AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విందులో విషాదం.. చిన్న మాంసం ముక్క.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది!

మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేసింది. కేవలం ఒక చిన్న మాంసం ముక్క ప్రాణం తీస్తుందని ఎవరూ ఊహించరు. ఆ దురదృష్టకర సంఘటన మూసాపేట మండలం సంకలమద్ది గ్రామంలో చోటుచేసుకుంది. విందు భోజనం ఒక వ్యక్తి పాలిట మృత్యుపాశంగా మారింది.

విందులో విషాదం.. చిన్న మాంసం ముక్క.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది!
Man Dies
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Apr 17, 2026 | 5:14 PM

Share

మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేసింది. కేవలం ఒక చిన్న మాంసం ముక్క ప్రాణం తీస్తుందని ఎవరూ ఊహించరు. ఆ దురదృష్టకర సంఘటన మూసాపేట మండలం సంకలమద్ది గ్రామంలో చోటుచేసుకుంది. విందు భోజనం ఒక వ్యక్తి పాలిట మృత్యుపాశంగా మారింది. అప్పటివరకు మిత్రులతో కలిసి సరదాగా గడిపిన వ్యక్తి, తిన్న ఆహారమే గొంతులో అడ్డుపడి శ్వాస అందక ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మూసాపేట మండలం సంకలమద్ది (బంగ్లగడ్డ) గ్రామానికి చెందిన మద్యల అంజనేయులు వృత్తిరీత్యా పెయింటింగ్ పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అంజనేయులుకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే, కుటుంబ గొడవలతో భార్య పుట్టింటికి వెళ్లడంతో అతను ఒంటరిగానే ఉంటున్నాడు. ఏప్రిల్ 15వ తేదీ బుధవారం రాత్రి, అంజనేయులు తన ఇద్దరు మిత్రులతో కలిసి అడ్డాకుల మండలం కందూరు స్టేజీ సమీపంలో భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్న సమయంలో ఒక పెద్ద మాంసం ముక్క అకస్మాత్తుగా అతని గొంతులో ఇరుక్కుపోయింది. మొదట కాస్త అసౌకర్యంగా అనిపించినా, నీళ్లు తాగి సర్దుకుని, మిత్రులతో కలిసి ఇంటికి బయలుదేరాడు.

ప్రయాణం మధ్యలో అంజనేయులుకు ఒక్కసారిగా శ్వాస తీసుకోవడం భారమైంది. గొంతులో ఇరుక్కున్న మాంసం ముక్క శ్వాసనాళాన్ని అడ్డుకోవడంతో ఊపిరి అందక వాహనంపైనే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. అంజనేయులు మరణించాడని గ్రహించిన మిత్రులు భయాందోళనకు గురయ్యారు. ఏం చేయాలో పాలుపోక, అతని మృతదేహాన్ని మూసాపేట వద్ద ఉన్న ఒక కల్లు దుకాణం దగ్గర వదిలివేసి అక్కడి నుండి పారిపోయారు.

గురువారం (ఏప్రిల్ 16) ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో గొంతులో మాంసం ముక్క ఇరుక్కొని శ్వాస నిలిచిపోవడం వల్లే మరణం సంభవించిందని వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిత్రుల ప్రవర్తనపై కూడా విచారణ జరుపుతున్నారు.

చిన్న అజాగ్రత్త ఎంతటి ఘోరానికి దారితీస్తుందో ఈ ఘటన నిరూపించింది. భోజనం చేసేటప్పుడు తొందరపడకుండా, ఆహారాన్ని బాగా నమిలి మింగాలని వైద్య నిపుణులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ఒక సామాన్య కార్మికుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us