ఆన్‌లైన్‌లో గేదెలు అమ్మకం పేరిట ఘరానా మోసం.. రూ.1.28 లక్షలు కుచ్చుటోపీ! చివరికి ఏం జరిగిందంటే..
ఆన్ లైన్ లో గేదెలు అమ్మకం అనే ప్రకటన చూడగానే వెంటనే ఆ వ్యక్తిని సంప్రదించాడో వ్యక్తి. ఇంకే ముంది.. ఆన్ లైన్ లేదు.. గేదెలు లేవు.. డబ్బులు లేవు.. ఏమి జరిగిందో మీరే చూడండి. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో ఆన్ లైన్ లో గేదెను కొనుగోలు చేద్దాం అని మోసపోయి రూ.1.28 లక్షలు పోగొట్టుకున్న సంఘటన..

ఖమ్మం, సెప్టెంబర్ 8: ఆన్ లైన్ లో గేదెలు అమ్మకం అనే ప్రకటన చూడగానే వెంటనే ఆ వ్యక్తిని సంప్రదించాడో వ్యక్తి. ఇంకే ముంది.. ఆన్ లైన్ లేదు.. గేదెలు లేవు.. డబ్బులు లేవు.. ఏమి జరిగిందో మీరే చూడండి. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో ఆన్ లైన్ లో గేదెను కొనుగోలు చేద్దాం అని మోసపోయి రూ.1.28 లక్షలు పోగొట్టుకున్న సంఘటన బోనకల్ మండలం చిరునోములలో చోటు చేసుకుంది. బాధితుడు దూబ కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..
డిగ్రీ చదువుతున్న తన కుమారుడు అజయ్ బుధవారం మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో ఆన్ లైన్ లో గేదెను బేరం చేశాడు. ఒక గేదె రూ.65 వేలకు ఇస్తానని అవతలి వ్యక్తి నమ్మించి చెప్పడంతో అంగీకరించాడు. రవాణా ఖర్చులకు ముందుగా రూ.3వేలు చెల్లించమని కోరడంతో 95509 69490 నెంబర్ కు ఫోన్ పే చేశాడు. గేదె ఉన్న చిరునామాకు వచ్చిన తరువాత మిగిలి పైకం చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. కానీ గురువారం ఉదయం ఫోన్ చేసి గేదెను వాహనంలో ఎక్కించాం, సాయింత్రంలోగా వస్తుంది డబ్బులు చెల్లించమని అడగడంతో తండ్రికి చెప్పకుండానే మరో రూ.65వేలు ఫోన్ పే చేశాడు. మరల మరో రూ.65 వేలు పంపితే ఆ డబ్బులు తిరిగి నీ ఖాతాకు వస్తాయని చెప్పాడు ఆ ఆగంతకుడు. అవతలి వాళ్ల మాయమాటలు నమ్మి ఉదయం 11 గంటల నుంచి సాయింత్రం 6 గంటల వరకు మొత్తం రూ.1,28,399 ఫోన్ పే చేశాడు.
మరల సాయంత్రం మరో రూ.40వేలు పంపమని చెప్పడంతో అనుమానం వచ్చి విషయం తండ్రికి చెప్పాడు. మోసం జరిగిందని గుర్తించిన తండ్రి కోటేశ్వరరావు స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని వారు సూచించడంతో ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారు. ఖమ్మం సైబర్ క్రైం పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. మోసగాడు పంపిన ఆధార్, పాన్ కార్డులను పరిశీలించారు. అశోక్ శర్మ పేరుతో ఆధార్, పాన్ కార్డులుండగా ఫోన్ పే నెంబర్ మాత్రం వేరొకరి పేరిట ఉంది. ఇదిలా ఉండగా రాత్రి 8.30 గంటల సమయంలో మోసగాడు బాధితుడు అయిన అజయ్ కు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశావు కదా. ఇప్పుడు నీకేం భయంలేదు. నీ డబ్బులు నీకు వస్తాయి అంటూనే మిగిలిన రూ.40వేలు పంపమని అడగడం గమనార్హం. ఆశకు పోతే దురాశ ఎదురైందని తమకు న్యాయం చేసి పోయిన డబ్బులు తిరిగి ఇప్పించాలని వేడుకుంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




