయంత్రానికి సారలమ్మ, పగిడిద్దరాజుతో పాటు గోవిందరాజును గద్దెలపైకి పూజారులు తీసుకుని వస్తారు. జాతరలోని రోజున మేడారం సమీపంలోని చిలకలగుట్ట నుంచి సమ్మక్కను  కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి తీసుకొస్తారు.

  • 21 Feb 2024 12:44 PM (IST)

    మేడారంకు బయలుదేరిన సమ్మక్క భర్త పగిడిద్దరాజు

    బుధవారం ఉదయం ములుగు జిల్లాలోని లక్మీపూరం మొద్దులగూడెం నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారానికి బయలుదేరాడు. భారీ బందోబస్తు మధ్య గిరిజన సంప్రదాయ పద్దతిలో పగిడిద్దరాజు శోభయాత్రగా మేడారం గద్దె వద్దకు చేరుకోనున్నారు.

  • 21 Feb 2024 12:42 PM (IST)

    కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయంలో ముసిగిన ప్రత్యేక పూజలు

    సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా ఈ రోజు ఆదివాసీ పూజారులు కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను అనుసరిస్తూ కన్నేపల్లి నుంచి మేడారంలోని అమ్మవారి గద్దెల పైకి సరళమ్మని ప్రతిష్టించడానికి సారలమ్మ కుంకుమ బరిణితో ఆదివాసీ పూజారులు బయల్దేరారు.

  • 21 Feb 2024 12:33 PM (IST)

    మేడారం రహదారుల్లో భారీ రద్దీ.. లక్నవరం సందర్శనలకు బ్రేక్..

    మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. ఈ రోజు సారలమ్మ గద్దెను ఎక్కగా.. రేపు సమ్మక్క భరిణ రూపంలో మేడారం రానుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రమే ఏపీ సహా అనేక రాష్ట్రాల నుంచి భక్తులు   సమ్మక్క–సారలమ్మను దర్శించుకోవడానికి పోటెత్తుతారు. వన దేవతలను సందర్శించుకున్న అనంతరం భక్తులు సమీపంలోని అందమైన ప్రాంతాలను దర్శించుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా లక్నవరం  సరస్సును సందర్శించేందుకు భక్తులు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తారు.

    జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువు ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. లక్నవరం సరస్సు చుట్టూఅందాలతో పాటు సరస్సులో బోటు షికారు, స్పీడ్ బోట్ తోపాటు సైక్లింగ్ బోటుతో పర్యాటకులు ఎంజాయ్ చేయవచ్చు.

    అయితే మేడారం జాతర నేపథ్యంలో రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. భారీ రద్దీ  నెలకొనడంతో  లక్నవరం సందర్శనను క్లోజ్ చేశారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు లక్నవరం రూట్ క్లోజ్ చేస్తున్నట్లు పంచాయితీ సిబ్బంది ప్రకటించింది.

  • 21 Feb 2024 12:22 PM (IST)

    సమ్మక్క, సారక్కల జీవితాలు నేటికీ ఆదర్శం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు..

    ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన ‘సమ్మక్క సారక్క మేడారం జాతర’ ఘనంగా ప్రారంభమైంది. అడవి బిడ్డల సంబరం సందర్భంగా ప్రజలందరికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  శుభాకాంక్షలు చెప్పారు. ఈ సంవత్సరం నేటి నుంచి 24 వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ జాతర భారతీయ సంస్కృతి, విలువలు, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని అన్నారు. సమ్మక్క, సారక్కల జీవితాలు, స్ఫూర్తిదాయకం, అన్యాయాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వారు సాగించిన పోరాటం నేటికీ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు కిషన్ రెడ్డి. జై సమ్మక్క, జై సారక్క అంటూ సోషల్ మీడియా వేదికగా జాతర వీడియోను షేర్ చేశారు.

