Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Nominations: నామినేషన్ చివరి రోజు అనేక మలుపులు.. ఆ పార్టీకి తప్పని చిక్కులు

తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికలోనే అనేక చిక్కులు తెచ్చుకున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి సెప్టెంబర్‌ రెండోవారానికల్లా తమ అభ్యర్థుల జాబితా వెలువరిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ప్రకటించారు. దీని కోసం అప్లికేషన్‌ విక్రయం, పొలిటికల్‌ అపైర్స్‌ కమిటి, స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు, ఢిల్లీలో సీఈసీలో ఆమోదం వరకు రకరకాల వడపోతలను కాంగ్రెస్‌ చేపట్టింది. అయినప్పటికీ అభ్యర్థుల ఎంపికలో అసంతృప్తులు, నిరసనలు.

Telangana Nominations: నామినేషన్ చివరి రోజు అనేక మలుపులు.. ఆ పార్టీకి తప్పని చిక్కులు
List Of Events In Congress Party On Nomination Last Day For Telangana Elections
Follow us
Srikar T

|

Updated on: Nov 10, 2023 | 6:34 PM

తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికలోనే అనేక చిక్కులు తెచ్చుకున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి సెప్టెంబర్‌ రెండోవారానికల్లా తమ అభ్యర్థుల జాబితా వెలువరిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ప్రకటించారు. దీని కోసం అప్లికేషన్‌ విక్రయం, పొలిటికల్‌ అపైర్స్‌ కమిటి, స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు, ఢిల్లీలో సీఈసీలో ఆమోదం వరకు రకరకాల వడపోతలను కాంగ్రెస్‌ చేపట్టింది. అయినప్పటికీ అభ్యర్థుల ఎంపికలో అసంతృప్తులు, నిరసనలు. వెరసి కార్యకర్తల్లో గందరగోళం. పార్టీ విడుదల చేసే జాబితాలో ఒకరి పేరు ఉంటుంది, బీ-ఫామ్‌ మాత్రం ఇంకొకరికి ఇస్తారు. ఇలాంటి వ్యవహారాలు చాలా నియోజకవర్గాల్లో కనిపించాయి. ఎన్ని కమిటీలు, ఎన్ని వడపోతలు చేసినా హస్తం పార్టీకి అభ్యర్థుల ఎంపికలో చిక్కులు తప్పలేదు.

చివరి నిమిషం వరకు అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ దోబూచులాడింది. పటాన్‌చెరు నియోజకవర్గం టికెట్‌ను కాంగ్రెస్‌ పార్టీ తొలుత నీలం మధుకు కేటాయించింది. దీనిపై నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో చివరి నిమిషంలో పటాన్‌చెరు స్థానంలో నీలం మధు స్థానంలో కాట శ్రీనివాస్‌ గౌడ్‌కు టికెట్‌ వరించింది. నన్ను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోశారని ఆరోపించిన నీలం మధు తనను కాదని నిలబెట్టిన అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తానని సవాల్‌ విసిరారు. అంతే కాదు కాట శ్రీనివాస్‌గౌడ్‌కు అండగా నిలిచిన దామోదర రాజనరసింహకు కూడా చుక్కలు చూపిస్తానని నీలం మధు ప్రతిజ్ఞ చేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించిన మధు నిమిషాల వ్యవధిలోనే బీఎస్పీ అభ్యర్థిగా పటాన్‌చెరు నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు.

నారాయణఖేడ్‌లోనూ కాంగ్రెస్‌ చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చింది. ఈ స్థానం నుంచి మాజీ ఎంపీ సురేష్‌ షెట్కర్‌ పోటీ చేస్తారని తొలుత కాంగ్రెస్‌ ప్రకటించింది. ఆయకు బీఫామ్ కూడా ఇచ్చింది. కాని స్థానిక నేత పటోళ్ల సంజీవ్‌రెడ్డి ససేమిరా అనడంతో చివరకు సురేష్‌ షెట్కర్‌ను తప్పించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని చెప్పిన సురేష్‌ షెట్కర్‌, పటోళ్ల సంజీవరెడ్డి మధ్య కాంగ్రెస్‌ హైకమాండ్‌ సయోధ్య కుదిర్చింది. వనపర్తిలోనూ ఇదే తంతు. తొలుత వనపర్తి స్థానాన్ని సీనియర్‌ నేత చిన్నారెడ్డికి కేటాయించింది. నామినేషన్‌ వేసుకునేందుకు ఆయన సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ ఆలోచన మారింది. చిన్నారెడ్డిని కాదని మేఘారెడ్డికి టికెట్‌ ఖరారు చేసింది. బోథ్‌ లాంటి గిరిజన నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌కు చిక్కులు తప్పలేదు. ముందు ఒకరి పేరు ప్రకటించడం, ఆ తర్వాత ఆ అభ్యర్థిని మార్చడంతో నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలినట్టు అయింది. బోథ్‌ స్థానాన్ని తొలుత అశోక్‌ను ఖరారు చేసింది. ఆ తర్వాత తూచ్‌ అని చెప్పి ఆయనను తప్పించి గజేందర్‌కు అవకాశం కల్పించింది.

ఇవి కూడా చదవండి

ఇక తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రి అయిన జగదీష్‌ రెడ్డి పోటీ చేస్తున్న సూర్యాపేటలో గట్టి అభ్యర్థిని నిలపడంలో కాంగ్రెస్‌ పార్టీ చివరి నిమిషం వరకు మీనమేషాలు లెక్కించింది. సీనియర్‌ నేత రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి, పటేల్ రమేష్‌ రెడ్డి మధ్య టికెట్‌ ఫైట్‌ నడిచింది. ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. చివరకు టికెట్‌ సీనియర్‌ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని వరించింది. తనకు టికెట్‌ ఇస్తానని చెప్పి కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని పటేల్‌ రమేష్‌ రెడ్డి కన్నీరు మున్నీరయ్యారు. ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నారు. అభ్యర్థులను చివరి నిమిషంలో మార్చడంతో చాలా మంది నిరాశకు గురై రెబెల్‌గా బరిలోకి దిగారు. ఏదో అనుకుంటే, ఇంకేదో అయినట్టుగా కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మారింది. మొత్తానికి నామిషేన్ల ఘట్టం ముగియడంతో ఇక బుజ్జగింపును పార్టీ ప్రారంభించింది. రెబల్‌గా రంగంలోకి దిగిన వారికి నచ్చజెప్పి బరి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..