Lockdown : గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులు.. అక్కడ మాత్రం మామూలే..! కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివీ..

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు..

Lockdown : గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులు..  అక్కడ మాత్రం మామూలే..!   కేబినెట్  భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివీ..
Telangana Lockdown
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 08, 2021 | 9:30 PM

Lock down relaxations in Telangana : తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది. సాయంత్రం ఆరు గంటలనుంచి తిరిగి తెల్లారి ఉదయం ఆరు గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది. కాగా, కరోనా పూర్తిగా అదుపులోకిరాని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యథాతథ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.

గత కేబినెట్ సమావేశం చేసిన ఆదేశాల మేరకు సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజక వర్గాల్లో కరోనా పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్ర వైద్యాధికారుల బృందం పర్యటించింది. ఈ నియోజకవర్గాల్లో కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, అందుచేత, ఈ ఏడు నియోజక వర్గాల్లో లాక్ డౌన్ ను ప్రస్థుతం కొనసాగిస్తున్న సమయాన్ని అనుసరించే మరో పదిరోజుల పాటు కొనసాగించాలని కేబినెట్ కు వైద్యాధికారుల బృందం సిఫారసు చేసింది. వారి సిఫారసుల మేరకు పైన తెలిపిన 7 నియోజకవర్గాల్లో లాక్ డౌన్ యథాతథ స్థితినే ( ఉదయం 6 గంటలనుంచి 1 గంట వరకు సడలింపు, మరో గంటపాటు గమ్యస్థానాలకు చేరుకునేందుకు వెసులుబాటు) కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.

అంతేకాక, రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని కేబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది వానాకాలం సాగుపై వ్యవసాయశాఖ సంసిద్ధత మీద కేబినెట్ లో పూర్తిస్థాయి సమీక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది. గత ఏడాది వానాకాలం, యాసంగి కలిపి 1,06,03,927 ఎకరాల్లో కేవలం వరి పంట సాగు చేయడం ద్వారా సుమారు 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి రావడం పట్ల కేబినెట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ కృషిలో భాగం పంచుకున్న వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని, అధికారులు, సిబ్బందిని కేబినెట్ అభినందించింది.

2,601 వ్యవసాయ క్లస్లర్లలో ఏ.ఈ.ఓలు రైతు వేదికలు కేంద్రంగా రైతులకు పూర్తిగా అందుబాటులో ఉంటూ వారికి పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందించాలని, వానాకాలం సాగుకోసం రైతులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. చేపలు, గొర్రెల పెంపకం వంటి రంగాల్లో అద్భుతమైన కృషిని కనబరుస్తున్న మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, అధికారులను, సిబ్బందిని క్యాబినెట్ అభినందించింది.