  • 21 Feb 2024 11:24 AM (IST)

    ఈ నెల 23న వన దేవతలను దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై

    నాలుగు రోజుల పాటు జరగనున్న మేడారం మహా జాతరకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని దారులు మేడారం వేపే.. ఇప్పటికే 60 లక్షల మంది భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించు కున్నారు. కాగా ఈ రోజు సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువు దీరనున్నారు. కాగా ఫిబ్రవరి  23వ తేదీ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై లు సమ్మక్క సారక్కలను దర్శనం చేసుకోనున్నారు. అయినప్పటికీ వన దేవతలను దర్శించుకోవడానికి వెళ్లే సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా మంత్రి  సీతక్క స్వయంగా పర్యవేక్షిస్తూ ఏర్పాట్లను  చేయించారు.

  • 21 Feb 2024 11:18 AM (IST)

    మేడారం జాతరకు జాతీయ హోదా తెచ్చేందుకు కృషి చేస్తామన్న మంత్రి కొండా సురేఖ

    గత పాలకుల కంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మేడారం జాతరను అత్యంత వైభవోపేతంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని మంత్రి కొండా సురేష్ పేర్కొన్నారు. అన్నిశాఖలు సమన్వయంతో పనిస్తూ భక్తులకు 24 గంటలు సకల సదుపాయాలు కల్పిస్తున్నాయని సురేఖ చెప్పారు. పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో మేడారం జాతరకు జాతీయ హోదా తేలేకపోయారని.. కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ హోదా తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తుందని మంత్రి సురేఖ చెప్పారు.

  • 21 Feb 2024 11:11 AM (IST)

    తెలంగాణ బిడ్డలకు స్ఫూర్తి అంటూ శుభాకాంక్షలు చెప్పిన మంత్రి కొండా సురేఖ

    మేడారం జాతరను పురస్కరించుకొని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మేడారం జాతర ఆదివాసీ ఆత్మగౌరవానికి, తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. సమ్మక్క, సారక్కల నామస్మరణతో నేడు యావత్ తెలంగాణలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని తెలిపారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా సమ్మక్క, సారక్కలు వీరోచిత పోరాటం చేసి, వీరమరణం పొందిన తెలంగాణ ప్రజల గుండెల్లో సదా జీవించే ఉన్నారన్నారు. ఆత్మగౌరవమే ఆభరణంగా బతుకుతున్న తెలంగాణ బిడ్డలకు సమ్మక్క, సారక్కలే స్ఫూర్తి ప్రధాతలు అని మంత్రి పేర్కొన్నారు.

  • 21 Feb 2024 10:59 AM (IST)

    900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం.. దేవతలు గద్దెనెక్కే గడియలు ఆసన్నం..

    దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే జాతర అది.. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం అది.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ.. తెలంగాణ కుంభమేళా ..  గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ఆ పండుగే.. సమ్మక్క-సారలమ్మ జాతర. మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువు దీరే గడియలు ఆసన్నమవుతున్నాయి. ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే. ఇది జనమా – వనమా అన్నట్లు మేడారం అభయారణ్యం మొత్తం జనారణ్యంగా మారిపోతోంది. ఎడ్ల బండ్ల నుంచి మొదలుకొని హెలికాప్టర్ల వరకు జనం మేడారంకు బాటపట్టారు..

  • 21 Feb 2024 10:53 AM (IST)

    వరంగల్‌ నుంచి 6వేల ప్రత్యేక బస్సులు

    వరంగల్‌ నుంచి కూడా మేడారం జాతరకు 6వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. 51 ప్రాంతాల్లో పికపింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. 30 లక్షల మందిని మేడారం జాతరకు తరలించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఆర్టీసీ. సుమారు 15వేల మంది ఆర్టీసీ సిబ్బంది మేడారం జాతర విధులు నిర్వహిస్తున్నారు.

  • 21 Feb 2024 10:51 AM (IST)

    భక్తులకు సమాచారం అందించేందుకు 450 మంది సిబ్బంది సిద్ధం..

