AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaleshwaram Project: కాళేశ్వరం లోపాలు L&Tనే చక్కదిద్దాలి : జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మూడు బ్యారేజీల విషయంలో పలు అవకతవకలను గుర్తించింది జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్. ఇందుకు సంబంధించి ఎల్ అండ్ టి 7వ బ్లాక్ పునరుద్ధరణ పనులను పూర్తి చేసి... లోపాలను తన సొంత ఖర్చుతో సరిదిద్దాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.

Kaleshwaram Project: కాళేశ్వరం లోపాలు L&Tనే చక్కదిద్దాలి : జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
Kaleshwaram Project
Ram Naramaneni
|

Updated on: Aug 08, 2025 | 4:32 PM

Share

తెలంగాణ రాష్ట్రానికి జీవనాడిగా భావించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో తీవ్రమైన లోపాలు, నిర్లక్ష్యం, ఆర్థిక అక్రమాలు చోటు చేసుకున్నట్లు జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ తేల్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బారేజీల నిర్మాణంలో జరిగిన ప్లానింగ్, డిజైన్, నిర్మాణ సంబంధిత తప్పిదాలపై సుమారు 15 నెలల పాటు జరిపిన విచారణ అనంతరం ఆయన నివేదికను ఇటీవల సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం.. పనులపై ఎలాంటి బలమైన పర్యవేక్షణ లేకపోవడం, నాణ్యత నియంత్రణలో విఫలమయినట్లు.. నిర్మాణ సమయంలో అవకతవకలకు తావిచ్చే విధంగా నిర్వహణ సాగినట్లు తేలింది.

ఘోష్ కమిషన్ ప్రధానంగా ఎల్అండ్‌టీ సంస్థపై తీవ్ర విమర్శలు చేసింది. మేడిగడ్డ బారేజ్‌లో 7వ బ్లాక్ పూర్తిగా దెబ్బతినడంతో, ఆ బ్లాక్‌ మరమ్మత్తు బాధ్యతను ఎల్అండ్‌టీనే భరిస్తుందని స్పష్టం చేసింది. తమ ఖర్చుతోనే దాన్ని పునరుద్ధరించాలని, అలాగే ఎల్అండ్‌టీకి ఎలాంటి పూర్తి ధృవపత్రాలు ఇవ్వకూడదని నివేదిక పేర్కొంది. ఇదే విధంగా అన్నారం, సుందిల్ల బారేజీలకు బాధ్యత వహించిన సంస్థలు కూడా డిఫెక్ట్ లైయబిలిటీ పీరియడ్‌లో తలెత్తిన లోపాలను తమ ఖర్చుతో పరిష్కరించాలని సూచించింది.

కమిషన్ తన నివేదికలో వివిధ స్థాయుల్లో తలెత్తిన లోపాలను వెలుగులోకి తీసుకొచ్చారు. నిర్మాణాల్లో మౌలిక లోపాలు(బ్యారెజ్ పొడవు.. నది వెడల్పు విషయంలో) స్పష్టంగా ఉన్నాయని, ఇవి సాంకేతిక ప్రమాణాలను, నిబంధనలను ఖచ్చితంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ముఖ్యంగా బ్యారేజీలు పెర్మియబుల్ ఫౌండేషన్ మీద డిజైన్ చేశారని, వాటిని స్టోరేజ్ స్ట్రక్చర్డ్‌గా వాడారని కమిషన్ పేర్కొంది. మోడల్ స్టడీలు లేకుండానే డిజైన్‌లను ఆమోదించారని, పనులపై టెక్నికల్ రివ్యూ చేపట్టలేదని తీవ్రంగా ఆక్షేపించారు.

ప్రాజెక్టులో నాణ్యత నియంత్రణ పూర్తిగా అదుపుతప్పిన స్థాయిలో ఉందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా సెకంట్ పైల్స్ వంటి కీలక నిర్మాణ భాగాల్లో నాణ్యతా ప్రమాణాలు అనుసరించలేదని స్పష్టం చేశారు. పనుల అనంతరం ఎలాంటి నిర్వహణ జరగకపోవడం, ప్రీ-పోస్ట్ మాన్సూన్ తనిఖీలను పూర్తిగా విస్మరించడం, నిర్వహణ రిపోర్టులు లేకపోవడం… ఇవన్నీ ప్రొటోకాల్‌ను ధిక్కరించడమే అని కమిషన్ అభిప్రాయపడింది.

ప్రాజెక్ట్ వ్యయం కూడా అంచనాలను మించి మూడు రెట్లు పెరిగింది. ప్రారంభంలో రూ. 38,500 కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్.. చివరకు రూ. 1,10,248.48 కోట్ల ఖర్చుతో ముగిసింది. ఇది 186 శాతం అధిక వ్యయంగా నమోదైంది. ప్లానింగ్ దశలో నుంచి ఆర్థిక నియంత్రణ పాటిస్తే.. పరిస్థితి ఇంత ఇబ్బందికరంగా మారేది కాదని ఘోష్ తెలిపారు. పలు పనులు పూర్తి కాకముందే ఆయా కంపెనీలకు పూర్తయినట్టు ధృవీకరణ పత్రాలు ఇచ్చారని, ఇది సిస్టమటిక్ ఫెయిల్యూర్‌గా రిపోర్ట్ ఇచ్చారు.

ఇతర అంశాల్లో, ప్రాజెక్ట్‌కు సంబంధించి ఉన్న సీనియర్ ఇంజినీర్లు సీ మురళీధర్, బీ హరిరామ్, ఏ నరేందర్ రెడ్డి, టి శ్రీనివాస్, ఓంకార్ సింగ్‌లు కమిషన్ ముందు తప్పుల సమాచారం ఇచ్చినట్టు తేలింది. కొంతమంది నిజాలను దాచారని, కొంతమంది తప్పుడు వివరాలతో కమిషన్‌ను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని నివేదికలో పేర్కొనడం గమనార్హం.