Hyderabad: హైదరాబాద్‌పై మరోసారి వరుణుడి గర్జన.. అతి భారీ వర్షసూచన
తెలంగాణలో క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నేడు(శుక్రవారం) కూడా నగరంపై వరుణుడు గర్జించనున్నాడు. దీంతో రెస్క్యూ టీమ్స్ అలెర్ట్ అయ్యాయి. అదే విధంగా ఆగస్టు 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో 13, 14, 15 తేదీల్లో వర్షాలు మరింత ఉద్ధృతంగా ఉండొచ్చని హెచ్చరించింది.

మరికొద్ది సమయంలో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, అగ్నిమాపక బృందాలు అప్రమత్తమయ్యాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో గురువారం హైదరాబాద్‌తో పాటు దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వరుణుడు గర్జించాడు. గురువారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరమంతా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలతో పాటు పలు రహదారులు జలమయం అయ్యాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు నరకం చూశారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు చోట్ల చెట్టు నేలకొరిగాయి. మొత్తంగా నగరమంతా అస్తవ్యస్తంగా మారింది.
శుక్రవారం కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మరికాసేట్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగనుండటంతో శనివారం కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
ఇవే దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రివరకు వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. సాయంత్రం 4 గంటల వరకు సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే, ఈ నెల 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. దీని ప్రభావంతో ఆగస్టు 13, 14, 15 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