    జాతర పాయింట్ల వద్ద ప్రత్యేకంగా చలువ పందిళ్లు, టెంట్లు, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ఆయా పాయింట్లలో 450 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.  మేడారానికి వచ్చే మూడు మార్గాల్లో ప్రత్యేక భద్రతతోపాటు.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడే పార్కింగ్ ఏర్పాట్లు చేశారు పోలీసులు.

  • 21 Feb 2024 10:46 AM (IST)

    మేడారం వెళ్లే భక్తుల కోసం 11 టీఎస్‌ఆర్టీసీ పాయింట్ల దగ్గర ఏర్పాట్లు

    మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోల పరిధిలో 11 టీఎస్‌ఆర్టీసీ పాయింట్ల దగ్గర మౌలిక వసతుల ఏర్పాట్లపై అధికారులు వారం రోజులుగా దృష్టి సారించారు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, చర్ల, టేకులపల్లి, పాల్వంచ, మంగపేట, వెంకటాపురం, ఏటూరు నాగారం నుంచి మేడారం జాతరకు స్పెషల్‌ బస్సులు నడుపుతున్నారు. మేడారం వెళ్లేందుకు మణుగూరు ఏటూరు నాగారం మీదుగా కొన్ని సర్వీసులు.. ఇల్లెందు- గుండాల మీదుగా మరికొన్ని బస్సులు నడుపుతున్నారు.

  • 21 Feb 2024 09:50 AM (IST)

    సాయంత్రం సారలమ్మకు అధికార లాంఛనాలతో స్వాగతం పలకనున్న మంత్రి సీతక్క

    ఈ సాయంత్రం గద్దెపైకి చేరనున్నారు సారలమ్మ, గోవిందరోజు, పగిడిద్దరాజు. అలాగే రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపైకి చేర్చుతారు. పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాలతో ఇప్పటికే మేడారం పయనమయ్యారు ఆదివాసీ పూజారులు. కాలినడకన వాగులు వంకలు దాటుకుంటూ ఇవాళ సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. వనదేవతలకు గద్దెలపైకి తీసుకొచ్చే సమయంలో అధికారిక లాంఛనాలతో స్వాగతం పలకనున్నారు మంత్రి సీతక్క

  • 21 Feb 2024 09:21 AM (IST)

    వనదేవతలైన సమ్మక్క సారలక్కలకు ప్రణమిద్దాం అన్న ప్రధాని

    మేడారం జాతర నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా భక్తులకు శుభాకాంక్షలు చెప్పారు. గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటైన మేడారం జాతర మన సాంస్కృతిక వారస్వతానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అని చెప్పారు. అంతేకాదు  ఈ సమ్మక్క సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవ వేళ భక్తులకు శుభాకాంక్షలని అన్నారు. ఈ జాతర భక్తి సంప్రదాయం. సమాజ స్ఫూర్తికి గొప్ప కలయిక అని చెప్పారు నరేంద్ర మోడీ. మనం వనదేవతలైన సమ్మక్క సారలక్కలకు ప్రణమిద్దాం అని ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందామని పిలుపునిచ్చారు.

  • 21 Feb 2024 08:30 AM (IST)

    నాలుగు రోజుల పాటు కాగజ్‌నగర్ నుంచి వరంగల్ ప్రత్యేక రైలు..

    ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర. భారీ సంఖ్యలో భక్తులు సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల సౌకార్యార్ధం కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు వెళ్లేందుకు ప్రత్యేక రైలు నడపనుంది. నేటి నుంచి 24వ తేదీ పాటు నాలుగు రోజుల వరకూ  ఈ రైలు నడవనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. దీంతో  జాతరకు వెళ్లే భక్తులతో కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ కిటకిటలాడింది.

