Telangana: ఆ జాతీయ రహదారిలో చిరుత సంచారం.. ఒంటరిగా వెళ్లవద్దంటూ అధికారుల హెచ్చరిక
గత ఐదు రోజుల క్రితం కూడా రామాయంపేట శివారులో రాత్రి సమయంలో చిరుతపులి ఒక దూడను చంపింది. గ్రామంలోకి ప్రవేశించిన చిరుతపులి దూడను చంపి తినేసింది. ఆ మర్నాడు ఉదయం ఆ దూడ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. చిరుత పాదముద్రాలను గుర్తించారు. ఈ క్రమంలోనే రైతులను అప్రమత్తం చేశారు అటవీ అధికారులు. తాజాగా..

మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 1421, జాతీయ రహదారి పక్కన చిరుత పులి సంచారంతో రైతులు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత వారం రోజుల క్రితం శివారు ప్రాంతంలోని డబుల్ బెడ్ రూమ్ కెసిఆర్ కాలనీ సమీపంలోని కళాశాల స్వామి అనే రైతు వ్యవసాయ పొలం వద్ద గత శనివారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద పశువుల పాకపై దాడి చేసిన చిరుత పులి ఒక లేగ దూడను చంపి తినేసింది. ఉదయం పొలం వద్దకు వెళ్లి గమనించిన రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు.
ఇదే క్రమంలో బుధవారం రాత్రి అదే ప్రాంతంలో గొలిపర్తి గ్రామానికి చెందిన పేరని లింగం వ్యవసాయ పొలం వద్ద పశువుల పాక వద్ద బంధించిన కుక్కపై చిరుత పులి దాడి చేసి చంపేసింది. ఉదయం గమనించిన రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో విచారణ చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకొని విచారించగా చిరుతకు సంబంధించిన కాళీ ముద్రలు కనిపించాయి. దీంతో అదే ప్రాంతంలో గత రాత్రి సీసీ కెమెరా ఏర్పాటు చేశారు.
మరోసారి దాడి జరగకుండా రాత్రి వేళల్లో రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్ళవద్దని, పొలాల వద్ద పశువులను బంధించవద్దని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి సీసీ కెమెరాలో చిరుత ఆనవాలు కనిపిస్తే బోను ఏర్పాటు చేసి బంధించేందుకు చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




