AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS-CPI: గులాబీ బాస్‌తో ఎర్రనేతల పొత్తు అందుకేనా.. మరీ వారికి అడిగిన సీట్లు ఇస్తే టీఆర్ఎస్ నేతల దారెటు..!

వామ పక్షాలు అంత సులభంగా కారెక్కడం లేదు. పక్కా వ్యూహంతో.. చాలా దూర దృష్టితో గులాబీతో జతకడుతున్నాయి. దీనికి మునుగోడు ఉప ఎన్నికనే ఓరియో బిస్కెట్‌లా వేస్తున్నాయి. ఈ దెబ్బతో..అటు నల్గొండ.. ఇటు ఖమ్మం జిల్లాలో తమ పార్టీలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. దీంతో..ఎర్రపార్టీలు ఆశిస్తున్న ఆ స్థానాల్లోని గులాబీ నేతలు టెన్షన్‌ పడుతున్నారట.

TRS-CPI: గులాబీ బాస్‌తో ఎర్రనేతల పొత్తు అందుకేనా.. మరీ వారికి అడిగిన సీట్లు ఇస్తే టీఆర్ఎస్ నేతల దారెటు..!
Left Parties Allied With Trs
Sanjay Kasula
|

Updated on: Sep 05, 2022 | 7:10 PM

Share

గులాబీ దళపతి ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లకు మాటిస్తే తమ గతేంకానని టిఆర్ఎస్‌ నేతలు హైరానా పడుతున్నారు. ఇంతకీ వామపక్షాలు ఆశపడుతున్న ఆ సెగ్మెంట్లు ఏవి..? అక్కడి రాజకీయాలు ఎలా ఉన్నాయి.. అందుకోసమే కదా.. గులాబీ బాస్‌తో జత కడుతున్నామని ఎర్రసైన్యం అంటోంది. నియోజక వర్గాల పునర్విభజనకు ముందు బూర్గంపాడును నాలుగు సార్లు కైవసం చేసుకుని చక్రం తిప్పిన సిపిఐ పార్టీ.. పినపాక నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తమ ఉనికిని నెమ్మదిగా కోల్పోతూ వచ్చింది.. అందుకే..కేసీఆర్‌తో జరిగిన చర్చలు ఆ పార్టీకి కలిసి వచ్చే విధంగా ఉన్నాయి.. వచ్చే ఎన్నికల్లో సిపిఐ-టిఆర్ఎస్ పొత్తుల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమకు బాగా పట్టున్న నియోజకవర్గాలను కోరుకుంటోంది.. అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాలను ఆశిస్తోంది. ముఖ్యంగా మొదటి నుంచీ..తమకు పటిష్టమైన ఓటు బ్యాంకు ఉన్న పూర్వ బూర్గంపాడు నేటి పినపాక నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలని గట్టిగా పట్టుబడుతోంది.

తమ ఓటు బ్యాంకు తో పాటు టిఆర్ఎస్ బలం కూడా తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే పినపాకలో మళ్లీ తమ ప్రాబల్యం చాటుకునే అవకాశం వస్తుందని సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..అదే జరిగితే ప్రస్తుత ఎమ్మెల్యే రేగా కాంతారావు రాజకీయ భవిష్యత్ ఏంటని చర్చ జోరందుకుంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, వైరా, పినపాక, నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ బలంగా ఉండటంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పొత్తులో భాగంగా మూడు సీట్లను అడిగే అవకాశం ఉందని సీపీఐ పార్టీ నాయకులు చర్చించుకోవడంతో వైరా, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గంలోని అధికార పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది..

వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఆశలు పెట్టుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ ,మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ లకు ఆశాభంగం ఎదురయ్యే అవకాశం ఉంది..దీంతో పక్క పార్టీల వైపు చూస్తున్నారు. సీపీఐ పార్టీ ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా వైరా నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడంతో అధికార పార్టీ నేతల్లో అలజడి మొదలైంది..కేసీఆర్ సీపీఐ పార్టీకి ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయిస్తే అధికార పార్టీ నాయకులు సహకరించకపోవచ్చని ఇప్పట్నుంచే చర్చించుకుంటున్నారు..

అయితే ఈ వ్యవహారం..ఇండిపెండెంట్ గా పోటీ చేసే నాయకులకు వరమే అని కూడా అనుకుంటున్నారు. వైరా నియోజకవర్గంలో బలాన్ని చూపించేందుకే ఇటీవల ఖమ్మం జిల్లా మహా సభలను వైరాలో నిర్వహించి పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని నింపారని సీపీఐ శ్రేణులు చెప్పుకుంటున్నారు.

సిపిఐకి బలమైన మరో నియోజకవర్గం..కొత్తగూడెం..సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి ఈసారి కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో కొత్తగూడెంలో సిపిఐ తరఫున పొత్తు ఉన్నా లేకపోయినా కూనంనేని సాంబశివరావు పోటీలో దిగుతారని నాయకులు బహిరంగంగానే తెలియజేశారు. ఒంటరిగా పోటీ చేయడం కంటే టిఆర్ఎస్ తో కలిసి పోటీ చేయడం వల్ల లాభం ఉంటుందని సిపిఐ ఎప్పటినుంచో భావిస్తోంది.

దీంతో కూనంనేని కొత్తగూడెం సీటు తీసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తో పాటు కొత్తగూడెంలో అభ్యర్థిత్వని ఆశిస్తున్న జలగం వెంకట్రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర నేతలకు ఇబ్బందేనని పొలిటికల్‌ టాక్‌.. అదే జరిగితే.. టిఆర్‌ఎస్‌ ఆశావహులు..కాంగ్రెస్, బిజెపి వైపు మొగ్గు చూపక తప్పని పరిస్థితి. ఈ పొత్తు భయమే గులాబీ నేతలను భయపెడుతోంది.

అయితే వనమా కుమారుడు రాఘవ ఎపిసోడ్‌తో పార్టీకి డ్యామేజ్‌ అయిన కారణంగా..ఈసారి కొత్త గూడెంలో వనమాను వెంకటేశ్వరరావును టిఆర్‌ఎస్‌ పక్కన పెడుతుందనే చర్చ జరుగుతోంది. గతంలో సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు గెలిచారు. అందుకే కొత్తగూడెం సీటు విషయంలో.. కామ్రేడ్లు గట్టిగా పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీపీఐ పెట్టిన ప్రతిపాదనకు కేసీఆర్ అంగీకరించి.. కొత్తగూడెం, వైరా, పినపాక అసెంబ్లీ స్థానాలు ఇస్తే గనుక.. ప్రస్తుత ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా, రాములు నాయక్ రాజకీయ భవిష్యత్ ఏంటని జిల్లాలో చర్చ మొదలైంది.. భవిష్యత్ లో జరగబోయే రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి.. సీపీఐ ఖచ్చితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు సీట్లు కావాలని పట్టుబడితే గులాబీ అధినేత నిర్ణయం ఎలా ఉంటుందోనని జిల్లా రాజకీయ వర్గాల్లో వివిధ రకాలుగా ప్రచారం జరుగుతోంది..ఏ నిర్ణయమైనా మునుగోడు ఎన్నిక తర్వాతేనని ప్రగతి భవన్‌ టాక్‌.

మరిన్ని తెలంగాణ వార్త కోసం..