ఢిల్లీలో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్ర.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చే హామీలను ఢిల్లీ ఓటర్లు నమ్మబోరని వ్యాఖ్యానించారు. గతంలో తెలంగాణలో ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రపన్నిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మహారాష్ట్ర హర్యానాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదన్నారు. మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీలు నమ్మి మోస పోయారని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్‌లో చెప్పింది ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. తాము రేవంత్ రెడ్డిని కాదు తిట్టేది.. ఇచ్చిన హామీలను పట్టించుకోని రాహుల్ గాంధీనని వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్‌లో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం టాయిలెట్ ట్యాక్స్ పెట్టిందని విమర్శించారు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికలు పూర్తి కాగానే రైతు బంధు పథకాన్ని పూర్తిగా ఎత్తి వేసే అవకాశముందన్నారు.
ఏసీబీ ,ఈడిలు ఫార్ములా ఈ కేసులో విచారణ పేరుతో టైం పాస్‌లు చేస్తూనే ఉంటాయన్న కేటీఆర్.. సీఎం రేవంత్‌కి దమ్ము ఉంటే లై డిటెక్టర్ పరీక్షకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఫార్ములా ఈ కేసులో ఒక్కొక్క లాయర్ కి రూ.50 లక్షలు ఇస్తున్నారని.. తనపై పెట్టె లాయర్ల ఖర్చు పేదలకు ఇచ్చి హామీలు అమలు చేయొచ్చన్నారు. లై డిటెక్టర్ పరీక్ష చేస్తే ఎవరిది తప్పో తేలిపోతుందని.. దీనికి కేవలం రూ.10 లక్షలు అవుతుందన్నారు. ఫార్ములా ఈ విషయంలో తాను మంత్రిగా నిర్ణయాలు తీసుకున్నట్లు ఏసీబీ, ఈడీలకు చెప్పానని.. ప్రొసీజర్ తప్పు అని నేను ఎక్కడ అనలేదన్నారు. అధికారులు కూడా కరెక్ట్ గా ఫాలో అయ్యారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఫార్ములా ఈ కేసుతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టైం పాస్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రేవంత్ విదేశీ పర్యటనలతో ఒరిగేదేమీ లేదు- కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని కేటీఆర్ అన్నారు. గత విదేశీ పర్యటనలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకి వచ్చినట్లు చెప్పుకున్నారని గుర్తుచేశారు. అయితే రాష్ట్రానికి ఒక్క 40 పైసలు పెట్టుబడి కూడా రాలేదన్నారు. తాను తెలంగాణలో ఎన్ని పరిశ్రమలు తెచ్చానో చెబుతా..కాంగ్రెస్ ప్రభుత్వం గత వన్ ఇయర్‌లో ఎన్ని పరిశ్రమలు తెచ్చిందో చెప్పగలదా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పందిస్తూ.. మణిపూర్‌లో పార్టీ మరిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడారని గుర్తుచేశారు. హైకోర్ట్ తీర్పుని కూడా స్పీకర్ ఫాలో కావడం లేదన్నారు. ఈ సంవత్సరంలో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడంపై దృష్టి పెట్టడం మంచిదన్నారు. కాంగ్రెస్ అవినీతిపై చిత్తశుద్ధి ఉంటే అమృత్ స్కామ్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని సవాల్ చేశారు.