సర్పంచ్ నుంచి కేబినెట్ మంత్రి దాకా.. మక్తల్ ఎమ్మెల్యేకు వరంగా మారిన సామాజికవర్గం!
తొలిసారి గెలిచిన ఆ ఎమ్మెల్యే ఆశలు ఫలించాయి. ఇన్నాళ్లు ఊరించిన అమాత్య పదవి ఎట్టకేలకు వరించింది. సామాజిక సమీకరణాలు కూర్పు నాటి సర్పంచ్‌ను కేబినెట్ మంత్రి వరించింది. తోటి ఎమ్మెల్యేలు, మంత్రులు కేబినెట్‌లో చోటు దక్కనుందని చెప్పినప్పటికీ, నెలల తరబడి ఎదురు చూపులు తప్పలేదు. ఏది ఏమైనా ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడంతో ఆ ఎమ్మెల్యే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

తొలిసారి గెలిచిన ఆ ఎమ్మెల్యే ఆశలు ఫలించాయి. ఇన్నాళ్లు ఊరించిన అమాత్య పదవి ఎట్టకేలకు వరించింది. సామాజిక సమీకరణాలు కూర్పు నాటి సర్పంచ్‌ను కేబినెట్ మంత్రి వరించింది. తోటి ఎమ్మెల్యేలు, మంత్రులు కేబినెట్‌లో చోటు దక్కనుందని చెప్పినప్పటికీ, నెలల తరబడి ఎదురు చూపులు తప్పలేదు. ఏది ఏమైనా ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడంతో ఆ ఎమ్మెల్యే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
సామాజిక సమీకరణాల కూర్పే లక్ష్యంగా తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగుతోంది. కొత్తగా ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. అయితే ఇందులో బీసీ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్ బెర్త్ వరించింది. రాష్ట్రంలోనే బలమైన ముదిరాజ్ సామాజికవర్గం నుంచి గెలిచిన వాకిటి శ్రీహరి.. తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ముదిరాజు సామాజికవర్గం నుంచి గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే కావడం ఆయనకు వరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీల్లో ముదిరాజ్ సామాజికవర్గం చాలా బలంగా ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అయితే ప్రజాప్రతినిధుల విజయావకాశాలను డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి కేబినెట్‌లో చోటు కల్పించడం తప్పనిసరిగా మారింది.
అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్‌లో మంత్రి పదవి కోసం పెద్దగా ఆశలు పెట్టుకోలేదు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. కానీ విస్తరణలో మాత్రం మంత్రి పదవి కోసం భారీ ఆశలు పెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ మక్తల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభ నిర్వహించిన సందర్భంగా ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే ముదిరాజ్ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే శ్రీహరిని మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. దీనికి తోడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు వాకిటి శ్రీహరికి మెండుగా ఉన్నాయి.
సర్పంచ్ నుంచి మంత్రి వరకు..
వాకిటి నర్సింహులు, రాములమ్మకు ఎనిమిది మంది సంతానంలో వాకిటి శ్రీహరి ఒకరు. డిగ్రీ వరకు చదివిన ఆయనకు 2000 సంవత్సరంలో లలితతో వివాహం జరిగింది. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అచ్యుత్ రామ్, అమిత్ రాజ్ ఇద్దరు కుమారులు. వాకిటి శ్రీహరిది స్థానికంగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. ఇక మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రాజకీయ ప్రస్థానం చాలా ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది. సర్పంచ్‌గా ప్రస్థానం ప్రారంభించి, నేడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 1995 నుండి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభమై సుదీర్ఘంగా నేటికీ 28 సంవత్సరాలుగా నిఖార్సైన కాంగ్రెస్ వాదిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, పార్టీకి వీర విధేయులుగా పనిచేస్తూ ఏకంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు కలిగిన నేతగా ఎదిగాడు.
ప్రజా ప్రతినిథిగా..!
ఇక 2001 -2006 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నుండి మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసి తొలి అవకాశంలోనే గెలుపొందారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. అంతేకాకుండా అదే సంవత్సరంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్పంచ్‌ల సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. 2006-2011 సంవత్సరంలో స్థానిక సంస్థల మండల పరిషత్ ఎన్నికల్లో దాసర్ పల్లి గ్రామం నుండి ఎంపీటీసీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొంది, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చరిత్ర సృష్టించారు. 2014-2018 సంవత్సరంలో మక్తల్ మండలం నుండి స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్‌పీటీసీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రంలో జెడ్‌పీటీసీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీ సాధించిన రికార్డు సృష్టించాడు. అలాగే 2014-2018 సంవత్సరం కాలంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికయ్యారు.
రాజకీయ ప్రయాణం..
ఇక 1996-2001 వరకు కాంగ్రెస్ పార్టీ మక్తల్ మండలం ప్రధాన కార్యదర్శిగా, 2001-2006 సంవత్సరం వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, 2006-2014 సంవత్సరం వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సెక్రెటరీగా పనిచేశారు. 2018 సంవత్సరం నుండి కృష్ణా జలాల పరిరక్షణ సమితి సభ్యుడుగా కొనసాగారు. 2023 సంవత్సరంలో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి, మక్తల్ అసెంబ్లీ టికెట్ ఖరారు కావడంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి రాహుల్ గాంధీతో ప్రశంసలు పొందారు వాకిటి శ్రీహరి.
తెలంగాణ కేబినెట్‌లో చోటు కల్పించడం పట్ల మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. అధిష్టానానికి రుణపడి ఉంటానన్నారు. బీసీ కుల గణన తర్వాత బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో.. తనకు అవకాశం ఇవ్వడం గొప్ప వరంగా భావిస్తున్నానని వాకిటి శ్రీహరి అన్నారు. కాగా, ముదిరాజ్ ముద్దుబిడ్డకు మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ సామాజిక వర్గం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అసలైన కార్యకర్తకు, పార్టీని నమ్ముకున్న వారికి మంత్రిగా అవకాశం కల్పించిందని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..