AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T.Congress: టీ కాంగ్రెస్‌లో పదవుల పందారం షురూ.. ఛాన్స్ కోసం అశావాహుల ఎదురుచూపులు..!

తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలం ప్రకారం రెండు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. దీంతో గెలుపు ఖాయం అనుకున్న రాజ్యసభ టికెట్ కోసం పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు, ఏఐసీసీ నేతలు పోటీ పడ్డారు. సీనియర్ నేతలైన చిన్నారెడ్డి, వీ హనుమంతరావు పేర్లు రాజ్యసభ రేసులో ముందువరుసలో వినిపించాయి. వీరితో పాటు మరికొంత మంది నేతలు పార్టీ పెద్దలతో టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు.

T.Congress: టీ కాంగ్రెస్‌లో పదవుల పందారం షురూ.. ఛాన్స్ కోసం అశావాహుల ఎదురుచూపులు..!
Congress
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Feb 16, 2024 | 3:07 PM

Share

తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలం ప్రకారం రెండు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. దీంతో గెలుపు ఖాయం అనుకున్న రాజ్యసభ టికెట్ కోసం పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు, ఏఐసీసీ నేతలు పోటీ పడ్డారు. సీనియర్ నేతలైన చిన్నారెడ్డి, వీ హనుమంతరావు పేర్లు రాజ్యసభ రేసులో ముందువరుసలో వినిపించాయి. వీరితో పాటు మరికొంత మంది నేతలు పార్టీ పెద్దలతో టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఏఐసీసీ నేతల్లో అజయ్ మాకెన్, సుప్రియ శ్రీనటే రాజ్యసభ టికెట్ ఆశించిన వారిలో ఉన్నారు.

అయితే వీరిలో అజయ్ మాకెన్‌కు కర్ణాటక నుంచి రాజ్యసభ టికెట్ దక్కగా మిగతా వారికి నిరాశ మిగిలింది. పైగా తెలంగాణ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం ట్విస్ట్ ఇచ్చింది. యువనేతగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్‌ను పెద్దల సభకు పంపి యువతకు కాంగ్రెస్ పెద్ద పీఠ వేస్తోందన్న సంకేతాలనిచ్చినట్లైంది. రేణుకా చౌదరికి రాజ్యసభ దక్కడంతో ఖమ్మం లోక్‌సభ బరిలో ఎవరు ఉంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఖమ్మం లోక్ సభ స్థానంలో టికెట్ కోసం రేణుకా చౌదరి దరఖాస్తు చేసుకోలేనప్పటికీ ఈ స్థానం తనదే అని గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అయితే సోనియా గాంధీ సైతం ఖమ్మం లోక్‌సభ బరిలో నిలుస్తారనే చర్చ తెరపైకి రావడంతో ఈ టికెట్‌పై పార్టీలో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయగా, రేణుకా చౌదరి కూడా తెలంగాణ నుంచి పెద్దల సభకు నామినేట్ అయ్యారు.

అయితే ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, సీనియర్ నేత వీ హనుమంతరావు, ప్రముఖ వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు ఖమ్మం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో టికెట్ వరించేదెవరికో అనేది టీ కాంగ్రెస్‌లో ఆసక్తిగా మారింది. ఇక కీలకమైన నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీలు, రాజ్యసభ స్థానాల హడావిడి ముగియడంతో ఇక నేతల చూపు లోక్ సభ మీదకి మళ్లింది. ఎంపీ టికెట్ల కోసం ఇప్పటికే 300 పైగా అప్లయ్ చేసుకున్నారు. ఒకవైపు సునీల్ కనుగోలు టీం ఇప్పటికే గెలుపు గుర్రాల కోసం సర్వే చేస్తోంది.

కీలకమైన ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలు యువకులకు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ యువ నేతల్లో జోష్ నిండింది. NSUI రాష్ట్ర అధ్యక్షుడు, యువకుడు బల్మూర్ వెంకట్ ని ఎమ్మేల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన కొద్ది రోజులకే రాజ్యసభ స్థానాన్ని కూడా యువనేత, జాతీయ స్థాయిలో యూత్ కాంగ్రెస్ వింగ్ లో ఉన్న అనిల్ కుమార్ కి ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో యువకులకు ప్రాధాన్యత ఉంటుందన్న సంకేతాలు వెళ్లాయి. ఈ రెండు కీలక నిర్ణయాలు పార్టీలో పని చేస్తున్న విద్యార్థి విభాగం, యూత్ వింగ్ నాయకుల్లో ఉత్సాహం నింపింది. తాము కూడా కష్టపడి పార్టీ కోసం పనిచేస్తే పదవులు వస్తాయనే చర్చ ఆయా కమిటీల్లో మొదలైంది.

మొత్తంగా సీనియర్లకు ఇచ్చే రాజ్యసభ సీటు కూడా యువ నేతలకు ఇవ్వడంతో చాలా మంది యువ నాయకుల్లో ఆశలు చిగురించాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం చాలా మంది నేతలు ట్రై చేస్తున్నారట. చూడాలి మరీ ఇంకా అవకాశం దక్కే యువ నేతలెవరో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…