Telangana Rains: అల్పపీడనం.. ఈరోజు, రేపు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ కారణంగా ఈరోజు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు..

Telangana Rains: అల్పపీడనం.. ఈరోజు, రేపు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
Rains
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 12, 2021 | 11:55 AM

Rain warning: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ కారణంగా ఈరోజు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో ఈ రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిరి, నాగర్ కర్నూల్ జిల్లాలో గంటకి 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.

తెలుగు రాష్ట్రాలను మబ్బులు కమ్మేశాయి. జోరువాన వరద పారిస్తోంది. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి

ఇవాళ వాతావరణం చూశారా ! ముసురుపట్టింది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఏపీ తెలంగాణలో ఆకాశాన మబ్బులు కమ్మేశాయి. జోరువాన వరద పారిస్తోంది. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలను వరుణుడు ముంచేస్తున్నాడు. గడిచిన 24గంటల్లో పలు ప్రాంతాల్లో కుంభవృష్టి పడింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. ఊహించనంత ప్రమాదకరంగా కొన్ని చోట్ల పరిస్థితులు మారుతున్నాయి.

కుండపోత వానకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలకు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి వాగులు, వంకలు. కుంటాల, పొచ్చెర జలపాతాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆసిఫాబాద్‌ మండలంలోని 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. భైంసా డివిజన్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు గ్రామాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. తానుర్ మండలంలోని కార్బల, దౌలతబాద్ వంతెనపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. నిన్నటి నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 696‌.7 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 34, వేల క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 29 వేల క్యూసెక్కులుగా ఉంది. ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరుగుతుండడంతో.. ఐదు గేట్లు ఎత్తి గోదారిలోకి నీటిని వదులుతున్నారు అధికారులు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. గోదావరిలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజికి భారీగా వరద వస్తోంది. బ్యారేజిలో 24 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 95,960 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండగా.. లక్షా 2వేల 840 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ సామర్థ్యం 16 .17 టీఎంసీలకు గాను 13.3 టీఎంసీలకు నీటిని నిల్వ ఉంచారు.

తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటలో కురిసిన భారీ వర్షం కురిసింది. కుమ్మరి వీధి డ్రైనేజీలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కొట్టుకుని పోయి మృతి చెందాడు. మృతుడు తోటవారి వీధికి చెందిన గండ్రోతుల నాగసుబ్రహ్మణ్యంగా గుర్తించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు దాటేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. వర్షం కారణంగా కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లో వర్షపునీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Read also: Koushik Reddy: కౌశిక్ రెడ్డి ఫోన్ వాయిస్ లీక్ వ్యవహారం : తీవ్రంగా పరిగణించిన టీ కాంగ్రెస్‌, 24 గంటల డెడ్ లైన్