  • 21 Feb 2024 07:59 AM (IST)

    మేడారంను ఆవహించిన దట్టమైన పొగ.. ఇబ్బందులు పడుతున్న భక్తులు

    మేడారం ప్రాంతాన్ని దట్టమైన పొగ ఆవహించింది. అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు వంటలు చేసుకోవడానికి పొయ్యలను వినియోగిస్తున్నారు. భక్తులు ఉపయోగింస్తున్న ఈ వంట చెరుకు కారణంగా విస్తృతంగా పొగ వ్యాపిస్తోంది. దీంతో మేడారం చుట్టు పక్కల పరిసర ప్రాంతాల్లో 3 కి.మీ మేర పొగ అలుముకుంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • 21 Feb 2024 07:43 AM (IST)

    నిఘా నీడలో మేడారం.. 432 సీసీ కెమెరాలు ఏర్పాటు

    మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జాతర పరిసర ప్రాంతం మొత్తం  పోలీసుల నిఘాలోకి వెళ్లింది. 432 సీసీ కెమెరాలను అమర్చారు. అమ్మవార్లను ప్రతిష్టించే గద్దెలతో పాటు  పార్కింగ్‌‌ ప్లేస్‌‌లు, రోడ్లపై, చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాహనాలను, భక్తుల సంఖ్యను లెక్కించేందుకు సర్వైలెన్స్‌‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. భక్తుల భద్రత కోసం 5 డ్రోన్‌‌ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. దుకాణాలు, గుడారాలు, గద్దెల వద్ద డాగ్, బాంబ్ స్క్వాడ్స్ తో తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే ప్రశ్నిస్తున్నారు.

  • 21 Feb 2024 07:37 AM (IST)

    నేటి నుంచి ఆన్‌లైన్‌లో బంగారం సమర్పణకు అవకాశం

    వన దేవతలైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని, బంగారం చెలించాలనుకునే భక్తులు అమ్మవారి గద్దె దగ్గరకు ఏమైనా కారణాలతో వెళ్లలేకపోతే.. అటువంటి భక్తుల సౌకర్యార్ధం ఆన్ లైన్ సేవలను ముందుకు తీసుకొచ్చింది. అమ్మవార్లకు బంగారం సమర్పించేందుకు ఆన్​లైన్, ఆఫ్​లైన్ సేవలను దేవదాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది. సమ్మక్క సారక్కలకు బంగారంగా భావించే బెల్లాన్ని నేటి నుంచి ఆన్ లైన్ ద్వారా సమర్పించ వచ్చు. ప్రసాదాన్ని తెచ్చుకోవచ్చు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

  • 21 Feb 2024 07:20 AM (IST)

    మేడారం జాతర నేపథ్యంలో.. జిల్లాలోని విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు

    నేటి నుంచి నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో ములుగు జిల్లాలోని పాఠశాలలు,  కాలేజీలకు సెలవులు ప్రకటించారు. నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. ఐదో రోజు ఆదివారం పబ్లిక్ హాలిడే కావడంతో మొత్తం వరసగా జిల్లాలోని స్టూడెంట్స్ కు ఐదు రోజులు సెలవులు వచ్చాయి.

  • 21 Feb 2024 07:13 AM (IST)

    కోటిన్నర మంది వస్తారని అంచనా..

    ఇప్పటికే 60 లక్షలమంది వన దేవతలను దర్శించుకున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు మరో కోటిన్నరమంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక ఇవాల్టి నుంచి ఆన్‌లైన్‌లో బంగారం సమర్పణకు అవకాశం ఇస్తారు.

  • 21 Feb 2024 07:02 AM (IST)

    6వేల ప్రత్యేక బస్సులు.. 14 వేలమంది పోలీసులు

    నాలుగు రోజుల జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ, 6 వేల స్పెషల్‌ బస్సులను వేసింది. 14 వేలమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం దక్షిణమధ్య రైల్వే ఈసారి స్పెషల్‌ ట్రైన్స్‌ కూడా ఏర్పాటుచేసింది. కాజీపేట లేదా వరంగల్‌లో రైలు దిగి బస్సుల ద్వారా మేడారం చేరుకునే విధంగా రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఇక సీఎం రేవంత్‌, గవర్నర్ తమిళి సై, స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌…అమ్మవార్ల దర్శనానికి రానున్నారు.

Published On - Feb 21,2024 7:02 AM